మేడారం: మేడారం మహాజాతర ఆధునికీకరణ పనుల్లో వెలుగుల మధ్య రెండు రంగుల్లో కాంతులీనుతున్న ఈ స్మారక స్థూపం కథ ఏమిటి? ఎవరిదీ స్థూపం? నాలుగు భాగాల్లో ఆకుపచ్చ రంగుతో, ఐదో భాగంలో ఎరుపు రంగులో, ఆపైన సుత్తి కొడవలి చిహ్నంతో కనిపిస్తున్న ఈ స్థూపానికీ అమరత్వపు చరిత్ర ఉంది. విప్లవోద్యమ నేపథ్యముంది. బహుషా రెండు రంగుల స్థూపం ఇప్పటి వరకు ఎక్కడా ఉండి ఉండకపోవచ్చు కూడా!
మీరు ఇంతకుముందు ఎప్పుడైనా మేడారం వెళ్లి ఉంటే.. పస్రా మీదుగా నార్లాపురం, కొత్తూరు గ్రామాలు దాటగానే మేడారం జంపన్నవాగువైపు తిరుగుతుండగా, ఎడమ వైపున ఊరట్టం వెళ్ల మార్గపు క్రాస్ వద్ద కనిపిస్తుందీ స్థూపం. తాడ్వాయి నుంచి మేడారం వెళ్లి ఉంటే మాత్రం జంపన్నవాగు దాటిన తర్వాత కనిపిస్తుంది. ఎరుపు కలర్ లో ఉండేది కదా.. ఆ స్థూపం అనుకుంటున్నారా? ఆ స్థూపమే ఇది. రంగులు మారాయి అంతే.
జనశక్తి పార్టీ నాయకుడు గుట్టన్న అలియాస్ మల్యాల సమ్మయ్య అలియాస్ సమ్మన్న స్మారకార్థం నిర్మించిన స్థూపమిది. ఎన్కౌంటర్ ఘటనలో చనిపోయిన సమ్మన్న జ్ఞాపకార్థంగా గతంలో ఈ స్థూపం నిర్మించారు. అయితే ప్రస్తుతం ఈ స్థూపానికి దిగువన నాలుగు భాగాల్లో గ్రీన్ కలర్, చివరన ఐదో భాగంలో ఎరుపు కలర్ వేయడంతోపాటు దెబ్బతిన్న ప్రాంతాల్లో మరమ్మత్తులు కూడా చేపట్టి ‘ఆదివాసీ అమరుల స్థూపం’గా నామకరణం చేశారు.
మేడారానికి ఎగువ భాగాన గల ఎలుబాకకు చెందిన సమ్మన్న ఇల్లెందు, గుండాల ప్రాంతంలో జనశక్తి పార్టీ నాయకునిగా విప్లవోద్యమం నిర్వహించారు. ప్రస్తుత ములుగు ఎమ్మెల్యే, మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క గతంలో జనశక్తి పార్టీ దళనేతగా పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సరికొత్త రంగుల్లోకి మారిన ఈ స్థూపం ఇక నుంచి ‘ఆదివాసీ అమరుల’ త్యాగానికి గుర్తుగా జంపన్నవాగుకు ముందు సాక్షాత్కరించనుంది. ఇదీ రెండు రంగుల స్థూపం విశేషం.

