Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

సీపీఎం కోర్టులో ఖమ్మం పోలీసుల ‘లై డిటెక్టర్’ బంతి

(సమీక్ష ప్రత్యేక కథనం)
మార్క్సిస్టు పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడి దారుణ హత్యోదంతం సరికొత్త మలుపును తీసుకుంది. అనేక సంచలన ఘటనల్లో రాష్ట్ర వ్యాప్త ఖ్యాతిని దక్కించుకున్న ఖమ్మం జిల్లా పోలీసులకు ఈ మర్డర్ కేసు దర్యాప్తులో మాత్రం ఎటువంటి ఆధారం లభించని స్థితి లై డిటెక్టర్ (పాలిగ్రాఫ్) పరీక్షలకు దారి తీయడం విశేషం. తద్వారా ఈ హత్య కేసు విషయంలో పోలీసులు ‘బాల్’ను పరోక్షంగా సీపీఎం కోర్టులోకి విసిరారనే అభిప్రాయాలు పరిశీలకుల నుంచి ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికలకు కాస్త ముందు సీపీఎం సీనియర్ నాయకుడు సామినేని రామారావు (70) దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. గత అక్టోబర్ 31వ తేదీన తెల్లవారుజామునే గుర్తు తెలియని దుండగులు సామినేని రామారావును అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఉదంతం తీవ్ర కలకలానికి దారి తీసిందనే చెప్పాలి. ఎందుకంటే ఘటనా స్థలం తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో ఉండడం గమనార్హం. దీంతో సామినేని రామారావు హత్యోదంతం రాజకీయ ఆరోపణలకు ఆస్కారం కలిగింంచింది. ఈ హత్యకు కాంగ్రెస్ కారణమంటూ సీపీఎం నాయకులు ఆరోపించగా, హత్యా రాజకీయాల సంస్కృతి తమ పార్టీకి లేదని, తమకు ఘటనలో ఎటువంటి సంబంధం లేదని అధికార పార్టీ నాయకులు స్పష్టం చేశారు.

‘రాజకీయ హత్య’గా ఆరోపణలు రావడంతో ఖమ్మం జిల్లా పోలీసులు సైతం సామినేని రామారావు ఘటన దర్యాప్తును సవాల్ గానే స్వీకరించారు. పలువురు ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీసులు టీంలు, టీంలుగా ఏర్పడి వేర్వేరుగా దర్యాప్తు జరిపినా ప్రయోజనం లేకపోయింది. సామినేని రామారావు హత్యకు దారి తీసిన పరిస్థితులపై, పరిణామాలపై రవ్వంత ఆధారాలను కూడా ఆయా టీంలకు చెందిన పోలీసులు సేకరించలేకపోయారు.

హత్యకు గురైన సామినేని రాామారావు

ఎన్ని కోణాల్లో దర్యాప్తు జరిపినా ఫలానా వాళ్లు హత్య చేశారని వెల్లడించేందుకు అవసరమైన ఆధారాలు దొరకలేదు. ఈ ఘటనపై విమర్శలు, ఆరోపణలు ఎన్ని వచ్చినా పోలీసులు తమ దర్యాప్తును మాత్రం గడచిన రెండున్నర నెలలుగా సా….గించక తప్పని అనివార్యత ఏర్పడింది. కానీ ఈ హత్యకు గల అసలు కారణమేంటనే అంశంపై దరిదాపుల్లో ఓ స్పష్టత వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సామినేని రామారావు హత్య ఘటనలో ఎటువంటి ఆధారాలు లభ్యం కాకుండా హంతకులు జాగ్రత్త పడ్డారంటే పరిస్థితిని అవగతం చేసుకోవచ్చు.

ఈ నేపథ్యంలోనే గడచిన రెండున్నర నెలలుగా సామినేని రామారావు హత్యకు గల కారణాలేమిటనే అంశంపై ఆధారాలు లభించని పరిస్థితుల్లో ఖమ్మం జిల్లా పోలీసులు కీలకంగానే కాదు, సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో అనుమానితులతోపాటు సాక్షులుగా ఉన్నటువంటి మొత్తం 24 మందికి ‘లై డిటెక్టర్’ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థిస్తూ ఖమ్మం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు తమ పిటిషన్ లో ఉటంకించిన 24 మందిలో హత్యకు గురైన సామినేని రామారావు భార్య, అల్లుడు, కూతురు, కుమారుడి పేర్లు కూడా ఉండడం గమనార్హం. వీరితోపాటు సీపీఎం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు సైతం ఉన్నారు.

ఓ నేర ఘటనకు దారి తీసిన పరిస్థితులకు ముగింపు ఇచ్చేందుకు అనివార్య పరిస్థితుల్లో, ఆధారాలు లభ్యంకాని స్థితిలో పోలీసులు ‘పాలిగ్రాఫ్’ పరీక్షలవైపు మొగ్గు చూపడం విశేషమీ కాకపోవచ్చు, కానీ ఇంత పెద్ద సంఖ్యలో మొత్తం 24 మందికి ఈ పరీక్షల నిర్వహణకు అనుమతి కోరడమే అసలు సంచలనం. వాస్తవానికి పాలిగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్షల విషయంలో అనుమానిత వ్యక్తి అంగీకారం కూడా తప్పనిసరి. ఇందుకు అంగీకారం తెలపని వ్యక్తికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించడం కూడా అసాధ్యమే. బలవంతగా నిర్వహించడానికి చట్టం అనుమతించదు.

పాలిగ్రాఫ్ పరీక్షల ద్వారా అనేక హత్య కేసులు కొలిక్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఓ డాక్టర్ పై జరిగిన ‘హ’త్యాచారం కేసులో సీబీఐ అధికారులు అనుమానితులకు పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా మరో హత్యోదంతంలో తెలంగాణాలోని జగిత్యాల పోలీసులు కూడా ఈ తరహా పరీక్షల నిర్వహణ ద్వారా హంతకులను కనుగొన్నారు. కొద్ది నెలల క్రితం చోటు చేసుకున్న ఈ ఘటనలో బాధితురాలి కొడుకు, కోడలే ఈ హత్యలో నిందితులుగా తేలగా, వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ నేపథ్యంలోనే ఖమ్మం పోలీసులు పాలిగ్రాఫ్ పరీక్షలకు అనుమతి కోరిన 24 మందిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు మాత్రమే అంగీకరించారు. దీంతో పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించేందుకు అంగీకరించిన ఆయా ఆరుగురు వ్యక్తులను పోలీసులు బెంగళూరుకు తీసుకువెళ్లారు. మిగతా 18 మందిలో ఎంత మంది ఈ పరీక్షలకు అంగీకరిస్తారనే అంశం ఇంకా తేలాల్సి ఉంది. మొత్తంగా సీపీఎం నాయకుడు సామినేని రామారావు హత్య ఇప్పటికీ రాజకీయ కోణంలోనే ఆరోపణలకు, ప్రత్యారోపణలకు, విమర్శలకు, ప్రతి విమర్శలకు అస్త్రంగా మారిందే తప్ప హంతకులెవరనేది మాత్రం పోలీసుల దర్యాప్తులో తేలలేదు. ఈ నేపథ్యంలో ‘లై డిటెక్టర్’గా కూడా వ్యవహరించే పాలీగ్రాఫ్ అనే పరీక్షలకు కోర్టు అనుమతిని అభ్యర్థించడం ద్వారా ఖమ్మం జిల్లా పోలీసులు ‘బంతి’ని బాధిత సీపీఎం కోర్టులోకే విసిరారా? అనే ప్రశ్న ఈ సందర్భంగా ఉత్పన్నమవుతోంది.

నున్నా నాగేశ్వర్ రావు

మాకు అంగీకారం కాదు: సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్ రావు
సామినేని రామారావు హత్యోదంతంలో ‘లై డిటెక్టర్’ పరీక్షలు తమకు అంగీకారం కాదని సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్ రావు ‘సమీక్ష’ న్యూస్ తో స్పష్టం చేశారు. ఈ ఘటనలో తమ పార్టీకి చెందిన కుటుంబమే బాధితులుగా ఉందని, అటువంటి పరిస్థితుల్లో తామెలా అంగీకరిస్తామని అన్నారు. వందకు వంద శాతం సామినేని రామారావు హత్య ఘటన రాజకీయపరమైనదిగా, కుట్రగా నున్నా నాగేశ్వర్ రావు ఆరోపించారు. ఎన్నో క్రిటికల్ కేసులను 24 గంటల్లో ఛేదిస్తున్న పోలీసులు సామినేని హత్యోదంతంలో లైడిటెక్టర్ పరీక్షలు కోరడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీకి చెందిన కొందరిని థర్డ్ డిగ్రీ పద్దతుల్లో పోలీసులు ఇప్పటికే ఈ కేసులో విచారించారని ఆయన ప్రస్తావించారు.

Popular Articles