హైదరాబాద్: సాగుచేసే ప్రతి రైతుకు అవసరమైన మేర సమృద్ధిగా యూరియా సకాలంలో పంపిణీ చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలంగాణా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి యూరియా బుకింగ్ యాప్, పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సోమవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నుంచి సరఫరా సరిగ్గా లేని కారణంగా గత సీజన్ లో యూరియా సరఫరాలో కొంత ఇబ్బందులు వచ్చినప్పటికీ, రైతులకు 9.5 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు సరఫరా చేశామన్నారు. ప్రస్తుత యాసంగి సీజన్ కు ఎటువంటి యూరియా కొరత లేదన్నారు. జిల్లా కలెక్టర్ల నుంచి ప్రతిపాదన అందిన వెంటనే స్టాకు పంపడం జరుగుతున్నదని చెప్పారు. యూరియా పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్యాక్స్ కేంద్రాలలో, ప్రైవేటు డీలర్ల వద్ద అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. యూరియా కొనుగోలు కోసం వచ్చే రైతులకు నీడ ఉండేలా షామియానా, తాగునీటి వసతి కల్పించాలని మంత్రి ఆదేశించారు.
యాప్ వినియోగంలేని జిల్లాలలో రైతుల పట్టా దార్ పాస్ పుస్తకాలను పరిశీలించి భూ విస్తీర్ణం ఆధారంగా యూరియా అమ్మకాలు జరిగేలా చూడాలన్నారు. వ్యవసాయ విస్తరణాధికారులు, సంబంధిత సిబ్బందిని సేల్ పాయింట్స్ వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాల్లో గల యూరియా స్టాక్ వివరాలతో ప్రెస్ నోట్ విడుదల చేయాలని, ప్రతి సెంటర్ వద్ద అవసరమైన మేర యూరియా స్టాక్ అందుబాటులో ఉంచాలని మంత్రి సూచించారు.
యూరియా రైతులకు మాత్రమే చేరాలని, ఇతర అవసరాల కోసం బదిలీ కావద్దని మంత్రి స్పష్టం చేశారు. ప్రతిరోజు యూరియా స్టాక్ వివరాలను కలెక్టర్లు పరిశీలించాలని, అవసరం ఉన్న చోట వెంటనే పంపిణీ చేయాలన్నారు. రాబోయే పది రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా యూరియా బుకింగ్ యాప్ వినియోగంలోకి వస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు మాట్లాడుతూ, సకాలంలోయూరియా పంపిణీ రైతులకు సంబంధించిన సున్నితమైన అంశమని, దీనిని జిల్లా కలెక్టర్ లు రెగ్యులర్ గా మానిటర్ చేయాలని సూచించారు. జిల్లాలో అందుబాటులో ఉన్న యూరియా స్టాక్, డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, ప్రతిరోజు ఎంత యూరియా పంపిణీ జరుగుతుందనే అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 2 లక్షల 15 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఎక్కడ ఎటువంటి కొరత లేదని, మొత్తం 11 వేల 912 సేల్ పాయింట్ల ద్వారా యూరియా రైతులకు విక్రయిస్తున్నామన్నారు. మహబూబ్ నగర్, జనగాం, నల్గొండ, పెద్దపల్లి, ఆదిలాబాద్ జిల్లాలలో డిసెంబర్ 20 నుంచి పైలెట్ ప్రాజెక్టు కింద యూరియా బుకింగ్ యాప్ ద్వారా యూరియా సరఫరా జరుగుతుందని, 82 వేల 59 మంది రైతులు 2 లక్షల 1 వేల 789 బ్యాగుల యూరియా యాప్ ద్వారా కొనుగోలు చేశారని తెలిపారు.

