భద్రాచలం సీఐ బరపటి రమేష్ ను ఏసీబీ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. సీఐతోపాటు అతని గన్ మెన్, కానిస్టేబుల్ సీహెచ్ రామారావును, డి. కార్తీక్ అనే మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఫోన్ పే ద్వారా లారీ యజమాని నుంచి లంచం స్వీకరించారనే అభియోగంపై సీఐ సహా ఆయా ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ వెల్లడించారు.
ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ కథనం ప్రకారం.. గత మార్చి 19న గ్రావెల్ లోడుతో లారీ వెడుతుండగా భద్రాచలం పట్టణ పోలీసులు ఆపారు. గ్రావెల్ రవాణా చేసేందుకు పర్మిషన్ ఉందా? అంటూ లారీ డ్రైవర్ ను ప్రశ్నిస్తూ ఆపారు. ఇంటి నిర్మాణం కోసం మొరం తోలుతున్నట్లు లారీ యజమాని సీఐని కలిసి చెప్పగా, కేసు పెడతామని పోలీసులు పేర్కొన్నారు. ఇంటి నిర్మాణం కోసమే తాము మొరం తోలుతున్నామని, వాణిజ్య అవసరం కోసం కాదని లారీ యజమాని సీఐతో చెప్పారు.

ఈ విషయంలో కేసు నమోదు చేయకుండా ఉండడానికి సీఐ గన్ మెన్ రామారావు లారీ యజమానితో సంప్రదింపులు చేశాడు. కేసు నమోదు చేయకుండా ఉండానికి రూ. 30 వేలు ఇస్తే కేసు నమోదు చేయకుండా తాను సీఐతో మాట్లాడతానని గన్ మెన్ రామారావు చెప్పాడు. అయితే తాను అంతమొత్తం ఇవ్వలేనని, కావాలంటే కేసు రిజిస్టర్ చేసుకోవచ్చని లారీ యజమాని స్పష్టం చేశాడు. వెంటనే గన్ మెన్ సీఐ వద్దకు వెళ్లి, మళ్లీ వచ్చి తాను సీఐతో మాట్లాడానని రూ. 20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

ఇప్పటికిప్పుడు ఆ మొత్తాన్ని తాను ఇవ్వలేనని యజమాని చెప్పినా గన్ మెన్ వినిపించుకోలేదు. ఇప్పుడే చెల్లించాలని గన్ మెన్ వత్తిడి చేశాడు. ఈ నేపథ్యంలోనే గన్ మెన్ రామారావు తన స్నేహితుడైన కార్తీక్ ఫోన్ కు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే లారీ యజమాని నుంచి ఫోన్ పే ద్వారా రూ. 20 వేలు బదిలీ చేయించాడు. ఈ మొత్తం ఫోన్ పే ద్వారా చెల్లింపులు జరగ్గానే లారీని విడుదల చేసి, ఎటువంటి కేసు నమోదు చేయలేదని ఇందుకు సంబంధించి మొత్తం వీడియో రికార్డు ఉన్నట్లు ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ చెప్పారు. ఫోన్ పే ద్వారా లంచం తీసుకున్నట్లు ఆధారాలు లభించడంతో సీఐ బరపటి రమేష్ ను, గన్ మెన్ రామారావును, అతని స్నేహితుడు కార్తీక్ ను అరెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు. లంచం అడిగే ప్రభుత్వ అధికారి, సిబ్బందిపై తమకు ఫిర్యాదు చేయవచ్చని, సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఏసీబీని సంప్రదించవచ్చని డీఎస్పీ ఈ సందర్భంగా చెప్పారు.