(సమీక్ష ప్రత్యేక కథనం)
మావోయిస్ట్ పార్టీ పీఎల్జీఏ చీఫ్ బడ్సే సుక్కా అలియాస్ దేవా టీం తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి ముందు శనివారం లొంగిపోయిన సందర్బంగా ఇజ్రాయెల్ కు చెందిన అధునాతన ‘TAVOR’ తుపాకీ గురించి సమీక్షించుకున్నాం కదా..? ఇజ్రాయెల్, అమెరికా దేశాల్లో తయారైన ‘TAVOR’, COLT రైఫిల్స్ చరిత్రకన్నా ముందు ‘పెన్ రివాల్వర్’లను కలిగి ఉన్న ఓ నక్సల్ గ్రూపు ఉమ్మడి రాష్ట్రంలో ఉండేదనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ పెన్ రివాల్వర్లు ఏమిటీ? అని ఆశ్చర్యపోకండి. పెన్ రివాల్వర్లు మాత్రమే కాదు తొలిసారి AK-47 ఆయుధాన్ని కలిగి ఉన్న ఆ నక్సల్ నేత ఆయుధ సంపత్తిని చూసి ఉమ్మడి వరంగల్ జిల్లా పోలీసులు మాత్రమే కాదు, అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భద్రతా బలగాలు కూడా నివ్వెరపోయాయంటే అతిశయోక్తి కాదు. ఆ కథాకమామీషు ఏమిటో తెలుసుకోవాలంటే ఓసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే.
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో నక్సల్ గ్రూపుల ఉద్యమాలకు కొదువలేని 1990వ దశకంనాటి సంగతి ఇది. అప్పట్లో పీపుల్స్ వార్ (ఇప్పటి మావోయిస్ట్), జనశక్తి, ప్రతిఘటన, ప్రజా ప్రతిఘటన, సీపీయూఎస్ఐ తదితర పలు నక్సల్ గ్రూపులు ఉండేవి. చండ్రపుల్లారెడ్డి గ్రూపు సంస్థలో ఏర్పడిన చీలికల నేపథ్యంలో అనేక పేర్లతో ఆవిర్భవించిన విప్లవ సంస్థలివి. ఇందులో భాగంగానే ప్రతిఘటన గ్రూపు నుంచి 1994లో ఏర్పడిన సంస్థ పేరు ‘ప్రజా ప్రతిఘటన’ (పీపీజీ). ఈ సంస్థకు కీలక నేత చలమన్న. రాష్ట్ర కార్యదర్శిగా మధు అలియాస్ యాకన్న ఉన్నప్పటికీ, పార్టీ వ్యవస్థాపకుడు మాత్రమే కాదు, కీలక నేత చలమన్నే. ఓవైపు జనశక్తి, మరోవైపు ప్రజాపంథా, ఇంకోవైపు ఫణిబాగ్చి (ప్రతిఘటన) గ్రూపులతో వర్గపోరాటం చేస్తూనే పోలీసులతోనూ పీపీజీ గ్రూపు తలపడుతుండేది.

విప్లవ గ్రూపుల చరిత్రలోనే చలమన్న వద్ద అధునాతన AK-47 తుపాకీ ఉన్నట్లు ఓ ఎన్కౌంటర్ ఘటనలో వెలుగులోకి వచ్చింది. పస్రా-తాడ్వాయి అడవుల్లో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో తనవద్ద గల AK-47 పేలకపోవడంతో చలమన్న దాన్ని అక్కడే గల ఓ వాగులో వదిలేసి తప్పించుకున్నారు. తూటా దూసుకువచ్చే గొట్టంలోకి ఇసుక దూరిన పరిస్థితుల్లో పేలని AK-47 తుపాకీని చలమన్న వాగులో వదిలేశారు. ఘటనానంతరం ఎన్కౌంటర్ స్థలంలో తమకు లభ్యమైన AK-47 తుపాకీని చూపి అప్పట్లో వరంగల్ జిల్లా పోలీసులు ఆశ్చర్యపోయారు ఎందుకంటే అప్పట్లో పోలీసుల వద్దనేకాదు, పీపుల్స్ వార్ నక్సల్స్ వద్ద కూడా AK-47 ఆయుధాలు లేవంటే ఆశ్చర్యం కాదు.
ఈ నేపథ్యంలోనే ప్రతిఘటన గ్రూపు నుంచి చీలిక తర్వాత ప్రజాప్రతిఘటనను ఏర్పాటు చేసిన చలమన్న, తన ముఖ్య అనుచరుడు జగ్గాని భిక్షపతితో కలిసి సంస్థను బలోపేతం చేసే ప్రక్రియను ప్రారంభించారు. AK-47 వంటి పాపులర్ వెపన్స్ తోపాటు ఎస్ఎల్ఆర్ (సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్) తుపాకులు సమకూర్చుకున్నారు. తన సాయుధ దళాలకు నాయకత్వం వహించే ప్రతి కమాండర్ కు ఓ AK-47, దళసభ్యులకు ఎస్ఎల్ఆర్ తుపాకులను సమకూర్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, ఏటూరునాగారం, తాడ్వాయి, మంగపేట, పరకాల, ఖమ్మం జిల్లాలోని గుండాల, పినపాక, మణుగూరు, కొత్తగూడెం ప్రాంతాల్లో సాయుధ దళాల కదలికలతో తన పార్టీ కార్యకలాపాలను తీవ్రతరం చేశారు.

ఇదే దశలో పీపీజీ నక్సల్ సంస్థ ‘పెన్ రివాల్వర్లు’ సమకూర్చుకున్నట్లు పోలీసులు పసిగట్టారు. ఏదేని ప్రయాణ సమయంలో స్వీయరక్షణకేగాక, టార్గెట్ గా ఎంచుకున్న వ్యక్తులను సులభంగా అంతమొందించేందుకు చలమన్న నాయకత్వంలోని పీపీజీ గ్రూపు పెన్ రివాల్వర్లను సమకూర్చుకున్నట్లు పోలీసులు గ్రహించారు. దాదాపు మూడు దశాబ్ధాల క్రితమే తొలిసారి AK-47 ఆయుధాన్ని కలిగి ఉండడంతోపాటు పెన్ రివాల్వర్ వంటి సూక్ష్మ తుపాకీని సమకూర్చుకున్న చలమన్నతోపాటు అతని ముఖ్య అనుచరుడు జగ్గాని భిక్షపతిని పోలీసులు ఖమ్మం జిల్లాలో 1996లో జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో మట్టుబెట్టారు.
పాయింట్ బ్లాంక్ రేంజ్ లో ఉపయోగిస్తే మనిషి ప్రాణాలు కోల్పోవచ్చని కూడా పీపీజీ నక్సల్స్ నుంచి పెన్ రివాల్వర్లను స్వాధీనం చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అప్పటి వరంగల్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. పార్టీ చీలకముందు టార్గెట్ లో అబ్ధుల్ రహమాన్ అనే వ్యక్తిని కాల్చి చంపిన ఘటనలో జగ్గాని భిక్షపతి పెన్ రివాల్వర్ ను ఉపయోగించారనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది.

పీపీజీ వ్యవస్థాపకుడు చలమన్న పాల్పడిన ఓ రెండు ఘటనలు దేశవ్యాప్తంగానూ అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించాయి. ఉమ్మడి రాష్ట్ర శాసనసభకు 1994లో జరిగిన ఎన్నికల సందర్భంగా అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు సమీప బంధువును కొత్తగూడెంలో కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి, తమ డిమాండ్లను తీర్చుకోవడం, బయ్యారం సమీపంలో వన్యప్రాణులను వేటాడుతున్న నలుగురు వేటగాళ్లను హతమార్చిన నేపథ్యం చలమన్న నాయకత్వంలోని పీపీజీ గ్రూపు నక్సల్స్ పాల్పడిన ఘటనల్లో ముఖ్యమైనవి. చలమన్న నాయకత్వంలోని పీపీజీ గ్రూపును పోలీసులు అప్పట్లో అత్యంత ప్రమాదకరంగానూ అంచనా వేశారు. ఈ పరిస్థితుల్లోనే ప్రజాప్రతిఘటన గ్రూపు పూర్తిగా ఎదగకముందే ఆదిలోనే తుదముట్టించారు.

✍️ ఎడమ సమ్మిరెడ్డి

