హైదరాబాద్: రేపు జనవరి 1.. ప్రపంచమంతా కొత్త ఏడాదికి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు సిద్ధమవుతుంటే, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు మాత్రం ఈసారి ఒక చిన్నపాటి ‘షాక్’ తగిలిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా జనవరి 1న ఎంజాయ్ చేస్తున్న ‘పబ్లిక్ హాలిడే’కు ఈ ఏడాది బ్రేక్ పడడమే అందుకు కారణం.
గత బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ప్రభుత్వం హయంలో జనవరి 1వ తేదీని అధికారిక సెలవుగా ప్రకటించేవారు. కొత్త సంవత్సరం ప్రారంభ రోజున సెలవు ఇచ్చినందుకు బదులుగా, ఫిబ్రవరిలో వచ్చే రెండో శనివారాన్ని ‘వర్కింగ్ డే’గా మార్చి బ్యాలెన్స్ చేసేవారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పద్ధతికి స్వస్తి పలికడం గమనార్హం. రేపటి నుంచి ప్రారంభం కానున్న 2026 సెలవుల క్యాలెండర్‌లో జనవరి 1వ తేదీన కేవలం ‘ఐచ్ఛిక సెలవు’ (ఆప్షనల్ హాలీడే) జాబితాలో చేర్చింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ వర్గాలు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. ఎప్పటిలాగే జనవరి 1న సెలవు ఇస్తే బాగుండేదని కొందరు అభిప్రాయపడుతుండగా, డిసెంబర్ 31న చేసుకునే సంబరాల ‘జోష్’ను 1వ తేదీన కొనసాగించేదిగా గతంలో ఉండేదని మరికొందరు పేర్కొంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొత్త సంవత్సరం వేళ పరస్పర శుభాకాంక్షలు చెప్పుకోవడానికి ఆప్షనల్ హాలీడే నిర్ణయమే సముచితమంటున్నారు.

