Top 5 This Week

Related Posts

కేసీఆర్ పై తీరని ‘కసి ముచ్చట’!

కేసీఆర్ గొప్ప నాయకుడా? కాదా? అని విశ్లేషించడం కాదిది. కేసీఆర్ పై నమ్మకం కలిగినప్పుడు జేజేలు పలుకుతూ అధికార అందాలన్ని ఎక్కించిన ప్రజలే, ఆగ్రహం కలిగినపుడు అతన్ని కసిగా గద్దె దించారన్నది వేరే విషయం. కొందరు రాజకీయ నాయకులకు కేసీఆర్ తో వైరుధ్యం ఉండవచ్చు.. కేసీఆర్ వైఖరితో అనేక మంది విభేదించవచ్చు.. కానీ జర్నలిస్టులుగా చెప్పుకునేవారికీ కేసీఆర్ పై ‘కసి’ ఉంటుందా? రాతలు రాసేటపుడు కాస్త కామన్ సెన్స్ (ఇంగిత జ్ఞానం) ప్రదర్శించాలా? వద్దా అనేదే బీఆర్ఎస్ కేడర్ సంధిస్తున్న అసలు ప్రశ్న. ఇంతకీ విషయం ఏమిటంటే..

ఈనెల 19వ తేదీన భూపాలపల్లిలో రాజలింగమూర్తి అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యోదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలన వార్తగా మారడానికీ కారణముంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ రాజలింగమూర్తి కోర్టులో కేసు దాఖలు చేయడమే ఇందుకు కారణం. కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్.. అనే అంశం ఇందులో దాగి ఉండకపోతే రాజలింగమూర్తి హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపే వార్తాంశంగా మిగిలేది కాకపోవచ్చు. ఈ ఒక్క పాయింట్ వల్లే రాజలింగమూర్తి హత్యోదంతం ఘటన జరిగిన రోజుకంటే మరుసటి రోజు మీడియాలో పెద్ద ఎత్తున హల్ చల్ చేసిందనే చెప్పాలి. హత్యకు గల కారణాలపై పూర్తి సమాచారం అందించాలని సీఎంవో కోరడంతో సహజంగానే ఘటన మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.

హత్యకు గురైనా రాజలింగమూర్తి (ఫైల్)

ఈ పరిణామాల్లోనే నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ హత్య ఘటనపై రియాక్టయ్యారు. కోర్టుల్లో కేసు వేస్తే న్యాయపరంగా కొట్లాడాలేగాని, చంపేస్తారా? అంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రశ్నించారు. కేసీఆర్ నుంచి ప్రాణభయం ఉన్నవారు తమ ప్రభుత్వాన్ని సంప్రదించాలని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేశంగా పిలుపునిచ్చారు. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని కార్నర్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. భూపాలపల్లి ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కూడా హత్యోదంతంపై స్పందించినప్పటికీ కాస్త హుందాగా మాట్లాడడం విశేషం. అయితే ఈ ఘటనతో తనకెటువంటి సంబంధం లేదని, సీఐడీ కాకుంటే సీబీఐతో విచారణ జరిపించుకోవచ్చని గండ్ర వెంకటరమణా రెడ్డి కూడా విలేకరుల సమావేశంలో సవాల్ చేశారు. అధికార, అనధికార రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు ఇటువంటి సందర్భాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారంటే పరస్పర రాజకీయ లబ్ధికోసమని భావించవచ్చు.

కానీ లీడర్ల మాటల తూటాలతో రాజకీయ రంగును పులుముకున్న హత్యోదంతంపై మీడియా, ముఖ్యంగా తోపు జర్నలిస్టులుగా జబ్బలు చరుచుకునేవారు స్పందిస్తూ రాసిన వెకిలి రాతలపైనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోంది. ఓ సైటువాడు (ఇది అతని భాషే సుమీ) ఈ అంశంలో తన మనోవాంఛను బహిర్గతం చేస్తూ రాసిన ‘కత’లోని కంటెంట్ గులాబీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను ఎలాగైనా ఈ మర్డర్ కేసులో ఇరికించి కటకటాల్లోకి నెట్టడానికి ఇంతకంటే మించిన మంచి తరుణం లేదని తన వార్తా ‘కత’నంలో తెగ ముచ్చటపడిపోయాడు.

అసలు రేవంత్ కు ఇప్పుడైనా చేతనవుతుందా? అంటూ ముఖ్యమంత్రి శక్తి, సామర్థ్యాలను ప్రశ్నిస్తూ రాసిన ‘కత’నంపైనే గులాబీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. మోకాలికి, బోడిగుండుకు ముడేసి ముచ్చటపడిన చందంగా న్యాయవాది వామన్ రావు దంపతుల హత్య కేసీఆర్ బర్త్ డే రోజున జరిగిందని, ఇప్పుడు రాజలింగ మూర్తి హత్య కూడా గులాబీ పార్టీ బాస్ బర్త్ డే జరిగిన తర్వాత.. అంటూ సూత్రీకరించడమే కాదు, భూపాలపల్లి నియోకజకవర్గంతో రాజకీయ సంబంధం లేని ‘పుట్ట మధు సామ్రాజ్య’మంటూ లింక్ పెడుతూ హత్యోదంతంపై తానే ఇన్వెస్టిగేషన్ చేసిన తరహాలో కేసీఆర్ కు సంబంధమున్నట్లు ‘కత’నాన్ని వండివార్చడం జర్నలిస్టు పనేనా? అని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.

రాజలింగమూర్తి హత్య కేసు వివరాలు వెల్లడిస్తున్న భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే

కానీ ఈ కేసులో చివరికి పోలీసులు తమ దర్యాప్తులో తేల్చిందేమిటి? భూ తగాదాలవల్లే రాజలింగమూర్తి హత్య జరిగిందని సాక్షాత్తూ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే మీడియా సమావేశంలో వెల్లడించారు. మొత్తంగా ఈ హత్యోదంతంలో అత్యుత్సాహం ప్రదర్శించిన రాజకీయ నాయకుల సంగతి ఎలా ఉన్నప్పటికీ, అర్జంటుగా కేసీఆర్ ను ఈ కేసులో ఇరికించి లోపలేయాలనే ‘కసి ముచ్చట’ మాత్రం తీరలేదని బీఆర్ఎస్ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. ‘తిక్క వ్యాఖ్యలు.. పిచ్చి కూతలు, పర్వర్షన్.. వంటి పదాలతో అనేక మందిపై జర్నలిజపు పైత్యాన్ని ప్రదర్శించే ఈ రాతగాని పూర్వ నేపథ్యంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆరా తీయగా అసలు విషయం తెలుసుకుని అవాక్కవుతున్నారట. తమ పార్టీ పత్రిక నుంచి రోజుల వ్యవధిలోనే గెంటివేయబడ్డ అతని ‘కసి ముచ్చట’ కాంక్ష వెనుక అసలు కారణమిదా? అని నివ్వెరపోతున్నారట. అదీ అసలు సంగతి.

Popular Articles