తెలంగాణా రాష్టంలోని పలు ఆర్టీఏ ఆఫీసులలో, చెక్ పోస్టుల్లో, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం సోదాలు చేశారు. రాజధాని నగరం హైదరాబాద్ లోని సలబత్ పూర్ ఆర్టీఏ చెక్ పోస్టులో, ఉప్పల్, తిరుమలగిరిల్లోనేగాక పెద్దపల్లి, కామరెడ్డి జిల్లా కేంద్రాల్లోని ఆర్టీఏ ఆఫీసులలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయ ప్రాంతాల్లో జరిపిన తనిఖీల్లో రూ. 1.81 లక్షల అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు, హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ రెండు ప్రాంతాల్లో లెక్కల్లోకి రాని 91 వేల నగదును సీజ్ చేసినట్లు ఏసీబీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అనేక అవకతవకలను కూడా ఇక్కడ గుర్తించామని, అవసరమైన చర్యల కోసం ప్రభుత్వానికి నివేదించినట్లు ఏసీబీ వివరించింది.
