ఖమ్మం: వెలుగుమట్ల భూదాన్ భూముల వివాదంలో యూనిటీ సెంటర్ ఆఫ్ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు-లెనినిస్ట్) పార్టీపై ఖమ్మం జిల్లా పోలీస్ శాఖ ఉచ్చు బిగిస్తోంది. ఇందులో భాగంగానే UCCRI (ML) కు అనుబంధమైన ఓపీడీఆర్, గ్రామీణ పేదల సంఘానికి చెందిన పలువురిపై పోలీసులు ‘వసూళ్ల’ కేసులు నమోదు చేసి, వరుస అరెస్టులు చేస్తుండడం గమనార్హం. తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వర్ రావు వంటి మహోన్నత విప్లవ వ్యక్తిత్వం గల నాయకులు స్థాపించిన పార్టీ నుంచి ఉద్భవించిన గ్రామీణ పేదల సంఘం, ఓపీడీఆర్ సంస్థలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వసూళ్ల ఆరోపణలు ఎదుర్కుంటుండడం విప్లవ కార్యకలాపాల పరిశీలకుల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.
గత నెల 24వ తేదీన వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఆక్రమణలకు పాల్పడ్డారనే అభియోగాలపై అక్కడి నిర్మించిన ఇళ్లను అధికార యంత్రాంగం కూల్చివేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వెలుగుమట్ల భూముల్లో అసలైన పేదలను గుర్తించేందుకు రెవెన్యూ యంత్రాంగం సర్వేను నిర్వహిస్తోంది. ఈ పరిణామాల్లోనే ఖమ్మం జిల్లా అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం..

UCCRI (ML) పార్టీ తరపున ఓపీడీఆర్ భూదాన్ కమిటీ ముసుగులో నిరుపేదల నుంచి రూ. 3.00 కోట్లు వసూలు చేశారు. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు 21 మందిపై 19 క్రిమినల్ కేసులు నమోదు చేసి, తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. ఆయా కేసుల్లోని నిందితులు ఓ ముఠాగా ఏర్పడి, ఓపీడీఆర్ భూదాన్ కమిటీ సభ్యులమంటూ తప్పుడు ప్రచారం చేసుకుని నిరుపేద బాధితుల ఒక్కొక్కరి నుంచి రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు వసూళ్లు చేశారు. ముఠా చర్యలవల్ల అనేక మంది పేదలు నిలువునా మోసపోయారు. భూదాన్ పట్టాలు, హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయని ప్రశ్నించినవారిని నమ్మబలికారు.
ఆయా కేసుల్లో నిందితులైన సూర్యాపేటకు చెందిన కొప్పెర వెంకన్నను, ఏన్కూరు మండలం కేసుపల్లికి చెందిన కొట్టె బసును, రాఘవాపురానికి చెందిన బల్లి శ్రీనివాసరావును, ఖానాపురం హవేలీ సమీపంలోని గోపాలపురానికి చెందిన సంపంగి వెంకటాచలాన్ని, వెలుుగుమట్లకు చెందిన తాళ్లూరి క్రిష్ణను, బుడిగె రాములను, మంకిడి లింగరాజును, రాచకొండ నరసింహాచారిని, ఖమ్మం నగరంలోని బోసుబొమ్మ సెంటర్ కు చెందిన దండా లింగయ్యను అరెస్ట్ చేశారు.
కాగా భూదాన్ యజ్ఞ బోర్డు స్టాండింగ్ కౌన్సిల్ సమగ్ర విచారణలో నకిలీ పత్రాలు, అక్రమ కేటాయింపుల అంశాలు వెలుగు చూశాయని అదనపు డీసీపీ ప్రసాదరావు తెలిపారు. ఈ ముఠా సభ్యులపై గతంలోనూ 15 కేసులు నమోదయ్యాయని, దర్యాప్తు క్షేత్రస్థాయిలో కొనసాగుతోందని చెప్పారు. వెలుగుమట్ల భూములకు సంబంధించి బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు. వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులకు ప్రభుత్వం అండగా ఉందని , బాధితుల నుంచి దోచుకున్న డబ్బును నిందితుల నుండి రికవరీ చేసి తిరిగి వారికి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. భూదాన్ భూముల్లో అర్హులైన నిరుపేదలకు స్థలాలు కేటాయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఖమ్మం ఖానాపూర్ హవేలీ పోలీస్ స్టేషన్ లోనేగాక సత్తుపల్లి, కొణిజర్ల పోలీస్ స్టేషన్లలో కూడా కూడా కేసులు నమోదు చేసినట్టు అదనపు డీసీపీ ప్రసాదరావు తెలిపారు.

సత్తుపల్లిలో ఆరుగురిపై కేసు:
వెలుగుమట్ల భూదాన్ భూముల్లో, ప్రభుత్వ భూముల్లో దురాక్రమణకు పాల్పడి భాదితుల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేసినట్లు అందిన ఫిర్యాదుపై సత్తుపల్లి పోలీసులు ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఏన్కూర్ గ్రామానికి చెందిన పోనెబోయిన బేబీ, పోలెబోయిన ముత్తయ్య, కల్తి రామచంద్రయ్య, పడిగ యెర్రయ్య, షేక్ అక్తర్, కుంజా కృష్ణలపై ఈమేరకు కేసు నమోదు చేసినట్లు సత్తుపల్లి సీఐ శ్రీహరి తెలిపారు.
వెలుగుమట్లలోని సర్వే నెం. 147,148,149 వద్ద ప్రభుత్వ భూమిని ప్లాట్‌గా ఇచ్చి, ఫోన్ ద్వారా రూ.45000/- మొత్తాన్ని తీసుకుని తనను మోసం చేశారని సత్తుపల్లి మండలం, కిష్టారం గ్రామానికి చెందిన గుడిమల్ల స్పందన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. తమ సంస్థ ద్వారా భూమి కొనుగోలు చేసిన వారికి ప్రభుత్వం పట్టా ఇచ్చేలా చేస్తామని, జిల్లా కలెక్టర్ ద్వారా మీ పేర్లపై ప్లాట్‌ను మీకు అందజేస్తామని నిందితులు నమ్మబలికారని చెప్పారు.
కొణిజర్లలో ఐదుగురిపై కేసు:
వెలుగుమట్ల భూముల్లో పట్టాలు ఇస్తామని నమ్మించి వసూళ్లకు పాల్పడిన ఐదుగురు వ్యక్తులపై కొణిజర్ల పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. కొణిజర్ల మండలం పెద్దమునగాల గ్రామానికి చెందిన పరికిపల్లి వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. దాదాపు 30 మంది వరకు రూ. 40 వేల చొప్పున ప్లాట్ల కోసం చెల్లించి మోసపోయినట్లు బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నివేదించారు. మొత్తంగా భూదాన్ భూముల వ్యవహారం UCCRI (ML) సంస్థకు అనుబంధమైన గ్రామీణ పేదల సంఘం, ఓపీడీఆర్ సంస్థ నాయకులపై, కార్యకర్తలపై క్రిమినల్ కేసుల నమోదు దారి తీస్తోంది.

