Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

వరంగల్ లో పిల్లల కిడ్నాప్ ముఠా అరెస్ట్

హన్మకొండ: వరంగల్ మహానగరంలో చిన్న పిల్లల కిడ్నాప్ పాల్పడుతున్న ముఠాను కాజీపేట, టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఈ ముఠాలో పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్ కు చెందిన కొడుపాక నరేష్ (42) శాంతినగర్ కు చెందిన వేల్పుల యాదగిరి (32) ఉన్నారు. ఈ ముఠాను అరెస్ట్ చేసిన తీరుపై వరంగగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

ఆయన కథనం ప్రకారం.. గత డిసెంబర్ 28వ తేదీన తెల్లవారుజామున కాజీపేట రైల్వే స్టేషన్ బయట ఫుట్ పాత్ పైన నిద్రిస్తున్న కన్నా నాయక్ కుమారుడైన 5 నెలల వయస్సు గల మల్లన్న అనే బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ ఘటనలో కన్నా నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాజీపేట పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా కాజిపేట్, టాస్క్ ఫోర్స్ పోలీసులు బృందాలుగా ఏర్పడి విచారించగా కిడ్నాప్ ముఠా చర్యలు వెలుగులోకి వచ్చాయి.

నేరస్థలంలో లభించిన ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు ఇద్దరు శనివారం ఉదయం అద్దెకు తీసుకున్న కారులో మళ్ళీ చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. ఈమేరకు కాజీపేట రైల్వే స్టేషన్ బయట ఫూట్ పాత్ వద్ద రెక్కి నిర్వహిస్తున్న నరేష్, యాదగిరిలను కాజీపేట పోలీసులు అనుమానాస్పదంగా పట్టుకొని విచారించారు. దీంతో తాము గత నెల 28వ తేదీన ఐదు నెలల బాలుుడ మల్లన్నతోపాటు గతంలో నలుగురు చిన్న పిల్లల్ని కూడా కిడ్నాప్ చేసినట్టుగా ఒప్పుకున్నారు. కిడ్నాప్ చేసిన పిల్లలను సంతానం లేని దంపతులకు అనాధాశ్రమాల నుంచి తీసుకొచ్చి ఇస్తున్నట్టుగా నమ్మబలికి డబ్బుకు విక్రయించారు.

వేర్వేరు ఘటనల్లో నరేష్, యాదగిరిలు కిడ్నాప్ చేసిన మొత్తం ఐదుగురు పిల్లలను రక్షించినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ వివరించారు. ఎలాంటి చట్టబద్ధమైన ఆధారాలు లేకుండా పిల్లలను కొనుగోలు చేసిన దంపతులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. పిల్లల కిడ్నాప్ నకు పాల్పడుతున్న నరేష్, యాదగిరిలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన టాస్క్ఫోర్స్, కాజీపేట పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీస్ అధికారులను, సిబ్బందిని పోలీస్ కమిషనర్ ఈ సందర్భంగా అభినందించి రివార్డులను అందజేశారు.

మీడియా సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, టాస్క్ ఫోర్స్, కాజీపేట ఏసీపీలు మధుసూదన్, ప్రశాంత్ రెడ్డి, కాజీపేట ఇన్స్ స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ అధికారులు సిబ్బందితో పాటు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు కూడా పాల్గొన్నారు.

Popular Articles