Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

ఝార్ఖండ్ ఎన్కౌంటర్ లో అగ్రనేత సహా 15 మంది నక్సల్స్ మృతి

రాంచీ: ఝార్ఖండ్ లోని పశ్చిమ సింగ్ భూమ్ జిల్లాలోని సారండా అడవుల్లో నక్సలైట్లకు, భద్రతా బలగాలకు మధ్య గురువారం జరిగిన ఎన్కౌంటర్ లో పదిహేను మంది మావోయిస్ట్ పార్టీ నక్సల్స్ మృతి చెందారు. చోటానాగ్ర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఎన్కౌంటర్ ఘటనను స్థానిక డీఐజీ అనురంజన్ కిస్పోట్టా ధ్రువీకరించారు.

నిఘా వర్గాల నుంచి అందిన సమాచారాం మేరకు CRPF, ఝార్ఖండ్ పోలీసు అధికారులు సారండా అటవీ ప్రాంతంలో నక్సల్స్ కదలికలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో కోబ్రా, ఝార్ఖండ్ జాగ్వార్, జిల్లా పోలీసుల జాయింట్ ఆపరేషన్ టీం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టింది. భద్రతా బలగాలలను తమను సమీపించగానే, తమను చుట్టుముట్టారని గ్రహించిన నక్సల్స్ విచక్షణారహితంగా కాల్పులు జరిపారని పోలీసు అధికారులు వెల్లడించారు.

నక్సల్స్ కాల్పులను భద్రతా బలగాలు ప్రతిఘటించాయని, చాలా సేపు ఎదురుకాల్పులు జరిగాయని పోలీసులు పేర్కొన్నారు. పరస్పర కాల్పుల్లో భద్రతా బలగాలు పైచేయి సాధించడంతో కొందరు నక్సల్స్ దట్టమైన అడవుల్లోనుంచి తప్పించుకున్నారని చెప్పారు. ఆ తర్వాత ఘటనా ప్రాంతంలో పదిహేను మంది నక్సల్స్ చనిపోయినట్లు గుర్తించామన్నారు. చనిపోయినవారి వివరాలు సేకరించే ప్రక్రియను ప్రారంభించినట్లు చెప్పారు.

పతిరాం మాంజీ అలియాస్ అనల్ దా

కాగా సారండా, కొల్హాన్ ప్రాంతాలలో అనేక మంది ప్రముఖ నక్సలైట్ల కదలికలు చురుగ్గా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్ర నాయకులు మిసిర్ బెస్రా, అన్మోల్, మోచు, అనల్ ఉన్నారు. వీరితోపాటు అసిమ్ మండల్, అజయ్ మహాతో, సాగేన్ అంగారియా, అశ్విన్, పింటు లోహారా, చందన్ లోహారా, అమిత్ హన్స్‌డా అలియాస్ అప్టన్, జయకాంత్, రాపా ముండా తమ దళ సభ్యులతో ఈ ప్రాంతంలో తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇదిలా ఉండగా ఈ ఘటనలో తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణాకు చెందిన అగ్ర నేతలెవరైనా ఉండి ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఛత్తీస్ గఢ్ లో ఆపరేషన్ కగార్ కారణంగా గాలింపు చర్యలు, నిర్బంధం తీవ్రమైన పరిస్థితుల్లో తెలంగాణాకు చెందిన ముఖ్య నాయకులు ఝార్ఖండ్ అడవుల్లో షెల్టర్ తీసుకుని ఉంటారనే అనుమానాలను పోలీసు వర్గాలు ఎప్పటి నుంచో వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఈ ఎన్కౌంటర్ మృతుల వివరాల కోసం తెలంగాణా పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

Popular Articles