Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

నిఖార్సైన రికార్డులు తయారు చేస్తాం: మంత్రి తుమ్మల

రాష్ట్రంలో నిఖార్సయిన భూరికార్డులు తయారు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. భూముల ధరలు పెరిగిపోవడం వల్ల అన్నదమ్ములు, స్నేహితుల మధ్య కూడా గొడవలు జరిగి హత్యల వరకు దారి తీస్తున్నాయన్నారు. వీటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకు వచ్చిందన్నారు. పైలెట్ ప్రాజెక్టు నుంచి వచ్చిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, మన శక్తి మేరకు వేగవంతంగా సర్వే చేసి నిఖార్సైన రికార్డులు తయారు చేస్తామని మంత్రి చెప్పారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం ములుగుమాడు గ్రామంలో భూ భారతి సర్వే, రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ పట్టాపాస్ పుస్తకాలలో ఉన్న తప్పుల కారణంగా రైతులు చాలా ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు. గ్రామంలో ఉన్న తక్కువ విస్తీర్ణం భూమికి కూడా కొన్ని చోట్ల పట్టాలలో వేల ఎకరాలు ఉన్నట్లు ఉందని, దీనివల్ల ప్రభుత్వంపై కూడా భారం పడుతుందని మంత్రి తెలిపారు. దేశంలో శాంతి భద్రతలు మన తెలంగాణ రాష్ట్రంలోనే అద్భుతంగా ఉన్నాయని, ప్రజా ప్రభుత్వం భారీ ఎత్తున పెట్టుబడులను సాధించిందని, ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడుతుందని మంత్రి అన్నారు.

భూముల రికార్డులు సక్రమంగా నిర్వహించేందుకు రైతులు, భూ యాజమానుల నుంచి టోకెన్ అమౌంట్ సేకరించాలని మంత్రి సూచించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసమే భూ భారతి చట్టం అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఒకే సంవత్సరంలో 36 వేల కోట్ల రూపాయలను నేరుగా అందించామని తెలిపారు. నాట్లకు ముందే రైతు భరోసా పథకం నిధులు ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం మొదటి విడత క్రింద ప్రభుత్వం 4 లక్షల 50 వేల ఇండ్లను మంజూరు చేసిందని, వీటిని గుడిసెలలో ఉండే పేదలను ఎంపిక చేసి అమలు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఒక అనర్హుడికి ఇండ్లు కేటాయించినా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మంత్రి స్పష్టం చేశారు. రోడ్లు విశాలంగా ఉంటే ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, రోడ్డు విస్తరణ కోసం ప్రజలు ముందుకు రావాలని మంత్రి తెలిపారు. దేశానికే తలమానికంగా భూ భారతి చట్టం మన జిల్లాలో అమలు చేయడం జరుగుతుందన్నారు.

Popular Articles