కొత్తగూడెం: మున్సిపల్ ఎన్నికల్లో పోటీకోసం టికెట్లను ఆశిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులతో రాజ్యసభ సభ్యుుడు వద్దిరాజు రవిచంద్ర సమావేశమయ్యారు. మునిసిపల్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ప్రభుత్వ మాజీ విప్, పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావులతో కలిసి వద్దిరాజు రవిచంద్ర ఆశావహులతో భేటీ అయ్యారు.
ఎంపీ రవిచంద్రను బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కొత్తగూడెం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఇంఛార్జిగా నిన్న నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులతో, స్థానిక నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఎన్నికలలో పోటీ చేసేందుకు ఉత్సాహం కనబరుస్తున్న వారి ధరఖాస్తులను రవిచంద్ర, వెంకటేశ్వర రావు, కాంతారావులు స్వీకరించి క్షుణ్ణంగా పరిశీలన జరిపారు.

ఆ తర్వాత ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగాలు పార్టీ అభ్యర్థిత్వం ఆశిస్తున్న వారితో మాట్లాడి తమ తమ మున్సిపల్ డివిజన్ పట్ల ఉన్న వారికి గల అవగాహన, ప్రజలతో ఉన్న పరిచయాలు, రాజకీయ నేపథ్యం, అనుభవం గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాము ఇక్కడ సేకరించిన పూర్తి సమాచారాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ. రామారావుకు నివేదిస్తామని, అభ్యర్థులను ఆయనే ఖరారు చేస్తారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావులు ఆశావహులకు స్పష్టం చేశారు.

