Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

కాలం ‘ఖతర్నాక్’ మనిషిది! ‘శంఖేసి’ పూరించిన కవిత… చదవాల్సిందే!

హిపోక్రసీ వద్దు..
సామాజిక హితబోధల హిస్టీరియా వద్దు…
పాటించని ఆదర్శాల ప్రసంగాలు వద్దు…
దురంతమన్నట్టు, దురాచారమన్నట్టు
దిగంతాలు దద్దరిల్లేలా ఆర్తనాదాలు వద్దు!

ఏమైందని ఇప్పుడు…?
మద్యం షాపులు తెరుచుకున్నాయి..
దారులన్నీ మద్యం ప్రియుల బారులయ్యాయి

ఇదేదో…
కొత్త సన్నివేశమైనట్టు
సనాతన సంప్రదాయమేదో బద్దలైనట్టు
అరుపులెందుకు..? వెరుపులెందుకు..??

గ్లాసులు గలగలలాడనిది ఏ ఇంట్లో?
ఘనాపార్టీలు చీర్స్‌ కొట్టనిది ఏ ఇంట్లో?

పుటకైనా, చావైనా
కష్టమైనా, సుఖమైనా
దుఃఖమైనా, ఆనందమైనా
నష్టమైనా, లాభమైనా
విరహమైనా, వియోగమైనా
రోగమైనా, రాగమైనా
ఓటైనా, వేటైనా
మునిగినా, తేలినా

అది ఏ ఘట్టమైనా
మందే కదా చుట్టమయ్యేది!
చివరాఖరికి ‘మందు’హాసమే కదా మిగిలేది!

మందు మీద ఎన్ని కథలు..?
మందు మీద ఎందుకిన్ని నిందలు..!?

తాగడం ఇంటావంటా లేదంటూనే
పైవారికి బాటిళ్లు పంపుతారు
ఇష్టులకు కంపెనీగా ఉంటారు
ప్లానేదో ఉన్నప్పుడు పార్టీలూ ఇస్తారు
కిందోడి నుంచి పుచ్చుకొని
అయినవారికి పార్సిళ్లు చేస్తారు
తాగనివాళ్లు తాగిస్తూ తరిస్తారు
‘తాగుడు’తో సం’బంధం’ లేనిదెవరికి?
మందుగమనంలో ఎన్ని వింతలో!

బడుగుల జీవితాల్లో మద్యం ఒక హింస
బడుగేతర జీవితాల్లో మద్యం ఒక థింసా

సర్కారు తనచుట్టూ తాను తిరుగుతూ
గ్లాసు చుట్టూ తిరుగుతుంటే
లాక్ డౌన్ షట్ డౌన్ అవుతుంది
మహమ్మారి మాయమై పోతుంది

కాలం కరోనా వైరస్‌ది అయినా…
ఖతర్నాక్‌ మనిషిది అయినా….

మనదంతా ‘మద్య’తరగతి లోకమే మిత్రమా!

✍️ శంకర్‌ శెంకేసి

Popular Articles