Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

సీఎం రేవంత్ కు ఫుల్ సపోర్ట్.. రాధాకృష్ణకు స్వీట్ వార్నింగ్!

(సమీక్ష ప్రత్యేక కథనం)
తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం నిర్వహించిన మీడియా సమావేశం అనంతరం గులాబీ పార్టీ నాయకులే కాదు, ఆ పార్టీకి చెందిన కరదీపిక ‘నమస్తే తెలంగాణ’ ముఖ్యులు కూడా బహుషా తీవ్ర డిసప్పాయింట్ కు గురై ఉండొచ్చు. నైనీ బొగ్గు గని వ్యవహారం నుంచి సింగరేణి కోల్ టెండర్ల వరకు సాగిన వివాదంలో భట్టి మాట్లాడిన తీరు ఆద్యంతం ఆసక్తికరమనే చెప్పాలి. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ తన పత్రికలో రాసిన ‘సంచలన’ వార్తా కథనం, ఆతర్వాత పరిణామాల్లో భట్టి తీవ్ర మనస్తాపం చెందారని, ‘బామ్మర్ది’ గుట్టు తవ్వుతున్నారని ‘నమస్తే తెలంగాణ’ పలు వార్తా కథనాలను తన పాఠకులకు అందించింది.

గత ఆదివారం ఏబీఎన్ రాధాకృష్ణ రాసిన వార్తా కథనం అనంతరం చోటు చేసుకున్న అనేక పరిణామాల తర్వాత శనివారం భట్టి విక్రమార్క ప్రజాభవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఏబీఎన్ రాధాకృష్ణకు బాహాటంగానే స్వీట్ వార్నింగ్ ఇచ్చారని చెప్పక తప్పదు. రాధాకృష్ణను ఉద్ధేశించి భట్టి చేసిన వ్యాఖ్యలు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇంతకీ తెలంగాణా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏబీఎన్ రాధాకృష్ణ రాతలపై ఏమన్నారంటే..

నమస్తే తెలంగాణా పత్రిక ప్రచురించిన వార్తా కథనం
ఏబీఎన్ రాధాకృష్ణ

ఇదే దశలో సీఎం రేవంత్ రెడ్డికి భట్టి విక్రమార్క ఈ అంశంలో పూర్తి అండగా నిలవడం గమనార్హం. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు పదే పదే ప్రస్తావిస్తున్న ‘బామ్మర్ది’ అంశంపైనా భట్టి విక్రమార్క పలు ప్రశ్నలను సంధించారు. ‘సృజన్ రెడ్డిని సీఎం బావమరిదిగా పేర్కొంటూ అతనికి బొగ్గుగనులు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని లేఖ రాశారు. నేనడుగుతున్నాను.. ఎవరీ సృజన్ రెడ్డి? అని ప్రశ్నించారు. ‘ఈ సృజన్ రెడ్డి కంపెనీ పేరు శోధ కన్ స్ట్రక్షన్స్, ఆ కంపెనీ ఎండీ దీప్తిరెడ్డి, ఈమె టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కుమార్తె. ఆయన అల్లుడే సృజన్ రెడ్డి’ అని భట్టి వివరించారు.

కందాళ ఉపేందర్ రెడ్డి

ఈ ఉపేందర్ రెడ్డి తాను సీఎల్పీ లీడర్ గా ఉన్నపుడు తనతోపాటు కాంగ్రెస్ పార్టీలో 2018లో గెలిచిన వ్యక్తి అని, బీఆర్ఎస్ నాయకులు అతన్ని ప్రలోభాలకు గురి చేశారన్నారు. తద్వారా ఆ టెండర్, ఈ టెండర్, ఆ కాంట్రాక్టు, ఈ కాంట్రాక్టు అని బీఆర్ఎస్ పార్టీ తీసుకువెళ్లిన ఉపేందర్ రెడ్డి అల్లుడీయన.. అని భట్టి పేర్కొన్నారు. ‘ఇప్పటికీ ఉపేందర్ రెడ్డి మీ దగ్గరే ఉన్నడు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అసలు? ఎట్లా అంటరు మీరు? ఇదే కంపెనీకి 2023లో అక్టోబర్ లో కాంట్రాక్టులు ఇచ్చారు. ఇందులో సీఎంకు ఏం సంబంధం. కాంగ్రెస్ పార్టీలో గెల్చిన వ్యక్తిని ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకుని, వర్కులు ఇచ్చి ఆ బురదను మాకు పూయాలని ప్రయత్నిస్తే ఎట్ల?’ అని భట్టి సూటిగా ప్రశ్నించారు.

నమస్తే తెలంగాణ ప్రచురించిన వార్తా కథనం

కళ్యాణఖని, మందమర్రి వంటి ఐదు కాంట్రాక్టలు పనులు ఆర్వీఎస్ ఆర్ కంపెనీకి ఇచ్చారని, ఈ కంపెనీకి చెందిన కీలక వ్యక్తి దీక్షిత్ రావు, విద్యాసాగర్ రావు ఎవరో అందరికీ తెలుసు.. అన్నారు. అదేవిధంగా నిశాంత్ రావు మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రావు కుమారుడు. ఇతను ఎవరికి బంధువో అందరికీ తెలిసిందే. సృజన్ రెడ్డి నుంచి నలుగురు కంపెనీలు కాంగ్రెస్ వాళ్లకు చెందిన సంస్థలా? అని కూడా భట్టి ప్రశ్నించారు. ఓబీ కాంట్రాక్టు టెండర్లలో మొత్తం 25 కాగా, అందులో 20 వరకు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని, సైట్ విజిట్ కండిషన్ ఇప్పటిది కాదని పేర్కొన్నారు. సైట్ విజిట్ నిబంధనకు సంబంధించిన వివిధ డాక్యుమెంట్లను భట్టి ఈ సందర్భంగా ప్రదర్శించారు.

హరీష్ రావు

ఇక చివరగా ఈ అంశంలో భట్టి మాట్లాడుతూ, ‘పదే పదే సృజన్ రెడ్డి, సీఎం బావమరిది దోచుకుంటున్నారని చెబుతున్నారని, హరీష్ రావు గారూ? పదేళ్లు మీరు మంత్రిగా చేశారు. మీరంటే గౌరవం కూడా.. కానీ అసలు మీకేం కావాలి? ఏం కావాలి మీకు? వీటి మీద ఎంక్వయిరీ కావాలా? వాళ్లకూ వీళ్లకూ ఎందుకు రాస్తారు? నాకు రాయండి.. 2014 నుంచి నైనీ టెండర్ల వరకు ఎంక్వయిరీ చేయాలని, సిట్ వేయాలని రాయండి, డిప్యూటీ సీఎంగా, ఇంధన శాఖ బాధ్యునిగా, సీఎం ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు, ఆయన తిరిగి రాగానే, స్వయంగా ఒప్పించి తాడిచెర్ల ఓబీ కాంట్రాక్టు సహా అన్నింటిపైనా నేనే విచారణ చేయిస్తా..’ అని భట్టి విక్రమార్కపేర్కొన్నారు.

మొత్తంగా నైనీ బొగ్గు గనుల వివాదం, సింగరేణి బొగ్గు టెండర్ల వ్యవహారంపై అటు ఏబీఎన్ రాధాకృష్ణ, ఇటు ‘నమస్తే తెలంగాణ’ పత్రిక రాసిన వార్తా కథనాలు, సీఎం ‘బామ్మర్ది’గా పేర్కొంటూ సృజన్ రెడ్డి టార్గెట్ గా కేటీఆర్, హరీష్ రావులు చేసిన ఆరోపణలన్నింటికీ కలిపి భట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడిన తీరు ఆద్యంతం చర్చనీయాంశంగా మారడం విశేషం.

Popular Articles