గుజరాత్ లోని అహ్మదాబాద్ వద్ద ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి లండన్ కు బయలుదేరిన ఫ్లయిట్ నెం. ఏఐ-171 విమానం కూలిపోయింది. రన్ వే నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
తాజా సమాచారం ప్రకారం.. విమానం బీజే ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ భవనంపై కూలింది. హాస్టల్ లోని పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విమానం కూలిన సమయంలో భోజనం చేస్తున్న విద్యార్థులు ఇదే భవనంలో ఉన్నట్లు తెలుస్తోంది. కుప్పకూలిన ఎయిరిండియా విమానంలోని 242 మంది ప్రయాణీకుల్లో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చుగల్, మరొకరు కెనడా జాతీయులుగా తెలిసింది.
