Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి శ్రీకారం

అశ్వారావుపేట: తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకం, ప్రకృతి వ్యవసాయ విధానాల అమలుకు అశ్వారావుపేటను కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని పథకాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా రైతు మేళా, టీజీ ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భూసార పరీక్ష–ఆయిల్‌పామ్ పత్రాల సమగ్ర పరిశీలనా ప్రయోగశాల, నేషనల్ మిషన్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమాలను మంత్రులు ప్రారంభించారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో బయోడైవర్సిటీ పార్కు ఏర్పాటు, రూ. 5.00 కోట్లతో బాలికల వసతి గృహ నిర్మాణం, రూ. 3.00 కోట్లతో 3 కిలోమీటర్ల బీటీ రహదారుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
వ్యవసాయ యంత్ర పరికరాలు, ఆధునిక సాంకేతిక సేద్య పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం, యాంత్రీకరణ సామగ్రితో ఏర్పాటు చేసిన ప్రదర్శన శాలలను మంత్రులు పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడారు. అనంతరం రైతు మేళాలో పాల్గొన్నారు.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్బంగా మాట్లాడుతూ, దివంగత ఎన్టీఆర్ ఇచ్చిన మంజూరుతో సుమారు 35 సంవత్సరాల క్రితం స్థాపించిన అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల దేశ విదేశాల్లో నిపుణులను తయారు చేస్తున్న ప్రతిష్టాత్మక సంస్థగా ఎదిగిందన్నారు. ఈ కళాశాల అభివృద్ధికి వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రూ. 8.00 కోట్ల నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ కళాశాల కంటే మిన్నగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏ పంట వేసినా పండించే సామర్థ్యం ఉన్న రైతులు ఉన్నారని ప్రశంసించారు. ఆయిల్‌పామ్ సాగులో కోకో, మిరియాలు, జాజి వంటి అనుబంధ పంటలను కూడా రైతులు విజయవంతంగా సాగు చేస్తున్నారని తెలిపారు. గిరిజన రైతులు అధికంగా ఉన్న ఈ జిల్లాలో గోదావరి జలాలతో పాటు అధిక ఆదాయం ఇచ్చే ఆధునిక పంటలను సాగు చేసి జిల్లా తెలంగాణకే కాకుండా దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యంగా అధికారులు ముందుకు సాగుతున్నారని చెప్పారు. చిన్న, సన్నకారు, గిరిజన, బీసీ రైతుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి చొరవతో 50 శాతం సబ్సిడీతో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. వచ్చే 2047 నాటికి వ్యవసాయ రంగం ద్వారా 400 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయం రెండూ రైతులకు అత్యంత ఉపయోగకరమైన పథకాలన్నారు. గతంలో నిలిచిపోయిన యాంత్రీకరణ పథకాలను పునఃప్రారంభించి 50 శాతం సబ్సిడీతో రైతులకు యంత్ర పరికరాలు అందించడం శుభపరిణామమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.31 లక్షల మంది రైతులకు రూ.101 కోట్ల వ్యయంతో వ్యవసాయ పరికరాలు అందించనున్నట్లు తెలిపారు.

ప్రకృతి వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో నాచురల్, ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వరి ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, ఈ సీజన్‌లో 148 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి జరిగిందన్నారు. వరి కొనుగోలులో 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడంతో పాటు బోనస్ కూడా అందజేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో అశ్వారావుపేట, భద్రాచలం ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Popular Articles