Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

రాయదుర్గం మెట్రోకాడ.. రాజాలింగో..!

ఒక వైపు పండుగ
మరోవైపు ఉపాధి బాట
ఒకరిది ఆరాటం.. మరొకరిది పోరాటం!

ఇవాళ కృష్ణాష్టమి పండుగ. చాలామందికి ఈ పండుగ ఒక వేడుక. సాయంత్రం ఉట్టి కొట్టే పోటీలు షరా మామూలే! కొందరికి ఇదొక ఉపాధి. ఇదే కాదు, ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రతి పండుగ కొందరికి ఆనందం అయితే, కొందరికి ఆకలి పోరాటం!

నిన్న 79వ స్వాతంత్య్ర దినోత్సవం. స్వాతంత్య్రం అధికారికంగా వచ్చింది కానీ, ఇంకా సమానత్వం రాలేదు! ఉన్నవాడిదొక ఆరాటం. లేని వారికొక పోరాటం. నిన్న హైదరాబాద్ చౌరాస్తా లలో ఎందరో నిరుపేద పిల్లలు జెండాలు అమ్ముకుంటూ కనిపించారు.

ఇవాళ శ్రీకృష్ణాష్టమి. చాలామంది తల్లులు మతాలకు అతీతంగా తమ పిల్లలకు సరదాగా చిన్ని కృష్ణుడి వేషం వేసి ముచ్చటపడుతుంటారు. సరదాగా ఫోటోలు తీసుకుంటారు. కానీ, కొందరు తల్లులకు ఇదొక ఉపాథి మార్గం! చూడండి, హైదరాబాద్ లోని రాయదుర్గం మెట్రో స్టేషన్ ఎంట్రన్స్ దగ్గర కనిపించిన దృశ్యమిది.

ఆ తల్లికి అనారోగ్యం. ఒంటరి పోరాటం. తన కుమారుడికి తన దగ్గర వున్న వాటితో ఆంజనేయుడి వేషం వేసింది. ఏ వేషం వేయాలో కూడా తెలియనితనం. ఇదేదో సరదా ముచ్చట కాదు. ఉపాధి బాట. ఆ వేషం వేసి ఆరేళ్ళ కుమారుడ్ని అక్కడ నిలబెట్టింది. ఎదురుగా చిన్న బకెట్ పెట్టింది. బకెట్ ఎందుకని అడిగితే, ధర్మ ప్రభువులు, మహాత్ములు వేసే నోట్లు గాలికి ఎగిరి పోకుండా అని ఆమె సమాధానం ఇచ్చింది.

ఆమెకు ఆరోగ్యం సహకరించదు. అందుకే అక్కడ తువ్వాలు పరచుకుని పడుకుంది. ఆ చిన్నారిపై బాధ్యత పెట్టింది. తెలియని వయసులో, తెలియకుండానే ఆ ఇంటి బాధ్యతను ఎత్తుకున్న ఆ చిన్నారిని ఏమనగలం?

సంపాదించే వాడు సంపాదిస్తూనే ఉన్నాడు. అడుక్కునే వాళ్ళు అడుక్కుంటూనే ఉన్నారు. ఎవరి జీవితాలు వారివే! ఎవరి కష్టాలు వారివే! దేశం అద్భుతంగా అభివృద్ధి వైపు ప్రయాణం అని భుజాలు చరుచుకుంటూ గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఒకవైపు ఉంటారు. మతాల, కులాల మధ్య చిచ్చు పెట్టి వైషమ్యాలు రెచ్చగొట్టే వారు ఇంకో వైపు ఉంటారు. దేవుళ్ళ పేరిట గొడవలు సృష్టించేవాళ్ళు మరోవైపు ఉంటారు. ఎవరు ఎన్ని వైపుల, ఎటువైపు ఉన్నా.. పేదరికం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే!

– డా. మహ్మద్ రఫీ

Popular Articles