Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

N Tv Case: దొంతు రమేష్, సుధీర్ అరెస్ట్

హైదరాబాద్: తెలుగు న్యూస్ ఛానల్ N Tvకి చెందిన ఇద్దరు ప్రతినిధులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఛానల్ కు చెందిన తెలంగాణా ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ను, కాంగ్రెస్ బీట్ రిపోర్టర్ పరిపూర్ణాచారిని, సెక్రటేరియల్ బీట్ చూసే సుధీర్ అనే రిపోర్టర్ ను గత రాత్రి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మహిళా ఐఏఎస్ అధికారిపై వ్యక్తిత్వ హననంతో కూడిన వార్తా కథనాన్ని ప్రసారం చేశారనే అభియోగంపై నమోదైన కేసులో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత రాత్రి నుంచి జరిపిన విచారణలో ప్రశ్నించిన అనంతరం పరిపూర్ణాచారిని సీసీఎస్ పోలీసులు కొద్దిసేపటి క్రితం విడిచిపెట్టారు.

వైద్య పరీక్షల కోసం దొంతు రమేష్ ను ఆసుపత్రికి తీసుకువచ్చిన దృశ్యం

అయితే ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ను, సెక్రటేరియల్ బీట్ రిపోర్టర్ సుధీర్ ను మాత్రం వదిలేయలేదు. కొద్దిసేపటి క్రితం వీరిద్దరికీ కింగ్ కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో దొంతు రమేష్ ను, సుధీర్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు సన్నద్ధమైనట్లు కనిపిస్తోంది. న్యాయమూర్తి ముందు హాజరుపరిచి పోలీసులు రిమాండ్ ను అభ్యర్థించనున్నట్లు తాజా సమాచారం. కాగా గత అర్ధరాత్రి బ్యాంకాక్ పారిపోయేందుకు ప్రయత్నించడం వల్లే తాము అతన్ని ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసినట్లు దొంతు రమేష్ ను ఉద్ధేశించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన్నార్ కొద్దిసేటి క్రితమే ప్రకటించడం గమనార్హం.

Popular Articles