సినీ ఫెడరేషన్ నాయకులారా..! మీకు బహిరంగ లేఖ!!
ఏ పరిశ్రమలో అయినా సమ్మె అనేది శుభకార్యం కాదు. వినోదం అంతకన్నా కాదు. ఒక రకమైన విషాదమే! ఈ స్థితిలో 24 క్రాఫ్ట్స్ వారిని సమ్మెకు ఉసిగొలిపారు సంతోషమే! ఇవాళ దిగ్విజయమైన 12వ రోజు సమ్మె! కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి.. అని నినాదాలు దంచుతూ ఎవరైనా ఒక కార్మికుడు షూటింగ్ లో పాల్గొంటే మరో కార్మికునితో అతనిని కొట్టించి మరీ షూటింగ్ లు ఆపించారు. శభాష్ …కార్మికులు వర్ధిల్లాలి. కార్మిక నాయకులు వర్ధిల్లాలి!
కానీ చిన్న సందేహం!

ఆయనెవరో ఒక ప్రముఖ నిర్మాత, పేరు రామ సత్యనారాయణ అట. పదిహేను సినిమాలు ఒకే రోజు ప్రారంభిస్తున్నాడు. అది ప్రపంచ రికార్డు కోసమట! సరే.. ఆయన సరదా ఆయనది. ఇవాళ స్వాతంత్య్ర దినోత్సవం… ఒకేసారి 15 సినిమాలు ప్రారంభం. అందులో మన కార్మికులు ఒక్కరు కూడా లేరా? మరి మన కార్మికులు లేకుండా ఆ పదిహేను సినిమాలు జరుగుతున్నప్పుడు మిగతా సినిమాలు ఎందుకు జరగకూడదు? అంతకంటే ముఖ్య విషయం ఏమిటంటే, నాయకులుగా సమ్మెకు పిలుపునిచ్చిన మీరు ఆ 15 సినిమాల ప్రారంభ వేడుకలో పాల్గొని దండలు వేయించుకుని శాలువాలు కప్పించుకున్నారు. సదరు నిర్మాత గిన్నీస్ బుక్కులోకి ఎక్కే ప్రయత్నానికి మీరు మన కార్మికులను పిన్నీసుతో పొడుస్తారా ? దబ్బనంతో గుచ్చుతారా?

మీ ఇంట్లో పది తరాలకు తినడానికి సరిపడా సంపాదించుకున్నారు. మేం ఏ రోజు మెతుకు ఆ రోజే బతుకు.. అన్న చందాన బతుకుతున్న వాళ్ళం. మా నాయకులుగా ఫెడరేషన్ అనే బోర్డుతో మీరు, ఛాంబర్ అనే బోర్డుతో మన ప్రత్యర్ధులు హోరాహోరీగా పోరాడుతున్నారా? లేక పోరాడుతున్నట్టు నటిస్తున్నారా? అర్ధం కావటం లేదు! ఎందుకంటే ఈ గిన్నీస్ బుక్ లోకి ఎక్కే మహాకార్యక్రమంలో మీరందరూ కలిసి చెట్టాపట్టాలేసుకుంటూ ఆ కార్యక్రమానికి శుభం కార్డు వేసే నేపథ్యంలో మాకు ‘THE END’ కార్డు వేస్తున్నట్టుగా అనిపిస్తంది!
ఆలోచించండి! జెర శోచాయించుండ్రి!
(గుండె లోతుల్లోంచి తన్నుకొచ్చిన ఆవేశం, ఆక్రోశం మధ్య గూడు కట్టుకున్న అట్టడుగు ఒక సినీ కార్మికుడి ఆవేదన ఇది)
– డా. మహ్మద్ రఫీ