కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ, ఇంజనీర్-ఇన్-చీఫ్ హరిరామ్ నివాసాలపై జరిపిన దాడుల్లో కనుగొన్న ఆస్తుల వివరాలను తెలంగాణా అవినీతి నిరోధక శాఖ వెల్లడించింది. కాళేశ్వరం కుంభకోణంలో ENC హరిరామ్ పై అక్రమాస్తుల కేసును ఏసీబీ నమోదు చేసింది. నీటిపారుదల శాఖ ENC హరిరామ్ ఇంటిపైనేగాక, రాష్ట్ర వ్యాప్తంగా మరో 13 చోట్ల ఏసీబీ అధికారులు శనివారం దాడులు నిర్వహించిన భారీ ఎత్తున అక్రమంగా ఆస్తులను కూడబెట్టినట్లు కనుగొన్నారు. దాడుల అనంతరం ENC హరిరామ్ ను అరెస్ట్ చేసి, గుర్తించిన అతని అక్రమాస్తుల వివరాలను ఏసీబీ వివరించింది.

ఏసీబీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. షేక్ పేట, కొండాపూర్ లలో రెండు విల్లాలు, శ్రీనగర్ కాలనీ, మదాపూర్, నార్సింగ్ లలో ఒక్కో ఫ్లాట్ చొప్పున మొత్తం మూడు ఫ్లాట్లు, అమరావతిలో వాణిజ్య స్థలం, మర్కుక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్ చెరులో 20 గుంటల స్థలం, శ్రీనగర్ కాలనీలో రెండు ఇండిపెండెంట్ ఇండ్లు, బొమ్మల రామారంలో ఆరెకరాల మామిడితోటతో కూడిన ఫాం హౌజ్, కొత్తగూడెంలో నిర్మాణంలో గల భవనం, ఖుత్బుల్లాపూర్, మిర్యాలగూడల్లో రెండు ఓపెన్ ప్లాట్లు, ఒక బీఎండబ్ల్యూ సహా నాలుగు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను కలిగి ఉన్నట్లు ఏసీబీ సోదాల్లో వెలుగు చూసింది.

తన అధికార హోదాను ఉపయోగించి ENC హరిరామ్ ఈ ఆస్తులను కూడబెట్టినట్లు ఏసీబీ కనుగొంది. అక్రమాస్తుల కేసులో ENC హరిరామ్ ను అరెస్ట్ చేసి జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు ఏసీబీ పేర్కొంది. హరిరామ్ అక్రమాస్తులకు సంబంధించిన సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లు కూడా ఏసీబీ స్పష్టం చేసింది. కనుగొన్న అక్రమాస్తుల విలువను ఏసీబీ అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.