Wednesday, March 4, 2026

Top 5 This Week

Related Posts

సూ……..పార్ సర్వే!

(సమీక్ష ప్రత్యేకం)
వకీల్ సాబ్ సినిమాలో కాబోలు.. ‘సూ..పార్ విమెన్’ అని హీరో పవన్ కళ్యాణ్ కోర్టు సీన్ లో చెప్పే డైలాగ్ గుర్తుంది కదా? అచ్చంగా ఈ డైలాగ్ తో సారూప్యత గల సర్వే సంస్థ వెల్లడించిన మున్సిపల్ ఎన్నికల సంచలన ఫలితాల ‘కత’ ఇది. సీ-ప్యాక్ అనే సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అట.. పేరు సర్వే కిరణ్ అట.. తెలంగాణా రాష్ట్రంలో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అనంతరం ఈ సర్వే సంస్థ ఫలితాలను వెల్లడించింది. ఎన్నికలు జరిగిన 116 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఖాతాలో 74, బీఆర్ఎస్ ఖాతాలో 36 చొప్పున జమ చేసింది. ఏడు కార్పొరేషన్లలో ఐదు కాంగ్రెస్ కు, బీజేపీ, సీపీఐలకు చెరో కార్పొరేషన్ ను పంచేసింది. గ్రౌండ్ రిపోర్ట్, శాంపిల్స్ ద్వారా ఈ విషయం స్పష్టమైనట్లు సంస్థ ప్రకటించుకుంది.

సర్వే జరిగిన తీరును కూడా సంస్థ ఎండీ కిరణ్ ఓ డిజిటల్ పత్రికకు అందించారుట. ఆయన వెల్లడించుకున్న వివరాల ప్రకారమే.. సంస్థకు చెందిన టీమ్ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మున్సిపాలిటీలో, కార్పొరేషన్ లో 800 మంది పనిచేశారట. గడచిన 134 రోజులుగా సంస్థ ఎన్నికలపై దృష్టిని కేంద్రీకరించిందట. తనతోపాటు ఫీల్డ్ స్టాఫ్ కసి, పట్టుదలతో నిద్రాహారాలు మానుకుని మరీ పనిచేసినట్లు కిరణ్ ప్రకటించారు. గతంలో అనేక సంస్థలతో కలిసి పనిచేసిన అనుభవాన్ని ఫీల్డ్ స్టాఫ్ కు నేర్పించారుట. ఓటరు నుంచి కచ్చితమైన అభిప్రాయాన్ని రాబట్టేందుకు ఇది దోహదపడిందట. ఇలా అనేక అంశాలను చెప్పుకుంటూ వెళ్లారు సీ-ప్యాక్ సంస్థ ఎండీ కిరణ్.

సరే.. సర్వే సంస్థ అన్నాక వాళ్ల తిప్పలేవో వాళ్లు పడతారు. ఫలితాలను వెల్లడిస్తారు. అందులో విశ్వసనీయత ఏమిటనేది ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి అనంతరం తేలుతుంది. కానీ ఆకుకు అందని విధంగా, పోకకు పొందని విధంగా వెల్లడించే కొన్ని సర్వే ఫలితాలే ప్రజలు ముక్కున వేలేసుకునే విధంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతాయి. మున్సిపల్ ఎన్నికల అనంతరం సీ-ప్యాక్ సంస్థ వెల్లడించిన ఈ సర్వే అంశాల్లో మచ్చుకు కొన్ని మున్సిపాలిటీల ఫలితాలను పరిశీలిస్తే ఇదే అంశం బోధపడుతుంది.

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని ఓ కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీల ఫలితాలను కూడా ఈ సంస్థ ప్రకటించింది. కొత్తగూడెం నగరపాలక సంస్థ ‘కమ్యూనిస్టు’ పార్టీకి కేటాయించింది. ఇక్కడ పొత్తు లేకుండా కాంగ్రెస్, సీపీఐ పార్టీ హోరాహోరీగా తలపడ్డాయి కాబట్టి ఇది నిజమేనని కాసేపు నమ్ముదాం. మున్సిపాలిటీల్లోకి వెడితే.. భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందు మున్సిపాలిటీని కూడా ‘కమ్యూనిస్టు’ ఖాతాలో జమ చేసింది ఈ సర్వే సంస్థ. ఇల్లెందులో మొత్తం 24 వార్డులు ఉండగా, మూడు ఎర్ర పార్టీలు పోటీ చేసింది ఐదు స్థానాల్లో మాత్రమే. సీపీఎం రెండు, సీపీఐ రెండు, మాస్ లైన్ పార్టీ ఒకటి చొప్పున కలిసి పోటీ చేసిన ఈ ఐదు వార్డులను ఆయా ఎర్ర పార్టీలు కైవసం చేసుకున్నా మున్సిపల్ చైర్ పర్సన్ స్థానం ‘కమ్యూనిస్టు’కు దక్కే అవకాశమే లేదు. కాదు.. కాదు.. బీఆర్ఎస్ తో కలిసి ఆ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేశాయని వాదించినప్పటికీ, అప్పుడు గులాబీ పార్టీ ఖాతాలో కదా మున్సిపల్ పీఠాన్ని వేయాల్సింది? కానీ ‘కమ్యూనిస్టు’ ఖాతాలో కలపడమే ఆసక్తికరం.

ఇక ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీని ఈ సర్వే సంస్థ బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో వేసింది. వాస్తవానికి ఏదులాపూరం మున్సిపాలిటీలో పట్టుగల పార్టీలు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మాత్రమే. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ బలం అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో ఏదులాపురం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ విజయబావుటాను ఎగురవేయబోతోందని సర్వే సంస్థ ప్రకటించడం కూడా చర్చనీయాంశంగా మారింది.

సీ-ప్యాక్ అనబడే సర్వే సంస్థ ప్రకటించిన రాష్ట్ర వ్యాప్త ఫలితాల్లో ఇల్లెందు, ఏదులాపురం మున్సిపాలిటీల ప్రస్తావన ఓ ఉదాహరణ మాత్రమే. ఈ నేపథ్యంలో మిగతా మున్సిపాలిటీలపై ఆ సంస్థ వెల్లడించిన ఫలితాల్లో నిజమెంత అనేది కూడా ప్రశ్నార్థకమే. సర్వే సంస్థ తమకు గల బలం, బలగంతో నిర్వహించిన సర్వే ఫలితాల సంగతి ఎలా ఉన్నప్పటికీ, రిపోర్టింగ్ నెట్ వర్క్ ఉన్నట్లు చెప్పకుంటున్న మీడియా సంస్థలు ఆ ఫలితాలను కాస్త నిశితంగా పరిశీలించాలి కదా? అనే ప్రశ్న జనంలో రేకెత్తుతోంది. వాళ్లేదో ఇచ్చారు.. మేమేదో ప్రచురించాం.. అని భావిస్తే ఇల్లెందులో ‘కమ్యూనిస్టు’ పార్టీ మున్సిపల్ పీఠాన్ని అధిష్టిస్తుందనే ఫలితం విశ్వసనీయత ప్రభావం సర్వే సంస్థపైనేకాదు, దాన్ని ప్రచురించిన మీడియా సంస్థపైనా చూపుతుందనేది నిర్వివాదాంశం. ఇదీ ‘సూ…పర్ సర్వే’ సంస్థ ఫలితాల వెల్లడి కత!

Popular Articles