తెలంగాణా మంత్రివర్గ సమావేశం సోమవారం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్ లో నిర్వహించే కేబినెట్ మీటింగులో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా కుల గణన సర్వేపై ఏర్పాటు చేసిన స్వతంత్ర నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను ఆమోదించే అవకాశం ఉంది. అదేవిధంగా వ్యవసాయ శాఖకు సంబంధించి యూరియా నిల్వలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. పటాన్ చెరులో ఇటీవల జరిగిన సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాద ఘటనపై అధికారుల నివేదికపై చర్చించనున్నారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీ పోస్టుల భర్తీ, గోవుల సంరక్షణ, గోశాలల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టుల తీరుతెన్నులు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ వంటి అనేక కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగే అవకాశమున్నట్లు సమాచారం.
