కాళేశ్వరం ఇంజనీర్-ఇన్-చీఫ్ (ENC) భూక్యా హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాల ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాను సైతం తాకింది. కాళేశ్వరం ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండీగా ఉన్న హరిరామ్ ఇంట్లో ఏసీబీ అధికారులు శనివారం ప్రారంభించిన దాడుల పర్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డలోని ఆయన బంధువుల నివాసాలకు వ్యాపించడం గమనార్హం. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతుల, రుణాల అంశంలో హరిరామ్ కీలకంగా వ్యవహరించారు. హైదరాబాద్ షేక్ పేట లోని హరిరామ్ నివాసంలో శనివారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన ఏసీబీ సోదాలు రాత్రి 10 గంటల వరకు కూడా జరుగుతున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలోనే కొత్తగూడెం సమీపాన గల ఎదురుగడ్డలో గల హరిరామ్ బంధువుల ఇళ్లల్లోనూ శనివారం ఉదయం 5:30 గంటల నుంచి ఖమ్మం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిచారు. హరిరామ్ సొంత గ్రామం ఎదురుగడ్డలోనూ ఆయనకు నివాసం ఉంది. హైదరాబాద్ సహా మొత్తం 15 చోట్ల ఏసీబీ దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తిలో సైతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సోదాలపై రాత్రి 10 గంటల ప్రాంతం వరకు కూడా ఏసీబీ ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు. మొత్తం సోదాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.


