(‘సమీక్ష’ ప్రత్యేకం)
పశువులు వాటి శరీరంపై దురద కలిగినపుడు, ఈగలు వాలినప్పుడు ఎలాంటి చర్యల ద్వారా ఉపశమనాన్ని పొందుతాయి? తమకు గల తోకను ఊపుతూ ఇటువంటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కుంటుంటాయి. కానీ ఈ ఫొటోను ఓసారి నిశితంగా పరిశీలించండి. ఈ గోవు ఏం చేస్తోందో?
ఇక్కడ మీరు చూస్తున్న ఈ గోవు ఆస్ట్రియన్ జాతికి చెందింది. గోవుల ప్రపంచంలో గడ్డి, నిద్ర మాత్రమే కాదని ప్రదర్శించిందీ ఆవు. ఒక అధ్యయనం ప్రకారం ఈ ఆవు తన శరీరాన్ని గీక్కోవడానికి చిన్న చిన్న సాధనాలను ఉపయోగిస్తుండడాన్ని అధ్యయనవేత్తలు గుర్తించారు. ఈ గోవు తన శరీరంపై కలిగే దురదలపై గీసుకోవడానికి బ్రష్ లను, కర్రలను ఎంచుకుంటోంది. ప్రాంతాన్ని బట్టి ఏ చివరను ఇందుకు ఉపయోగించుకోవాలో ఎంచుకుంటుంది. కఠిన మచ్చలకు ముళ్లగరికెలను, బొడ్డు, పొదుగు వంటి ప్రదేశాల్లో మృదువైనవాటిని ఎంచుకుంటున్న తీరు అధ్యయనవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

వాస్తవిక ప్రపంచంలో జీవుల పరిణామక్రమం కొనసాగుతూనే ఉంది. కొన్ని రకాల జంతువులు ఆహార సేకరణలో పనిముట్లను వాడటం రెండు శతాబ్ధాలుగా శాస్త్రవేత్తలు పరిశీలిస్తూనే ఉన్నారు. వానరాలు గట్టిగా ఉన్నటువంటి కాయలను పగులగొట్టేందుకు రాళ్లను వినియోగించడం, ఎముకలను నుజ్జు చేసేందుకు గద్దలు, రాబందులు ఎత్తునుంచి బండలపై పడవేయడం పరిణామ క్రమంలో జీవులు కొత్త తెలివి నేర్చుకోవడమే అంటున్నారు.

ఈ పరిణామక్రమంలోనే ఒక ఆవు కర్రముక్కను నోట కరిచి వీపు గోక్కోవడం తాజాగా అధ్యయనవేత్తల దృష్టికి వచ్చింది. ఆవులు తమకు తాముగా ఇలా ఒక వస్తువును వినియోగించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అంటున్నారు. మొత్తం 70 కన్నా ఎక్కువ సందర్భాల్లో వీటి ప్రవర్తనను అధ్యయనవేత్తలు గమనించారు. గోవులకు వినూత్న నైపుణ్యాలు లేవనే ఆలోచనకు వీటి తెలివైన ప్రవర్తన సరికొత్త సవాాల్ ను సంధిస్తోందని చెప్పక తప్పదు.
✍️ బి.టి. గోవిందరెడ్డి
