హైదరాబాద్: తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇటీవవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 66 శాతం సీట్లను గెలుచుకుందని సీఎం చెప్పారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని చోట్ల కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు. కార్యకర్తల కష్టం వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చామని, ఇప్పుడు కార్యకర్తలను గెలిపించాల్సిన బాధ్యత తమపైన ఉందన్నారు. కార్యకర్తల గెలుపు కోసం గల్లీ గల్లీ కాదు.. ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేస్తానని సీఎం రేవంత్ పేర్కొన్నారు. గాంధీ భవన్ లో గురువారం నిర్వహించిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ వల్లనే తాను ముఖ్యమంత్రిరి అయ్యానని, కాంగ్రెస్ పార్గీకి తెలంగాణ ఎప్పుడూ అండగా నిలబడిందన్నారు. చట్ట సభల్లో బలం ఉందని మోదీ ప్రభుత్వం పేదల ను ఇబ్బంది పెడుతోందని, రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ గత ఎన్నికల సమయంలో కుట్ర చేసిందని సీఎం ఆరోపించారు. గత ఎన్నికల్లో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రయత్నం చేసిందని, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే దేశ వ్యాప్తంగా తిరిగి ప్రజలను అప్రమత్తం చేశారన్నారు. అదానీ, అంబానీ కి దేశాన్ని అప్పగించే కుట్ర అమలు కాకుండా కాంగ్రెస్ అడ్డుకుందన్నారు.
ఓటు ప్రక్షాళన పేరు సర్ అనే కార్యక్రమాన్ని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని, సర్ పేరుతో పేదలు, మైనార్టీల ఓటు హక్కు ను తొలగించే ప్రయత్నం జరుగుతోందన్నారు. పేదలకు ఓటు పోతే రేషన్ కార్డు, ఆధార్ కార్డు తో పాటు సంక్షేమ కార్యక్రమాలు అందకుండా పోతాయన్నారు. దేశంలో ఉండాలా లేదా అన్నది బీజేపీ చేతిలో ఉండేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఓటు ప్రక్షాళన వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. కాగా ఈ నెల 20 నుంచి 30 వరకు ప్రతి గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి కొత్త చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలన్నారు.
అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకోవాలని, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతి మండలానికి ఒక ఇంచార్జీని నియమించాలని, తాను కూడా ఒక మండల బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ఫిబ్రవరి మూడు నుంచి తొమ్మిది జిల్లాల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నామని, ములుగులో ఏర్పాటు చేసే బహిరంగ సభకు సోనియా, రాహుల్ , ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తామన్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు రాష్ట్ర ఎంపీలు నిరసన తెలపాలని, దేశం ఇబ్బందుల్లో ఉందని, ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం కోసం తెలంగాణ అండగా ఉంటుందని, మోదీని ఓడించి రాహుల్ ను ప్రధాని చేయడం కోసం అంతా కష్టపడి పని చేయాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.

