భద్రాచలం: వివిధ తెలుగు న్యూస్ ఛానళ్లకు చెందిన నలుగురు విలేకరులపై భద్రాచలం పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ రెస్టారెంట్ యజమానిని బెదిరించారనే అభియోగంపై పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. నిందితులుగా భద్రాచలంలో విలేకరులుగా పనిచేస్తున్న తమ్మల రాజేష్ (హెచ్ఎంటీవీ), జశ్వంత్ (99 టీవీ), పోకల శ్రీను (వీ6), ప్రేంసాయి(సాక్షి టీవీ)లను చేరుస్తూ, వారిపై బీఎన్ఎస్ చట్టంలోని 308(2),351(2),r/w 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
భద్రాచలంలో ఓ రెస్టారెంట్ నిర్వాహకుడైన ముత్యాల రామకృష్ణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని సారాంశం ప్రకారం.. గత అక్టోబర్ 24వ తేదీన ‘గోదావరి రుచులు’ పేరుతో రెస్టారెంట్ ను ప్రారంభించేందుకు నిర్ణయించుకున్న రామకృష్ణ ఆధునికీకరణ పనులు చేపట్టిన క్రమంలో 17వ తేదీన మధ్యాహ్నం 2 గంటల సమయంలో తమ్మల రాజేష్ (హెచ్ఎంటీవీ), జశ్వంత్ (99 టీవీ), పోకల శ్రీను (వీ6), ప్రేంసాయి (సాక్షి టీవీ)లు అతని వద్దకు వెళ్లారు. తాము మీడియా వాళ్లమని, పనులు నిర్వహిస్తున్న రెస్టారెంట్ అక్రమ కట్టడమని రామకృష్ణను బెదిరించి, మానసిక ఒత్తిడికి గురిచేసి రూ. లక్ష మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తాను అంత మొత్తం ఇచ్చుకోలేనని తెలుపగా, అందుకు స్పందించకుండా ఇబ్బందులకు గురిచేశారు. ఈ క్రమంలోనే ఆయా నలుగురు విలేకరులలో ఒకరైన ప్రేంసాయి స్నేహితుడైన రేగా సందీప్ అనే వ్యక్తికి రామకృష్ణ రూ. 40,000 ఫోన్ పే ద్వారా అదే నెల 18వ తేదీన పంపారు. అయితే అదే నెల 31వ తేదీన వీ6 రిపోర్టర్ పోకల శ్రీను రెస్టారెంట్ కు వెళ్లి రూ. 10,000 ఇవ్వాలని రామకృష్ణను డిమాండ్ చేశాడు. అయితే గతంలో డబ్బు ఇచ్చానని, వాళ్లకు రామకృష్ణ ఫోన్ చేసి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయా విలేకరులతో జరిగిన ఫోన్ కాల్ సంభాషణను రామకృష్ణ రికార్డ్ చేశారు. ఇదే క్రమంలో తాను డబ్బు ఇవ్వలేనని రామకృష్ణ చెప్పగా, పోకల శ్రీను బెదిరింపులకు దిగాడు.

ఈ నేపథ్యంలోనే తనపైన, తన రెస్టారెంట్ పైన సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం చేస్తూ తనను బెదిరిస్తున్నారని, రెస్టారెంట్ కోసం అప్పులు చేసి ఉన్నానని ప్రాధేయపడినా కూడా వినిపించుకోకుండా తనను అనేక రకాలుగా బెదిరింపులకు గురి చేశారని రామకృష్ణ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే గత నెల 13వ తేదీన తన రెస్టారెంట్ లో తిన్న ఓ కస్టమర్ కు ఫుడ్ పాయిజన్ అయిందని, ఫుడ్ ఆఫీసర్ కు ఫోన్ చేసి తనిఖీకి పంపించారని, ఈ సందర్భంగా తన రెస్టారెంట్ లోని ఫుడ్ శాంపిళ్లను తీసుకువెళ్లిన అధికారి సర్టిఫికెట్ కూడా ఇచ్చారని రామకృష్ణ తెలిపారు. ఆ తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్ నుంచి తనకు ఎటువంటి నోటీసులు కూడా రాలేదన్నారు.
అయితే ఈనెల 8వ తేదీన ఆయా నలుగురు విలేకరులలో తమ్మళ్ల రాజేష్, జశ్వంత్ అనే ఇద్దరు తనపై సోషల్ మీడియాలో బెదిరిస్తూ ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు పెడతమాని బెదిరిస్తున్నారని, తన కుటుంబ సభ్యులతో విషయంపై చర్చించిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చి పోలీసులను ఆశ్రయించినట్లు రామకృష్ణ తన పిర్యాదులో వివరించారు. తన రెస్టారెంట్ ను చూసి ఓర్వలేక ఆయా నలుగురు విలేకరులు తనపై కక్షగట్టి, తన రెస్టారెంట్ పై చెడు ఆరోపణలు చేస్తూ బెదిరిస్తూ, తనను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆరోపించారు. అందువల్ల ఆయా విలేకరులపై తగిన చర్యలు తీసుకుని వారి నుంచి తనకు ఎటువంటి బెదిరింపులు లేకుండా రక్షణ కల్పించి న్యాయం చేయాలని రామకృష్ణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అభ్యర్థించారు. ఫిర్యాదుతోపాటు ఫోన్ పే రశీదును, కాల్ రికార్డ్స్, వాట్సప్ మెసేజ్ హిస్టీరీని కూడా రామకృష్ణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు వెంట జతపరిచారు.
దీంతో తమకు అందిన ఫిర్యాదుపై భద్రాచలం పట్టణ పోలీసులు తమ్మల రాజేష్ (హెచ్ఎంటీవీ), జశ్వంత్ (99 టీవీ), పోకల శ్రీను (వీ6), ప్రేంసాయి(సాక్షి టీవీ)లను చేరుస్తూ, వారిపై బీఎన్ఎస్ చట్టంలోని 308(2),351(2),r/w 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

