Top 5 This Week

Related Posts

మాది ‘ధర్మగంట’ ప్రభుత్వం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తమ ప్రభుత్వానికి ధర్మ గంట ఉందని, ఎవరు ఏ సమస్యలు చెప్పినా విని పరిష్కరిస్తుందని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాభవన్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ‘బాల భరోసా’ పథకం, ‘ప్రణామ్’ డే కేర్ సెంటర్లను సీఎం ప్రారంభించి దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

  • దివ్యాంగులు సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడేలా మా ప్రభుత్వం మానవీయ కోణంలో పని చేస్తుంది.
  • రూ. 50 కోట్లతో వారికి సహాయ ఉపకరణాలు పంపిణీ చేస్తున్నాం.
  • ఒక కుటుంబ సభ్యుల్లా వారికి భరోసా కల్పించేందుకు మా ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా రూ. 50 కోట్లు కేటాయించింది.
  • విద్య, ఉద్యోగాల భర్తీలో దివ్యాంగులకు వారి కోటాను వారికి కేటాయిస్తున్నాం.
  • దివ్యాంగుల వివాహానికి రూ.2 లక్షలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
  • క్రీడల్లో దివ్యాంగులను ప్రోత్సహించాలని పారాలింపిక్స్ లో విజయం సాధించిన అమ్మాయికి ఉద్యోగం ఇచ్చాం.
  • పోటీ ప్రపంచంలో తాము వెనకబడ్డామన్న ఆలోచన లేకుండా అన్ని రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు కల్పిస్తున్నాం.
  • ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ఉపయోగించుకుని ఆత్మస్థైర్యంతో జీవితంలో ఎదగాలి.
  • బెస్ట్ పార్లమెంటేరియన్ గా ఎదిగిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి దివ్యాంగులకు ఒక స్ఫూర్తి.
  • వైకల్యం అనే ఆలోచనను రానీకుండా ఉన్నత స్థాయికి ఎదిగిన గొప్ప వ్యక్తి జైపాల్ రెడ్డి.
  • రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కో ఆప్షన్ మెంబర్ గా ఒక ట్రాన్స్ జెండర్ ని కార్పొరేటర్ గా నామినేట్ చేయాలని సూచిస్తున్నా.
  • తద్వారా వారి సమస్యలపై వారు మాట్లాడుకునే అవకాశం కలుగుతుంది.
  • దీనిపై సముచిత నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.
  • వయో వృద్ధులకు ప్రభుత్వమే కుటుంబంగా మారి ప్రణామ్ పేరుతో డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది.
  • ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ప్రతీ నెలా జీతంలో 10 శాతం తల్లిదండ్రులకు అందించేలా చట్టం తెస్తాం.
  • తల్లిదండ్రుల ఫిర్యాదులను పరిశీలించి జీతంలో నేరుగా 10 శాతం తల్లిదండ్రుల ఖాతాలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
  • తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఒక్కరికి నూటికి నూరు శాతం వైద్యం అందించాలన్నదే మా విధానం.
  • వచ్చే బడ్జెట్ సమావేశాల్లో హెల్త్ పాలసీని తీసుకురాబోతున్నాం.
  • తెలంగాణ సమాజం సామాజిక న్యాయం, సమాన అవకాశాలను కోరుకుంటోంది.
  • అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కులగణన నిర్వహించాం.
  • తెలంగాణ ఒత్తిడికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన నిర్వహించేందుకు అంగీకరించింది.
  • తెలంగాణ కులగణన మోడల్ ను దేశం అనుసరిస్తోంది.
  • ప్రజా ప్రభుత్వంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి సమాన అవకాశాలు కల్పిస్తున్నాం.
  • ఒకప్పుడు సామాన్యులకు ప్రవేశం లేని ప్రజా భవన్ లో ఇప్పుడు అందరికీ ప్రవేశం కల్పించాం.
  • తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా, పేదల సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం.

Popular Articles