ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళిద్దరూ తెలియని వాళ్ళు చాలా తక్కువ. తెలంగాణాలోనూ చాలా మందికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని ప్రముఖులు. ఒకరు సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్. ఇంకొకరు మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు. వైసీపీ హయాంలో సునీల్ కుమార్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి అప్పట్లో ఎంపీగా ఉన్న ట్రిపుల్ ఆర్ పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారన్నది ప్రధానమైన ఆరోపణ. అప్పట్లో బాధితుడు ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆ కేసులు బలం పుంజుకున్నాయి. విచారణ సాగుతోంది. వివాదమూ పెరుగుతోంది.
ఈ మధ్యనే సునీల్ కుమార్ చేసిన రాజకీయ వ్యాఖ్యలు, ఆ వ్యాఖ్యల ఆధారంగా ఆయనను సర్వీసు నుంచి తొలగించాలన్న రఘురామ వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు, అంతకు ముందు తొలి వివాదపు పూర్వాపరాలు చర్చించటంతో బాటు వీళ్ళ వ్యక్తిగత జీవిత ప్రయాణం గురించి తెలుసుకుంటే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. వీళ్ళిద్దరూ పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు కావటం యాదృచ్చికమే అయినా ప్రవృత్తుల పరంగా కొన్ని పోలికలు ఆశ్చర్యపరుస్తాయి.

సునీల్ కుమార్ ను ఒకప్పుడు టీడీపీ తమ మనిషిగా భావించి కీలకమైన బాధ్యతలు అప్పగించినా, ఆ తరువాత వైసీపీకి అత్యంత సన్నిహితుడిగా మారిపోయారు. ట్రిపుల్ ఆర్ విషయం కూడా అంతే. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆత్మగా చెప్పే కేవీపీ రామచంద్రరావు స్వయానా వియ్యంకుడే అయినా, ఆ తరువాత కాలంలో రఘురామకృష్ణరాజు పార్టీలు మారుతూ వచ్చారు. వ్యాపారాల్లోనుంచి రాజకీయాల్లోకి వచ్చిన ట్రిపుల్ ఆర్ కాంగ్రెస్ నుంచి వైసీపీ, బీజేపీ, మళ్ళీ వైసీపీ, ఇప్పుడు టీడీపీ దాకా పార్టీలు మారుతూ వచ్చారు. మొత్తానికి ఇద్దరి జీవితాల్లోనూ ఆసక్తికరమైన మార్పులున్నాయి. వాళ్ళ ఆసక్తుల్లోనూ పోలికలున్నాయి.
సునీల్ కుమార్ ది చదువుకున్న కుటుంబం. డిగ్రీ దాకా సొంత జిల్లాలోనే చదువుకున్నా, పీజీ మాత్రం హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో సాగింది. ఎంఏ సోషియాలజీలో గోల్డ్ మెడలిస్ట్ కూడా. సివిల్స్ కు ఎంపికై ఆంధ్రప్రదేశ్ కేడర్ ఎంచుకున్నారు. అప్పట్లో అధికార తెలుగుదేశం పార్టీ వైఎస్ సొంత జిల్లా కడప మీద ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. వైఎస్ ప్రాభవాన్ని తగ్గించటానికి ఆ జిల్లాకు ఎస్పీగా ఉమేష్ చంద్రను, పులివెందులకు ఏఎస్పీ గా సునీల్ కుమార్ ను పంపింది. ఆ విధంగా టీడీపీ పాలకులకు సునీల్ కుమార్ మీద మంచి అభిప్రాయమే ఉండేది. కానీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సునీల్ కుమార్ క్రమంగా ఆయనకు దగ్గరయ్యారని, అందుకోసం ఢిల్లీ లాబీని వాడుకున్నారని అంటారు.

మొత్తానికి మళ్ళీ 2014 లో టీడీపీ వచ్చినప్పటినుంచీ సునీల్ కుమార్ కు కష్టాలు మొదలయ్యాయి. అధికారులు పార్టీ విధేయత ప్రదర్శించే సంప్రదాయం, అలాంటి వాళ్ళకు పదవుల కేటాయింపులో ప్రభుత్వాలు పక్షపాతం చూపటం కూడా మొదలయింది. అందులో భాగంగా టీడీపీ ప్రభుత్వ హయాంలో సునీల్ కుమార్ వెనకబడ్డారు. మళ్ళీ 2019 లో వైసీపీ రాగానే సునీల్ కీలకపాత్ర పోషించటం మొదలుపెట్టారు. అవునన్నా కాదన్నా.. ఆయన పోలీసు అధికారుల్లో చాలా ముఖ్యుడిగా మారిపోయారు. సహజంగానే అలాంటి అవకాశాన్ని ఏ అధికారీ వదులుకోరు. దాన్ని ఎంజాయ్ చేస్తారు. అదే జరిగిందిక్కడ కూడా.
కాగా సునీల్ కుమార్ కు మీడియా రంగంలోకి రావాలనే ఆలోచన కూడా ఉండేది. దాదాపు 15 ఏళ్ల కిందట సునీల్ కుమార్ రైల్వే ఎస్పీగా ఉన్నప్పుడు ఒక న్యూస్ ఛానల్ తీసుకురావాలనే యోచన చేశారు. ఛానల్ ఏర్పాటుకు సంబంధించి దాదాపు రెండు గంటలపాటు ఇద్దరు ప్రముఖ జర్నలిస్టులతో చర్చించారు. అప్పటికే ఆయిన అంబేద్కర్ ఇండియా మిషన్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఛానల్ నడపాలన్న ఆలోచన సునీల్ కుమార్ లో ఉన్నట్టు తన మాటల్లో అర్థమైంది. ఛానల్ పెట్టటం సులభమేకానీ నడపటం కష్టమని నేనే చెప్పాను. ఏమనుకున్నారో తెలియదుగాని ఆ ఆలోచనను సునీల్ కుమార్ పక్కనబెట్టారు.

రఘురామకృష్ణరాజు విషయానికొస్తే.. వ్యాపారాలు ఆయన వృత్తి. వైఎస్ తో సన్నిహిత సంబంధాలుండేవి. ఆ తరువాత కేవీపీ రామచంద్రరావుకు వియ్యంకుడిగా మారటమే కాదు.. అప్పటకే ఆయన గోకరాజు గంగరాజుకు, కనుమూరి బాపిరాజుకు సమీప బంధువు కూడా కావటంతో రాజకీయాలమీద సహజంగానే ఆసక్తి బాగా పెంచుకున్నారు. ఈ నేపధ్యంలోనే 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్ ఆశించారు. నిజానికి ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద పాజిటివ్ గా జీవిత చరిత్ర కూడా రాయించారు. కానీ టికెట్ రాకపోవటంతో ప్రచురించకుండా వదిలేశారు. బీజేపీలో చేరారు. కానీ అక్కడా ఆయన ఆశించిన ప్రాధాన్యమేమీ దక్కలేదు. అందుకే 2019 నాటికి మళ్ళీ వైసీపీలోకి వచ్చి నరసాపురం ఎంపీగా గెలిచారు.
అలా ఎంపీగా గెలవాలన్న కోరిక నెరవేరినా, పార్టీ అధినాయకుడు జగన్ తో ఆయనకు పొసగలేదు. విభేదాలకు ప్రత్యేకమైన కారణాలంటూ లేకపోయినా.. ఇద్దరికీ ఉన్న ఈగో అందుకు ప్రధానకారణమని, తెగేదాకా లాక్కున్నారని వాళ్ళను దగ్గరగా చూసినవాళ్ళు అంటారు. జగన్ ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నది ప్రధానమైన ఆరోపణ. ఈ పరిస్థితుల్లో ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రభుత్వం మీద రఘురామకృష్ణ రాజు ప్రత్యక్షంగానే విమర్శలు చేయటం మొదలుపెట్టారు. రానురాను ఆ దాడి పెరుగుతూ వచ్చింది. ‘రచ్చబండ’ పేరుతో ఫేస్ బుక్ లైవ్ కార్యక్రమం కూడా నడిపేదాకా ఆయన వ్యతిరేకత పెరిగింది.

మొత్తానికి 2021 మే నెలలో ఎంపీ రఘురామకృష్ణరాజును జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అదే సమయంలో సీఐడీ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ గుంటూరు సీఐడీ ఆఫీస్ లో రఘురామకృష్ణంరాజు మీద భౌతికంగా దాడి చేయించారని, అప్పటికే బైపాస్ సర్జరీ అయి ఉన్న ట్రిపుల్ ఆర్ ను హింసించారని ఆరోపణలు వచ్చాయి. పైగా, గాయాలు లేవని సర్టిఫికెట్ ఇచ్చిన మహిళా డాక్టర్ ఆ తరువాత కాలంలో విమర్శలను ఎదుర్కున్నారు. ట్రిపుల్ ఆర్ పెట్టిన్ కేసులు ముందుకు నడవకపోగా ఆయనసను మానసికంగా, శారీరకంగా హింసించారనే విమర్శలున్నాయి. 2024 ఎన్నికల నాటికి టీడీపీలో చేరి ఉండి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ట్రిపుల్ ఆర్ డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టారు. సునీల్ కుమార్ మీద కేసులు వేగం పుంజుకున్నాయి. ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. విచారణ చేపట్టింది. మరో ఆరునెలల సర్వీసు మాత్రమే మిగిలి ఉంది.
ఇలా ఉండగా కాపు, దళితుల రాజ్యాధికార ఫార్ములా మీద గత వారం సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడి పుట్టించాయి. ఈ వ్యాఖ్యల ఆధారంగా ఆయనను సర్వీసు నుంచి ఎందుకు తొలగించకూడదంటూ రఘురామ చేసిన వ్యాఖ్యలమీద కూడా రచ్చ మొదలైంది. అయితే, అంబేద్కర్ ఇండియా మిషన్ ద్వారా దళితుల అభ్యున్నతికి కృషి చేయటం, ఉపన్యాసాలతో చైతన్యం నింపడం సునీల్ కు కొట్టకాదు. కాపుల శక్తి, దళితుల అండతో రాజ్యాధికార సాధన గురించి ఆయన 2005 నుంచే మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటకొస్తే, రాఘవయ్య అనే చురుకైన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూ, సునీల్ కూ ఒకప్పుడు ఉమ్మడి స్నేహితుడన్నది కూడా రహస్యమేమీ కాదు. అందుకే ఇప్పుడు తాజా వివాదం అర్థరహితమని చాలామంది దళిత నాయకులు వాదిస్తున్నారు.

ఇదంతా ఒక వంతయితే రఘురామకృష్ణ రాజు, సునీల్ కుమార్ ఇద్దరూ సృజనాత్మకతకు పెట్టింది పేరు. సాహిత్యం మీద ఇద్దరికీ ఆసక్తి ఉంది. సునీల్ కుమార్ ఇప్పటిదాకా సుమారు యాభై కథలు రాశారు. నీలవేణి పేరుతో ఒక కథా సంకలనం వెలువడింది. ఎడాపెడా రాసేసే ప్రొఫెషనల్ రైటర్ కాకపోయినా, రాయాలనిపించినప్పుడల్లా రాస్తూనే ఉన్నారు. స్వాతి వార పత్రికలో ‘ప్రారంభం’ పేరుతోనూ, ఆంధ్రజ్యోతి వీక్లీ ‘నవ్య’ లో సయ్యాట పేరుతోనూ ఆయన రాసిన నవలలు సీరియల్స్ గా వచ్చాయి. ఇవికాకుండా కొన్ని పత్రికల్లో కాలమ్స్ కూడా రాశారు. ఒక పోలీసు అధికారిగా ఎన్నో అవార్డులు అందుకున్న సునీల్ కుమార్ తన సాహిత్య కృషికి కూడా పురస్కారాలు అందుకుని ఉండటం విశేషం.
వ్యాపారాలు, రాజకీయాలతో సతమతమవుతూ ఉండే రఘురామకృష్ణరాజు సినిమాల విషయంలో ఒక ఎన్ సైక్లోపేడియా. సినీ సాహిత్యం కొట్టినపిండి. కనీసం 4 వేల సినిమా పాటలు అక్షరం పొల్లుపోకుండా పాడగలరు. వాటిని విశ్లేషించగలరు. అనుకరణాలు, అనుసరణాలు గుర్తించగలరు. ఏ పాట ఏ సినిమాలోదో, రచయిత ఎవరో, సంగీత దర్శకులెవరో చెప్పగలరు. పాటల రచయితలమీద, సంగీత దర్శకుల మీద, గాయకుల మీద గంటలకొద్దీ అనర్గళంగా మాట్లాడగలరు. ఒక రాజకీయ నాయకుడికి ఈ అరుదైన పరిజ్ఞానం ఉండటం కచ్చితంగా విశేషమే.

ఇదీ ఈ ఇద్దరిలో ఉన్న మరో కోణం. ఇంకో ఆరునెలల్లో రిటైరయ్యే సునీల్ కుమార్ రాజకీయాల్లోకి రావాలనుకోవటం యాదృచ్చికం కాదు. ఆయన చాలాకాలంగా నడుపుతూ ఉన్న అంబేద్కర్ ఇండియా మిషన్ కు పూర్తి సమయం వెచ్చించవచ్చు. ఈ కేసుల సంగతెలా ఉన్నా, పశ్చిమ గోదావరి జిల్లాకే చెందిన వీళ్ళిద్దరూ రాజకీయాల్లోనూ మళ్ళీ ఎదురుపడతారేమో..? బహుషా వచ్చే అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏపీ రాజకీయాల్లో ఈ దృశ్యం కనిపిస్తుందేమో.. చూడాలి..!

✍ తోట భావనారాయణ

