ఛత్తీస్ గఢ్: బర్సే దేవా.. మావోయిస్ట్ పార్టీలో హిడ్మా తర్వాత మరో హిడ్మాగా ప్రాచుర్యం పొందిన నక్సల్ లీడర్. ఇటీవల ఏపీలోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో మరణించిన హిడ్మా నాయకత్వం వహించిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ)కి ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్న దేవా అరెస్టయ్యాడా? లొంగుబాటను ఆశ్రయించాడా? దేవాతోపాటు అతని వెంట గల 13 మందిని తెలంగాణా పోలీసులు అరెస్ట్ చేశారనే ప్రచారంపై నిన్నటి నుంచి సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి.
హిడ్మాను కేంద్ర కమిటీలోకి తీసుకున్న తర్వాత అప్పటి వరకు అతను నాయకత్వం వహించిన పీఎల్జీఏ బెటాలియన్-1 బాధ్యతలను దేవాకు అప్పగించారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గత నవంబర్ 18న హిడ్మా దంపతుల ఎన్కౌంటర్ ఘటన తర్వాత దేవా అంశంపై భిన్నకోణాల్లో వార్తా కథనాలు వెలువడ్డాయి.

తాజా వార్తల ప్రకారం దేవా తెలంగాణా పోలీసులకు చిక్కాడనే కథనాలకు అధికారిక ధ్రువీకరణ మాత్రం లేదు. ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలోని హిడ్మా గ్రామం పువర్తికే చెందిన దేవా కూడా ఉద్యమ ప్రస్థానంలో అతని సమకాలికుడే. కాగా రెండు రోజుల క్రితం ఛత్తీస్ గఢ్- తెలంగాణా రాష్ట్రాల సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు బర్సే దేవాతో పాటు అతని వెంటగల మరికొందరిని అదుపులోకి తీసుకున్నారనే ప్రచారంపై పౌరహక్కుల సంఘాలు కూడా స్పందించాయి.
దీనిపై పౌర హక్కుల సంఘాలకు చెందిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కమిటీలతోపాటు ప్రొఫెసర్ హరగోపాల్ వేర్వేరు ప్రకటనలు విడుదల చేస్తూ, అరెస్టును చేసిన వారిని వెంటనే కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్ చేశారు. ఒకవేళ వాళ్ళు పోలీసులు అదుపులో ఉన్నట్లయితే తక్షణమే వారిని మీడియా ముందు ప్రవేశపెట్టాలని, వాళ్లకు ఎలాంటి ప్రాణహాని చేయకుండా తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని మీడియా ముందు ప్రవేశపెట్టాలని వారు కోరారు.

