Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

మహిళా ఎస్ఐపై దౌర్జన్య ఘటన: ఖమ్మం సీపీ ప్రకటన

కల్లూరులో మహిళ ఎస్సైతో దురుసుగా ప్రవర్తించిన వ్యక్తుల ఘటనపై ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఉదంతంలో విధి నిర్వహణలో గల కల్లూరు పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ హరితతో దురుసుగా ప్రవర్తించిన ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీపీ తెలిపారు. మొత్తం ఘటన పూర్వాపరాలను ఆయన వివరించారు.

తల్లాడ గ్రామానికి చెందిన రాయల రామారావుతో పాటు కొంతమంది యువకులు శుక్రవారం సాయంత్రం మద్యం మత్తులో కల్లూరు పట్టణం ఎన్నెస్పీ క్రాస్ రోడ్డులోని చౌదరి హోటల్ వద్దకు వచ్చి గొడవ చేస్తున్నారని హోటల్ యజమాని అయిన మాగంటి బోసుబాబు కల్లూరు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశారు. దీంతో తమకు అందిన ఫిర్యాదుపై పోలీసులు క్రైం నెం. 102/2025 ద్వారా 329(4), 296(b), 79, 189 (2) r/w 190 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసు విచారణలో భాగంగా ఘటనా ప్రాంతానికి ఎస్ఐ వెడుతున్నట్లు సమాచారం తెలుసుకున్న రాయల రామారావు తన అనుచరులతో మళ్లీ హోటల్ వద్దకు వచ్చి సాక్షులుగా ఉన్న హోటల్ సిబ్బందిని, యజమానిని బెదిరింపులకు గురి చేశాడు. తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినట్లయితే ఇబ్బందులకు గురి చేస్తానని హోటల్ నడవనివ్వనని హోటల్ ముందు కుర్చీ వేసుకుని కూర్చుని న్యూసెన్స్ చేస్తున్నాడనే సమాచారంతో ఎస్ఐ హరిత తన సిబ్బందితో హోటల్ వద్దకు వెళ్ళారు. ఈ సందర్భంగా తన ఎదురుగానే రాయల రామారావు @ రాముతో పాటు అతని అనుచరులు మద్యం మత్తులో గొడవ చేస్తుండగా, వారిని అక్కడి నుండి పంపించి కేసు విచారణ చేయాలనే ఉద్దేశ్యంతో ఎస్ఐ వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు.

ఈ క్రమంలో రాయల రామారావు @ రాము, అతని అనుచరులు డ్యూటీలో ఉన్న మహిళా అధికారి విధులకు ఆటంకపరుస్తూ దౌర్జన్యంగా దాడి చేసి బెదిరింపులకు దిగారని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఈ నేపథ్యంలో కల్లూరు ఎస్సై ఫిర్యాదు మేరకు Cr.no-103/2025 U1s 74, 189, 191 (2), 195, 132, 351(2) 2/2 190 BNS. See 7 (1) మరో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మొత్తం పదిమందిపై కేసు నమోదు కాగా ప్రధాన నిందితుడు రాయల రామారావుతో పాటు మొత్తం ఏడుగురిని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. గతంలో రాయాల రామారావుపై తల్లాడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిందని కూడా సీపీ ఈ సందర్భంగా తెలిపారు.

పోక్సో కేసులో ఒకరి అరెస్ట్:
కాగా చింతకాని మండల పరిధిలోని గ్రామంలోని ఒక మైనర్ బాలికను వేధించిన కేసులో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం ఆర్బన్ మండలం, కొత్తగూడెం ప్రాంతానికి చెందిన నిందితుడు షేక్ ఇర్ఫాన్ పై చింతకాని పోలీస్ స్టేషన్ లో ఈమేరకు Cr.no.158/25,U/s.329(4),74,75,64 r/w.62 BNS, Sec.12 & 8 పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితున్ని శనివారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు వైరా సీఐ సాగర్ తెలిపారు.

Popular Articles