హైదరాబాద్: సస్పెన్షన్ కు గురైన హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి నివాసాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే అభియోగాలపై హైదరాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ తదితర ప్రాంతాల్లోని ఇయన ఇళ్లల్లోనేగాక, అతని బంధువుల నివాసాల్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో వెంకటరెడ్డి అక్రమంగా కూడబెట్టినట్లు భావిస్తున్న ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లతోపాటు బంగారం, నగదును గుర్తించినట్లు సమాచారం.
ఓ ప్రయివేట్ పాఠశాల రెన్యువల్ అనుమతుల విషయంలో భారీ ఎత్తున లంచాన్ని డిమాండ్ చేసి, రూ. 60 వేలు తీసుకుంటూ వెంకటరెడ్డి గత డిసెంబర్ 5వ తేదీన ఏసీబీకి పట్టుబడిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు. ఈ నేపథ్యంలోనే వెంకటరెడ్డిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. తాజాగా ఆయన అక్రమంగా పోగేసినట్లు భావిస్తున్న ఆస్తులకు సంబంధించిన సమాచారంతో ఏసీబీ అధికారులు తాజాగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.

