వరంగల్: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు ఈసారి ఏకంగా మత్స్య శాఖకు చెందిన అవినీతి చేపలు చిక్కాయి. మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో కొత్తగా 84 మందిని చేర్చే అంశంలో వరంగల్ జిల్లా మత్స్య శాఖ అధికారి శ్రీమతి అల్లు నాగమణి బాధితుని నుంచి లంచం డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే మత్స్య శాఖలో ఔట్ సోర్సింగ్ ఫీల్డ్ ఆఫీసర్ గా పనిచేస్తున్న పెద్దబోయిన హరీష్ ద్వారా ఫిర్యాదుదారు నుంచి రూ. 70 వేలు లంచంగా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు వల వేసి పట్టుకున్నారు. ఈమేరకు జిల్లా మత్స్య శాఖ అధికారి నాగమణిని, ఫీల్డ్ ఆఫీసర్ హరీష్ లను అరెస్ట్ చేసి వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చినట్లు అవినీతి నిరోధ శాఖ వివరించింది.

ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు:
కాగా మరో ఘటనలో వికారాబాద్ జిల్లా పరిగి రేంజ్ పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు కూడా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఫిర్యాదుదారునికి ఆన్ లైన్ ట్రాన్సిట్ పర్మిట్లు ఇచ్చేందుకు లంచాన్ని డిమాండ్ చేసి రూ. 40 వేల మొత్తాన్ని డ్రైవర్ బాలానగరం బాలక్రిష్ణ ద్వారా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఘటనలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు బొల్లుమల్ల సాయికుమార్, మహ్మద్ మొయినుద్దీన్ లతోపాటు డ్రైవర్ బాలక్రిష్ణను అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చినట్లు అధికారిక ప్రకటన వెలువడింది.

