న్యాయం కోసం తనను ఆశ్రయించిన మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మంచి వంచించాడనే అభియోగంపై భద్రాచలం పట్టణ పోలీసులు న్యాయవాది ఒకరిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనలో నిందితుడైన న్యాయవాది పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. భద్రాచలం పట్టణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ నెం. 31/2025 ప్రకారం… కేసు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తన భర్తతో కుటుంబ వివాదాల కారణంగా బాధిత మహిళ (28) ఒంటరిగా నివసిస్తున్నారు. ఈ విషయంలో తన భర్తపై చట్టపరంగా పోరాడేందుకు భద్రాచలానికి చెందిన అడ్వకేట్ భరణి వెంకట కార్తీక్ ను బాధిత మహిళ ఆశ్రయించారు. ఈ అంశంలో కేసును స్వీకరించి న్యాయం జరిగే విధంగా చూస్తానని అడ్వకేట్ భరణి వెంకట కార్తీక్ పేర్కొన్నాడు. అయితే భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తున్న బాధిత మహిళను పెళ్లి చేసుకుంటానని వాగ్ధానం చేసిన అడ్వకేట్ ఆమెతో లైంగిక సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. ఈ నేపథ్యంలో గర్భందాల్చిన మహిళ పెళ్లి గురించి ప్రస్తావించింది. కానీ పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన అడ్వకేట్ భరణి వెంకట కార్తీక్ ఆమెను బెదిరించాడు. గర్భస్రావం చేసుకోవాలని, లేనిపక్షంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు.

ఈ పరిణామాల్లో బాధిత మహిళ భద్రాచలం పట్టణ పోలీసులను ఆశ్రయించారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, లైంగికంగా వాడుకుని మోసం చేసిన అడ్వకేట్ భరణి వెంకట కార్తీక్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గత రాత్రి 9 గంటలకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఈమేరకు భద్రాచలం పట్టణ పోలీసులు అడ్వకేట్ భరణి వెంకట కార్తీక్ పై బీఎన్ఎస్ చట్టంలోని 69 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నిందితుడు భరణి వెంకట కార్తీక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

