పుట్టుక, చావు.. మానవ జీవితంలో కీలక ఘట్టాలు. అనివార్యమైన ఈ జీవన పయనంలో చాలా మంది జర్నలిస్టులు చనిపోతుంటారు.. అందులో కొందరే చనిపోయినా తాము చేసిన సేవలకు మరచిపోలేని గుర్తుగా మదిలో జీవించే ఉంటారు.. ముఖ్యంగా తాను ఉపాధి కల్పించినవారికి, తాను హెడ్డింగులు పెట్టిన విలేకరులకు ఉన్నత హోదాలో గల జర్నలిస్టులు గుర్తుండడమనేది అరుదనే చెప్పాలి. ఎందుకంటే తన హోదాను అడ్డం పెట్టుకుని అతను సంపాదించుకున్నదేమీ లేదు. కలుసుకున్న ఆ కొద్దిసేపటి సందర్భ సమయంలో హోదాల తారతమ్యాలతో సంబంధం లేకుండా గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ ను ఆఫర్ చేసి మరీ ఆప్యాయతను పంచే నిరాడంబర జీవితానికి నిలువెత్తు నిదర్శనం టీకే లక్ష్మణ్ రావు. ఉద్యోగం ఇచ్చినందుకు అతనేమీ ఆశించడు. ఉపాధి కల్పించే ముందు బాగా రాయగలడా? లేదా? అని మాత్రమే తెలుసుకుంటారు. తెలుగు మీడియాలో ఇంత నిష్కలంక మనుషులు ఎక్కడో.. ఎప్పుడో.. అత్యంత అరుదుగా మాత్రమే కనిపిస్తారు. అనారోగ్యంతో నిన్న కన్ను మూసిన ‘మఫసిల్ ఎడిటర్’ టీకే లక్ష్మణ్ రావును స్మరించుకుంటూ నలుగురు సీనియర్ జర్నలిస్టులు రాసిన నివాళి ఆర్టికల్స్ లో ఆయన సజీవంగానే కనిపిస్తున్నారు.. ఇక చదవండి.
గ్రామీణ లక్ష్మణుడు ( టి.కె. లక్ష్మణరావు )అలా వెళ్లిపోయారు.
కొన్ని వందల మంది జర్నలిస్టుల ఇళ్లల్లో పొయ్యి వెలగడానికి లక్ష్మణరావు రికమెండేషనే కారణం.
ఆంధ్రభూమి, ఉదయం, వార్త, సాక్షి పత్రికల్లో పనిచేసిన లక్ష్మణరావు అన్నింట్లోనూ జిల్లా వార్తలకు పెద్ద దిక్కుగానే ఉండేవారు.
ఆయన్ని నడిచొచ్చే ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ఛేంజ్ అనొచ్చు.
ఏ పత్రికలో ఉన్నా తన మాట చెల్లుబాటు అయ్యే అవకాశం ఉంటే ఎవరు అడిగినా ఉద్యోగం ఇచ్చేశారు.
ప్రత్యేకించి ఉదయం పత్రిక లాకౌట్ అయినపుడు వందలాది మంది జర్నలిస్టులు రోడ్డున పడిపోయినపుడు అప్పుడే కొత్తగా వచ్చిన వార్త పత్రికలో లక్ష్మణ రావు చేరారు. ఎడిటర్ ఏబీకే ప్రసాద్ తో పాటు డిప్యూటీ ఎడిటర్ సతీష్ చందర్ తో సన్నిహితంగా మెలిగే లక్ష్మణ రావు ఎవరి పేరు చెబితే వారికి వార్తలో ఉద్యోగం వచ్చేసింది. ఒకరూ ఇద్దరూ కాదు వంద కుటుంబాలకు పైనే రోడ్డున పడిపోకుండా కాపాడారాయన. నేనే కనీసం పదిహేను మందిని లక్ష్మణరావు గారి సహకారంతో ఉద్యోగాలు ఇప్పించగలిగాను.
వార్త తర్వాత సాక్షిలో చేరారు. అప్పటికి వార్తలో సరిగ్గా జీతాలు రాక జర్నలిస్టులు దుర్భర జీవితాలు గడుపుతున్నారు. మళ్లీ ఎంప్లాయ్ మెంట్ ఎక్స్ఛేంజ్ ఓపెన్ అయ్యింది. సాక్షిలో చాలా మందికి లక్ష్మణ రావు ఉద్యోగాలు ఇప్పించారు. 1991లో నేను ఆంధ్ర భూమిలో ఉన్నప్పుడు లక్ష్మణరావు గారు పరిచయం. ఓ మంచి స్టోరీ రాస్తే పది మందికి చెప్పి పొంగిపోయేవారు. భుజం తట్టి మెచ్చుకునేవారు.
మా గోదారి జిల్లా యాసలో గ్రామీణ వార్తల ముచ్చట్లు..వాటి వెనుక ఉన్న కతలు చాలా ఆసక్తికరంగా చెప్పేవారు. మా ఇద్దరికీ మధ్య వారధి అంటే కె.ఎన్.వై. పతంజలే. పతంజలి గురించిన ఎన్నో కబుర్లు లక్ష్మణరావు నోటనే వినాలి. చాలా వార్తాకథనాలు లక్ష్మణరావు హెడింగ్ వల్ల మెరిసేవి. అందులో ఆయన ఎక్స్ పర్ట్. కోడి గుడ్ల వ్యాపారం సంక్షోభంలో ఉందన్న ఒక వార్తకు ” కోళ్ల ఫారాలు పెట్టాం..గుడ్లు తేలేశాం” అని హెడింగ్ పెట్టారు. అలాగే రెండు వర్గాల మధ్య గొడవ జరిగి కొట్టుకుంటే ” కర్రలతో కొట్టారు కాళ్లు విరగ్గొట్టారు” అని హెడింగ్ పెట్టారు. ఇలాంటివి కొల్లలు.
సాక్షిలో ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా టీవీలో నేను రాసిన మ్యాగజైన్ స్టోరీ బాగుంటే.. యాజీ చాలా బాగుంది అని మెచ్చేవారు. మధ్యలో ఫోన్లలో మాట్లాడుకున్నా ఏటా డిసెంబరు 31న మాత్రం ప్రెస్ క్లబ్ ఈవెంట్ లో కలుసుకునే వాళ్లం. ఈ సారి ఆ అదృష్టం లేకుండా పోయింది.
మంచి మనిషి. అంతకు మించి స్నేహశీలి. దాన్ని మించి అల్ప సంతోషి.
నన్ను ఎంతగానో ప్రేమించి వెన్నుతట్టి ప్రోత్సహించిన ఆత్మబంధువుకు ఇదే నివాళి..
✍️ సి.ఎన్.ఎస్.యాజులు

ఆగిపోయిన “గుండె గొంతుక”
నిన్నటి రోజు చనిపోయిన లక్ష్మణ్ ను చూస్తే ఆంధ్రభూమి రోజుల్లో గుండె గొంతుక శీర్షిక గుర్తుకొస్తుంది. ఆ రోజుల్లో లక్షణ్ గుండె గొంతుకకు పర్యాయం పదం అయిపోయారు.
ఏబీకే సంపాదకుడుగా విజయవాడలో ప్రారంభమైన ఆంధ్రభూమికి లక్ష్మణ్ మఫిషిల్ డెస్క్ ఇంచార్జ్ గా పనిచేసేవారు. గ్రామీణ వార్తలు అన్నా, గ్రామీణ విలేకరులు అన్నా చిన్న చూపు ఉండేది. అలాంటి సెగ్మెంట్ కు లక్ష్మణ్ ఊపిరూది జీవం పోశారు. మానవీయకోణం జోడించారు. గ్రామీణ వార్తలకు పట్టం కట్టారు. గ్రామీణ విలేకరులతో మమేకం అయ్యారు. ఈ శీర్షికలో అచ్చయిన మానవీయ వార్తలు ఒకటా,రెండా, ఎన్నని చెప్పేది. అందులో నాకు గుర్తు వున్న వున్నా కృష్ణమూర్తి గారి కథనం “అప్పారావు (గురజాడ మీద సినిమా) తీసాడు; అప్పులపాలయ్యాడు”.
తాను నెల జీతం కోసం చేసే ఉద్యోగం అని దానికి పనిగంటలు ఉంటాయని తెలియని అమాయకుడు లక్ష్మణ్. రాత్రి రెండు దాటాక పేజీలు చూసుకుని తిన్నగా ఇంటికి చేరకుండా ఆఫీసు బయటో లేకపోతె పక్కన వుండే రామకృష్ణ థియేటర్ దగ్గర వుండే టీ స్టాల్ లోనో లేకపోతె పక్కన వుండే బార్ లోనో తనకు తెల్లారిపోయేది. చేతిలో సిగరెట్ పాకెట్, అగ్గిపెట్టె ఉంటే చాలు మనిషి నాన్ స్టాప్ కబుర్లతో కాలం గడిపేసేవాడు. గ్రామీణ విలేకరులను ఏసుకొని పిల్లల కోడి లా తిరిగేసేవాడు.
లక్ష్మణ్ కు ఒక తమ్ముడు వున్నారు. పేరు వేణు. తమ్ముడు జనరల్ డెస్క్ ఇంచార్జ్ అయితే అన్న మఫిషియల్ డెస్క్ ఇంచార్జి. మఫిసిల్ డెస్క్, జనరల్ డెస్క్ ల లాగానే అన్నదమ్ములు ఇద్దరూ భిన్న స్వభావాలు కలిగినవారు. తమ్ముడు మితభాషి అయితే, అన్న లొడబుచ్చి (talkative). ఇద్దరు ఇంచార్జీలు పక్క పక్కనే వున్నా భిన్న ధ్రువాలులాగా వుండే వారు. తమ్ముడిని చూస్తే మాత్రం అన్నకు నోట్లో వుండే మాట నోట్లోనే మింగేసేవాడు. అన్న లేని తమ్ముడు వేణు. పాపం వేణుకు ఇక కాలగమనం కష్టమే!
✍️ గాలి నాగరాజ

మాకు అక్షరం నేర్పిన శిల్పి..
వార్త ఎలా రాయాలో కాదు…
వార్తలో మనిషిని ఎలా చూడాలో నేర్పిన గురువు.
పదేళ్ల సహవాసం నా జర్నలిస్ట్ ప్రయాణాన్ని ఒక దిశగా మలిచింది.
ఆ రోజుల్లో ఎన్నో కబుర్లు, ఎన్నో చర్చలు,
అంతకంటే ఎన్నో జ్ఞాపకాలు.
నీరు లేక రైతు ఇబ్బంది పడుతున్నాడని ఒక వార్త రాస్తే…
“వరికి ఉరి” అని హెడ్డింగ్ పెట్టి
ఆ ఒక్క లైన్లోనే రైతు ఆవేదన,
వ్యవస్థ వైఫల్యం, సమాజ నిర్లక్ష్యాన్ని చూపించిన తీరు
ఇప్పటికీ మనసులో చెరగని ముద్ర.
అటువంటి హెడ్డింగ్స్ గురించి మాట్లాడాలంటే
పెద్ద గ్రంథమే రాయాలి.
ఒక్కో హెడ్డింగ్‌లో
ప్రజల బాధ, వ్యవస్థ వైఫల్యం,
సమాజ నిర్లక్ష్యం అన్నీ మాట్లాడేవి.
అక్షరాలు ఆయుధాలవుతాయన్న సత్యం ఆయన దగ్గరే నేర్చుకున్నాను.
పెన్ను పదునైన కత్తి కంటే బలమైనదని,
ఒక్క హెడ్డింగ్ పాలకుల మనసు కదిలించగలదని
ఆచరణలో చూపించిన గురువు.
సమాచారం కాదు… సున్నితత్వం..
వేగం కాదు… విలువ..
ప్రముఖత కాదు… ప్రజల బాధ –
ఇవే జర్నలిజానికి ప్రాణమని మనసులో నాటారు.
ఈరోజు నేను ఏ స్థాయిలో ఉన్నా,
అందులో ఎక్కడో ఒకచోట
ఆయన నేర్పిన అక్షరం ఉంటుంది.
గురువుగా కాదు…
మార్గదర్శిగా, మిత్రుడిగా,
జర్నలిజం అనే ప్రయాణంలో
దారి చూపిన దీపంలా నిలిచిన
ఆ సహవాసం నా జీవితానికి ఒక వరం.
అక్షరం నేర్పిన శిల్పికి వినమ్ర నివాళి. 🙏
✍️ రాజేష్ తుర్లపాటి

పాత్రికేయ శిరోమణి.. లక్ష్మణరావు
పాత్రికేయుల్లో.. పైగా న్యూస్ ఎడిటర్, అసిస్టెంట్ ఎడిటర్ స్థాయికి వెళ్లినవారిలో మంచి వాళ్ళను వేళ్ళ మీద లెక్కపెట్టుకోవచ్చు! ఎందుకంటే ఎవరికి వాళ్ళు కోటరీలు గీసుకుని తమకంటూ ఒక టీమ్ తయారు చేసుకుని వారిని మాత్రమే ప్రోత్సహిస్తూ, మిగిలిన వాళ్ళను వాళ్ళకు తెలియకుండానే తొక్కేస్తుంటారు. తమదైన సామ్రాజ్యం ఏర్పరచుకుని, ఆ రాజ్యాన్ని కాపాడుకుంటూ యుద్ధాలు చేస్తుంటారు. అన్ని రంగాల్లో వున్న వ్యవహారమే అయినా పాత్రికేయ రంగంలో ఓ గుప్పెడు దుర్మార్గపు రాజకీయాలు ఎక్కువగా ఉంటాయి. కానీ, నేను చూసిన వారిలో లక్ష్మణరావు “ది బెస్ట్” అని ఘంటాపథంగా చెప్పగలను. ఈయన అలాంటి రాజకీయాలకు అతీతం. వీరి తమ్ముడు వేణు కూడా అంతే. ఇద్దరూ సెంట్రల్ డెస్క్ స్థాయిలో పట్టు సాధించి తమదైన పేరు, గుర్తింపు సాధించారు.
లక్ష్మణరావు 38 ఏళ్ళు పాత్రికేయ రంగంలో ఉండి అసిస్టెంట్ ఎడిటర్ స్థాయికి చేరుకుని సాక్షిలో పదేళ్ల క్రితం పదవీ విరమణ పొందారు. వారి వయసు 70. చాలా కాలం వరకు రాంనగర్ లోనే ఉన్నారు. గోపన్నపల్లె జర్నలిస్ట్ కాలనీలో అపార్ట్మెంట్ కట్టించుకుని అక్కడకు షిఫ్ట్ అయ్యాక నేను కలవలేదు. ఆయనకు భార్య, కుమార్తె సహజ, కుమారుడు శరత్ ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఉండే శరత్ ప్రస్తుతం హైదరాబాద్ కే షిఫ్ట్ అయ్యారు. సహజ అమెరికాలో ఉంటోంది. పిల్లలు ఇద్దరికి పెళ్లిళ్లు చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. నిన్న ఉదయం నలతగా ఉందంటే శరత్ నిమ్స్ కు తీసుకొచ్చారు. అక్కడే గుండెపోటుతో కనుమూసినట్లు సమాచారం. వైకుంఠ ఏకాదశి రోజు కనుమూయడం, ఇవాళ సంవత్సరం చివరి రోజు అంత్యక్రియలు విచారకరం. వారి భౌతిక కాయం గోపన్న పల్లె లోని వారి అపార్ట్మెంట్ లో సందర్శనార్ధం ఉంచారు. సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయి.
పాత్రికేయ రంగం ఒక మంచి స్వచ్ఛమైన విలువలు కలిగిన పాత్రికేయ శిరోమణిని కోల్పోయింది. నేనొక మంచి మనసున్న మిత్రుడిని పోగొట్టుకున్నాను. 2001లో వార్తలో నేను చేరాక వారితో పరిచయం ఏర్పడింది. అప్పట్లో సిటీ డెస్క్ లో నేనుంటే, వారు సెంట్రల్ డెస్క్ లో ఉండేవారు. నా రాతలు చూసి ప్రత్యేకంగా నన్ను పిలిపించుకుని పరిచయం చేసుకున్నారు. కొద్దిరోజుల్లోనే ఇద్దరం కలసి రోజూ క్యాంటీన్ లో కాసేపు కూర్చుని కబుర్లు చెప్పుకునే దోస్తులమై పోయాం. ఆయన చేతిలో ఎప్పుడు ఐటమ్ బ్రోమైడ్ పేపర్, పెన్ ఉంటుంది. ఆ ఐటమ్ కు సంబంధించి మంచి హెడ్డింగ్ పెట్టే ఆలోచనలో అటు ఇటు తిరుగుతుంటారు. సరిగా ఆ శీర్షిక తనకు సంతృప్తి అనిపించనప్పుడు క్యాంటిన్ కు వెళ్లే వారు. ఆ సమయంలో నన్ను వెతికేవారు! కబుర్లు చెబుతూ గుప్పు గుప్పు సిగరెట్ పీల్చే వారు. సిగరెట్ మంచి హెడ్డింగ్ లను ఇస్తుంది అనే వారు. హెడ్డింగ్ లు పెట్టడంలో, వార్తకు ప్రాణం పోయడంలో ఆయన కింగ్!
లక్ష్మణరావు మంచి స్నేహశీలి. ఎలాంటి ఇగోలు కల్మషం లేని దేవుడు లాంటి మనిషి! జెలసీలు ఏడ్పులు అసలు తెలియని వ్యక్తిత్వం! ఏదైనా మంచి అనిపిస్తే చిన్న పెద్ద ఏమీ ఆలోచించకుండా మనసారా అభినందించే మనస్తత్వం. ఐటమ్ బావుంటే అది ప్రజలకు ఉపయోగం అనిపిస్తే దానికి మంచి శీర్షిక పెట్టి హైలెట్ చేయించే దాకా వదలరు. చక్కటి విశ్లేషకులు, సద్విమర్శకులు. 38 ఏళ్ల ఆయన పాత్రికేయ జీవితంలో విలేకరులను అమితంగా ప్రోత్సహించారు. కాస్త స్కిల్ ఇంకాస్త స్పార్క్ ఉంటే మెరుగులు దిద్ది మంచి జర్నలిస్ట్ గా చెక్కి జీవితాలను నిలబెట్టారు. ఎందరికో ఉపాథి నీడను ఇచ్చారు. తప్పులు చేసిన వారిని పత్రికా యాజమాన్యం దూరం పెట్టమని చెప్పినా “పాపం ఇంకోసారి చేయకుండా చూస్తాను” అంటూ తనపై వేసుకుని వారికి ఉద్యోగ భద్రత కల్పించారు. ఇప్పటిలా “నాకు వాటా ఏదీ” అని అడిగే వారు కాదు. ఎవరైనా ఇచ్చినా తీసుకునే వారు కాదు! కుల మతాలను పట్టించుకోకుండా వార్తకు ప్రాధాన్యం ఇచ్చిన అసలు సిసలైన నిఖార్సు పాత్రికేయులు! విప్లవ భావాలు, విలువలు, నిజాయితీ, నిబద్ధత, స్పందించే హృదయం, అసామాన్య ప్రతిభ కలిగిన లక్ష్మణరావు లాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. అందరినీ కలుపుకుపోతారు. చిరునవ్వుతో అందరితో కలసిపోతారు. అంత విద్వత్తు ఉండి కూడా నేల మీద నడిచారు. సిటీ బస్సుల్లోనే తిరిగారు. సింపుల్ గా జీవించారు. ఒక గొప్ప పాత్రికేయుడ్ని కోల్పోయాం. మంచి మనసున్న జర్నలిస్ట్ లక్ష్మణరావు గారికి అశ్రు నివాళి. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
✍️ డా. మహ్మద్ రఫీ

