Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

కాంగ్రెస్ లో కేటీఆర్ లెవెల్ లీడర్ ఎవరు!?

‘ఈనాడు’ పత్రికలో వార్తలు రాసేటపుడు లీడర్ ‘స్థాయి’కి సంబంధించి ఓ కఠిన నిబంధన ఉండేది. ఇప్పటి ములుగు జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాత తాలూకా కేంద్రమైన ఏటూరునాగారానికి ఆ పత్రికకు నేను తొలి విలేకరిగా పనిచేసినప్పటి 1988 జవనవరి నుంచి 1993 ఆగస్టు నాటి కాలంనాటి సంగతి ఇది. ఏదేని వార్త రాసేటపుడు ‘స్థాయి’ గురించి అనుసరించాల్సిన లేదా పాటించాల్సిన పద్ధతి గురించి డెస్క్ నుంచి సలహాలు, సూచనలను ఇస్తుండేవారు. ఇప్పుడున్నటువంటి వేగవంతమైన కమ్యునికేషన్ లేని అప్పటి రోజుల్లో ఇటువంటి అంశాలను కంట్రిబ్యూటర్ల మీటింగుల్లో, లేదా పేపర్ పార్శిళ్లలో రఫ్ ప్యాడ్ పేపర్ పై లేఖల ద్వారా డెస్క్ నుంచి ఇంఛార్జి లేదా సబ్ ఎడిటర్లు లేఖల ద్వారా పంపిస్తుండేవారు.

‘ఫలానా నాయకుడి ప్రెస్ మీట్/ప్రెస్ నోట్ కు సంబంధించిన వార్త పేపర్లో రాలేదు సర్? మీరు వార్తను ప్రచురించకుంటే స్థానికంగా నన్ను ప్రశ్నిస్తున్నారు? ఫలానా నాయకుడి వార్తలు మాత్రమే రాస్తావా? మా వార్తలు మీ పేపర్లో రావా?’ అని నన్ను నిలదీస్తున్నారు సర్.. అని నేను అడిగినపుడు ఆ వార్త ఎందుకు ప్రచురించలేదనే అంశంపై డెస్క్ వాళ్లు వివరణ ఇస్తూనే విలువైన సలహాలు, సూచనలు కూడా ఇస్తుండేవారు. ఉదాహరణకు అప్పట్లో మంత్రిగా ఉన్న చందూలాల్ గురించి ఏటూరునాగారం సర్పంచో, లేదంటే మంగపేటకు చెందిన విపక్ష పార్టీ అధ్యక్షుడో, తాడ్వాయికి చెందిన ఇంకో లోకల్ లీడరో విమర్శిస్తే ఆ వార్త పబ్లిష్ అయ్యేది కాదు.

ఎందుకూ అంటే.. మంత్రి స్థాయిలో గల చందూలాల్ ను మాజీ మంత్రి అయిన ఏ పోరీక జగన్నాయక్ స్థాయి నాయకుడో విమర్శిస్తే మాత్రమే వార్త రాయాలని డెస్క్ వాళ్లు నిర్దేశిస్తుండేవారు. ఓ మంత్రిని గ్రామ నాయకుడు, మండల నాయకుడు విమర్శించడమేంటి? ఆరోపణలు చేయడమేంటి? ఇది అతని స్థాయి కాదు, చందూలాల్ ను విమర్శించేందుకు కాంగ్రెస్ పార్టీలో ఆయన స్థాయి నాయకులు చాలా మందే ఉన్నారు. ఇటువంటి వార్తలు రాసేటపుడు లీడర్ స్థాయిని స్థానిక విలేకరులే జడ్జ్ చేయాలి, స్థాయి లేని లీడర్లు చేసే ప్రకటనలు స్థాయి గల నాయకుడిపై వార్తలుగా రాసి డెస్క్ సమయాన్ని వృధా చేయొద్దు, పంపినా పబ్లిష్ చేయం.. అని నిష్కర్షగా చెప్పేవారు.

ఇప్పటి జర్నలిజపు ప్రమాణాల్లో అప్పటి ‘స్థాయి’ పద్ధతులు ఉన్నాయా? లేదా? అనే అంశం అందరికీ తెలిసిందే. ఇంతకీ ఈ ‘స్థాయి’ గురించి తాజా చర్చ ఏమిటంటే.. రాష్ట్ర అభివృద్ధిపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేసి మరీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో నిన్న చేసి హడావిడి గురించి తెలిసిందే. రేవంత్ రెడ్డితో చర్చించేందుకు కేసీఆర్ ‘స్థాయి’ నాయకుడు అవసరం లేదని, కేసీఆర్ తయారు చేసిన గులాబీ పార్టీ సైనికులు చాలని, తమ పార్టీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ మంత్రులు వంటి అనేక మంది నాయకులు ఉన్నారని, సీఎం రేవంత్ లెవెల్ కు నిజానికి తాను కూడా అవసరం లేదని, ఆయన ముచ్చట పడుతున్నారని మాత్రమే తాను వచ్చానని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చ కోసం సీఎం రేవంత్ రెడ్డికి కుర్చీ వేసి మంగళవారం కేటీఆర్ ఎదురుచూసినప్పటి చిత్రం

కేటీఆర్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో చేసిన హడావిడి తర్వాత అధికార పార్టీకి చెందిన మంత్రులు, నాయకులు కూడా తమదైన పద్దతిలోనే స్పందించారు. అసెంబ్లీకి వచ్చి చర్చించాలని తాము చెబితే ప్రెస్ క్లబ్ కు వెళ్లి కేటీఆర్ రాద్దాంతం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చర్చకు పిలిచింది కేసీఆర్ నని, రావలసింది అసెంబ్లీకి అని భట్టి వ్యాఖ్యానించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, తాను స్పందించే స్థాయి కేటీఆర్ ది కాదని వ్యాఖ్యానించడం గమనార్హం. కేసీఆర్ ను ప్రతిపక్ష హోదా అడుక్కోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కేటీఆర్ కు సూచించారు. ఇక ‘స్థాయి’ గురించి సీఎం రేవంత్ రెడ్డి గతంలోనూ నిర్వచించిన అంశం గురించి తెలిసిందే. మొత్తంగా ఇలా సాగుతోంది తెలంగాణాలోని నాయకుల మధ్య ‘స్థాయి’కి సంబధించిన మాటల మంటల బాపతు చర్చ.

ఇంతకీ ఎవరి ‘స్థాయి’ ఏమిటని నిర్ధారించి వార్తలు ప్రచురించే పరిస్థితిగాని, పద్ధతిగాని, సొంత నియమావళిగాని ప్రస్తుత మీడియాతో ఉందా..? అంటే మాత్రం ‘స్థాయి’ని మించి వార్తలు రాస్తున్న మెయిన్ స్ట్రీమ్ మీడియానే కాదు, సోషల్ మీడియా కూడా సమాధానం చెప్పే ‘స్థాయి’లో లేదనే చెప్పాలి. ఎందుకంటే గల్లీ లీడర్ సైతం దేశ ప్రధానిని విమర్శించే పరిస్థితి ప్రస్తుత ‘మీడియా’లో ఏర్పడింది. వివిధ మీడియా వేదికలుగా ప్రసారమవుతున్న, ప్రచురితమవుతున్న వార్తలే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. పార్టీకో పత్రిక ఏర్పాటు చేసుకున్నాక లీడర్ స్థాయి అవసరం లేకుండా, పార్టీ ప్రయోజనమే పరమావధిగా వార్తలు వస్తున్నాయనేది కొత్తగా చెప్పకర్కర్లేదు. ఇక విజువల్ మీడియాలో సీఎం, పీఎం వంటి నాయకులపై వివిధ పార్టీల కార్యకర్తలు సైతం వాడే బూతు, రోత వ్యాఖ్యల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. అదీ ప్రస్తుత పొలిటికల్ వార్తల ‘స్థాయి’ సంగతి.

-ఎడమ సమ్మిరెడ్డి

Popular Articles