రంపచోడవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్ పై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ గురువారం విశాఖలోని కైలాసగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈ ఎన్కౌంటర్ కు దారి తీసిన పరిస్థితులను వివరిస్తూ మీడియాతో మాట్లాడారు.
ఈనెల 18వ తేదీన విశ్వసనీయ సమాచారంతో కింటుకూర అటవీ ప్రాంతంలో పోలీస్ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పారు. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా మావోయిస్టులు పోలీసులపై కాల్పులు ప్రారంభించినట్లు చెప్పారు. వెంటనే పోలీసులు తమ ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపగా, ఒక పురుషుడు, ఇద్దరు మహిళలు మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతులను మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ గణేష్ అలియాస్ ఉదయ్ అలియాస్ ఆనంద్ గా, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు వెంకట రవి చైతన్య అలియాస్ అరుణ అలియాస్ రూప్సి, మరో మహిళను అంజు అలియాస్ మాసేగా గుర్తించామన్నారు.

గణేష్ పై అల్లూరి జిల్లాలో దాదాపు 150కిపైగా కేసులు ఉన్నాయని, రూ. 25 లక్షల నగదు రివార్డు ఉన్నట్లు చెప్పారు. అదేవిధంగా అరుణపై కూడా 150పైగా కేసులు ఉన్నాయని, ఆమెపై రూ. 20 లక్షల నగదు రివార్డు, అంజుపై 22పైగా కేసులు, లక్ష రూాపాయల నగదు రివార్డు ఉన్నట్లు చెప్పారు. ఘటనా స్థలంలో మూడు ఏకే-47 ఆయుధాలను, కిట్ బ్యాగులు, ఖాళీ తూటాలు, నగదు, మావోయిస్ట్ పార్టీ సాహిత్యం, ఆలివ్ గ్రీన్ దుస్తులతోపాటు ఇతర సామాగ్రి లభ్యమైనట్లు ఎస్పీ అమిత్ బర్దర్ వివరించారు.
ఈ ముగ్గురు మావోయిస్టులు ఇటీవల వై. రామవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని సేశరాయి, మంప పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంటవరం, కాకులమామిడి వద్ద జరిగిన ఎదురుకాల్పుల నుంచి తప్పించుకున్నట్లు చెప్పారు. అరకు ఎమ్మెల్యే సర్వేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే సోమ హత్యల్లో, అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని కోటగున్నల బ్లాస్టింగ్, బలిమెల ఘటన, కొండ్రుం మందుపాతర పేల్చవేత తదితర ప్రధాన ఘటనల్లోనూ ఎన్కౌంటర్ లో చనిపోయిన మావోయిస్టులు నిందితులని ఎస్పీ అమిత్ బర్గర్ విలేకరుల సమావేశంలో చెప్పారు.

