Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

ఇలాగే చూస్తూ ఉంటే.. ఇంకేమీ మిగలదు.., అర్థమవుతోందా సీఎం గారూ!?

టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోవడం వరకు రేవంత్ రెడ్డి ప్రతి కార్యక్రమం సంచలనం.. ఏకైక కుమార్తె పెళ్ళి కూడా దగ్గరుండి చేసుకోలేని పరిస్థితులు కేసీఆర్ కల్పించాక, జైలుకు వెళ్లొచ్చాక రేవంత్ రెడ్డి పరిస్థితి పూర్తిగా భిన్నం. జనంలో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఎవరూ ఊహించని రీతిలో పదేళ్ల కేసీఆర్ అధికారాన్ని దూరం చేసి ఆయన్ని ఫామ్ హౌస్ కే పరిమితం చేసి రేవంత్ రెడ్డి సూపర్ సక్సెస్ అయ్యారు. అధికారం చేపట్టాక కూడా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వారెవ్వా అనిపించారు. సూటిగా మాట్లాడుతూ కేసీఆర్ ను ఢీ కొడుతూ కొండొకచో తిట్లలోనూ పోటీ పడుతూ తన సత్తా చాటుకున్నారు రేవంత్ రెడ్డి.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ఫైల్ ఫొటో)

కానీ, గత మూడు నెలలుగా ప్రతిపక్షాల ఉచ్చులో ఎందుకు పడినట్లు? ప్రతి విషయంలోనూ ప్రతిపక్షాలదే ఎందుకు పైచేయి అవుతున్నట్లు? ఎక్కడ తప్పు జరుగుతున్నట్లు? రేవంత్ రెడ్డిలో ఎందుకు మార్పు వచ్చినట్లు? కాకలు తీరిన కాంగ్రెస్ నేతలు ఎందుకు తాత్సారంగా సినిమా చూస్తున్నట్లు? దుష్ప్రచారం ఎందుకు పడగలు విప్పినట్లు? ప్రభుత్వంలో వున్న మంత్రులు ఎందుకు తిప్పి కొట్టలేకపోతున్నట్లు? ప్రభుత్వంలో సలహాదారులు ఏంచేస్తున్నట్లు? అధికార పార్టీలో అధికార ప్రతినిధులు ఎందుకు మూగబోయినట్లు? ఆలోచించాల్సిన విషయాలు.. ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అంశాలు.

చిన్న చిన్న అంశాలను కాసేపు పక్కన పెడితే, మూడు అంశాలు తెలంగాణ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకటి హైడ్రా, రెండు మూసీ, మూడు కంచె గచ్చిబౌలి భూవివాదం. నిజానికి ఈ మూడు అద్భుత నిర్ణయాలే. హైదరాబాద్ అభివృద్ధికి, సుందరీకరణకు, ఆదాయానికి మూడు బృహత్ కార్యక్రమాలే. కానీ, ప్రతిపక్షాలు అడ్డుపడి ఆ మూడింటిపై చేసిన దుష్ప్రచారం ఒక గొప్ప అస్త్రంలా జనంలోకి బాగా పంపించడంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు సక్సెస్ అయ్యాయి. ప్రభుత్వం ఏ మంచి కోసం తలపెట్టిందో ప్రజలకు వివరణ ఇవ్వడంలో బొక్కా బోర్లా పడింది. దీన్నే రాజకీయం అంటారు. ప్రతిపక్షాలు విసిరిన వలలో అధికార పక్షం ఇరుక్కోవడం అంటారు. ఆయా అద్భుత ప్రాజెక్టులను ప్రజలకు వివరించకుండా ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోయడం జనానికి నచ్చలేదు. ప్రతిపక్షాలు ఈ మూడు ప్రాజెక్టులను ముందుకు వెళ్ళనీకుండా భూతద్దంలో కష్టాలను చూపించి మొత్తానికి విజయం సాధించారు.

హైడ్రా కూల్చివేతల దృశ్యం (ఫైల్ ఫొటో)

రేవంత్ రెడ్డి ప్రారంభించిన హైడ్రా తీసుకుంటే అదొక అద్భుతం. పది నిముషాల కుండపోత వర్షం దంచి కొడితే హైదరాబాద్ వీధులు నదులను తలపిస్తాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయిపోతుంది. దీనికి కారణం ఎవరూ అంటే జనమే. జనంలోంచి వచ్చిన బిల్డర్లు, పెట్టుబడిదారులు, వ్యాపారులు, కొనుగోలుదార్లు, అధికారులు, రాజకీయ నాయకులు. ఇష్టం వచ్చినట్లు చెరువులు ఆక్రమించేసి అపార్టుమెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు కట్టిపడేయడం. వెనకా ముందూ చూడకుండా నిబంధనలను గుడ్డిగా తొక్కిపెట్టి అక్రమ లే అవుట్లకు అనుమతి ఇచ్చిన అధికారులు, ప్రభుత్వ రాజకీయ పెద్దలు అందరూ దోషులే! చిన్నా చితకా పనుల కోసం వివిధ జిల్లాల నుంచి వలస వచ్చిన పేదలు ఇష్టం వచ్చిన చోట ఆక్రమించి గుడిసెలు వేసుకోవడం, కొన్నాళ్ళకు వాటిని పక్కా ఇళ్లుగా మార్చుకోవడం, వాటికి ఆమ్యామ్యాలు తీసుకుని అధికారులు అనుమతులు ఇవ్వడం.. ఇలా అభివృద్ధి పేరిట హైదరాబాద్ ను మహా నగరంగా మార్చి నాశనం చేసిన పాపం తలా పిడికెడు. ఇన్నాళ్ల తరువాత మొనగాడుగా మహా నాయకుడుగా వచ్చిన రేవంత్ రెడ్డి ఈ అక్రమ కట్టడాలపై విరుచుకుపడ్డారు. ఇందులో ఆక్రమణదారులు బడా బాబులు నుంచి సామాన్య పేద వారి వరకు ఉన్నారు. బడా బాబులు పేద వారిని ముందుకు నెట్టి తమాషా చూస్తే, ప్రతిపక్షాలు ఆజ్యం పోసి సక్సెస్ అయ్యాయి. ఇక్కడే హైడ్రా ఫెయిల్.

మూసీ నది (ఫైల్ ఫొటో)

మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ నిర్ణయం మరో మహా అద్భుతం. భాగ్యనగరంలో మూసీ చుట్టూ పక్కల ఎంతో మంది ఆక్రమించి ఇళ్ళు కట్టుకుని ఆ కంపునే అలవాటుగా చేసుకుని నివసిస్తున్నారు. కొందరు మేడలు కట్టి అద్దెలకు ఇచ్చి బతుకుతున్నారు. ఒకప్పుడు అద్భుతమైన సౌందర్య మూసీ నది ఇప్పుడు పూర్తిగా కాలుష్యమయం. దాన్ని ప్రక్షాళన చేసి అందమైన పర్యాటక నదిగా, భాగ్యనగరానికి నెలవంకగా మార్చాలని, అటు నల్గొండ జిల్లాల ప్రజలకు పంట పొలాలకు నీరు అందించే బృహత్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలని రూపకల్పన చేసి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ప్రకటించారు. అంతే మళ్ళీ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. ఆక్రమించిన పేదలను ముందు పెట్టి కబడ్డీ ఆడించారు. అక్కడ ప్రతిపక్షాలు విజయం సాధించాయి. అధికార మూసీ రివర్ ఫ్రంట్ ఫెయిల్.

కంచ గచ్చిబౌలి భూముల చదును దృశ్యం (ఫైల్ ఫొటో)

ఇక కంచె గచ్చిబౌలి వివాదం.. అసలు యూనివర్సిటీకి సంబంధం లేని వ్యవహారం. అందులో 200 ఎకరాలు అమ్మి ఆదాయం సమకూర్చుకోవాలని, మరో 200 ఎకరాలు ఐటీ, ఏఐ హబ్ గా మార్చి వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించి అభివృద్ధి చేయాలని నిర్ణయించిన గొప్ప అద్భుత నిర్ణయం. కానీ, ప్రజలకు వివరించడంలో ప్రభుత్వం ఫెయిల్. వన్య ప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ అంటూ ప్రతిపక్షాలు గోల చేశాయి. యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతం అంటూ విద్యార్థులు నిరసనకు దిగారు. చివరకు సుప్రీం కోర్టు స్టే ఇవ్వడం, ఎవ్వరూ కొనవద్దని కేటీఆర్ హెచ్చరించడం, కేంద్ర మంత్రులు స్పందించడంతో చివరకు రేవంత్ రెడ్డి ఎకో పార్క్ అని ప్రకటించడం అంతా గందరగోళం.. తొందరపాటు నిర్ణయం. నిజానికి పాతికేళ్లుగా కోర్టులో వున్న ఆ భూమి వివాదం రేవంత్ రెడ్డి హయాంలో పరిష్కారమై వచ్చింది. దాన్ని రాజకీయ అంశంగా మలచుకుని గొప్పగా ప్రచారం చేసుకోవాల్సింది పోయి భంగపాటుకు గురవ్వడం విచిత్రం విడ్డూరం. ఇక్కడ కూడా ప్రతిపక్షాలదే సక్సెస్. ఇక్కడ కూడా అధికార పక్షం ఫెయిల్.

సీఎం రేవంత్ రెడ్డి (ఫైల్ ఫొటో)

రేవంత్ రెడ్డికి మంత్రి స్థాయి అనుభవం లేకున్నా అతని ఆలోచనలు అద్భుతం. ప్రతి సబ్జెక్ట్ లోను పట్టు ఉండటం అతని ప్లస్. త్వరత్వరగా అతను తీసుకునే నిర్ణయాలు, ఆశువుగా మాట్లాడే ప్రసంగాలు మహా అద్భుతం. నోటి దురుసు, దుందుడుకు చర్యలు కొంత మేరకు మైనస్ అయినా మొత్తానికి ఎవ్వరూ ఊహించని స్థాయి నేతగా పరిణామక్రమం చెందిన విషయం వాస్తవం. ఒప్పుకుని తీరాల్సిన అంశం. ఇంతటి క్రేజ్ వున్న మరో నాయకుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో లేరు. తమకు సత్తా ఉందని అనుకోవడం ఆయా నాయకుల వాపు మాత్రమే. ఎన్నేళ్లు గా పార్టీలో ఉన్నామన్నది ముఖ్యం కాదు. పార్టీకి ఏం చేశామన్నదే ముఖ్యం. ఆ చరిష్మా ఒక్క రేవంత్ రెడ్డికే సాధ్యం.

ఇప్పటికీ ఏం మించిపోలేదు. మంచి సలహాదారులు, బాగా మాట్లాడగలిగే సమర్ధులైన అధికార ప్రతినిధులను నియమించుకుని ప్రతి అంశాన్ని జనంలోకి తీసుకెళ్లేలా కృషి చేయాలి. ఆయా శాఖల్లో ఎన్నో ఏళ్లుగా తిష్ట వేసిన కీలక అధికారులను మార్చి ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేయాలి. అన్నిటికి ఒక్కరే మాట్లాడటం కూడా ప్రభుత్వానికి మంచిది కాదు. అన్నీ ఒక్కడే చేయాలనుకోవడం కూడా మంచిది కాదు. నేతలందరిని కలుపుకుపోతున్నట్లే వివిధ అంశాల్లో ఎవరెవరిని ఉపయోగించాలో వారిని వ్యూహాత్మకంగా ఉపయోగించాలి.. అప్పుడే సక్సెస్. ఇప్పటికే వదంతులు ప్రచారమై జనంలో అధికశాతం వ్యతిరేకత వ్యాపించింది. ఇలాగే చూస్తూ పోతే ఇంకేమీ మిగలదు. జాగ్రత్తపడాల్సిన అవసరం ఆవశ్యకత స్పష్టంగా కనిపిస్తోంది రేవంత్ రెడ్డి గారూ!

– డా. మహ్మద్ రఫీ

Popular Articles