Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

ప్రింట్ పత్రికల ‘గుట్టు’ చెప్పిన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి..!

(సమీక్ష ప్రత్యేక కథనం)
పాతికేళ్ల క్రితం.. 1991లో విడుదలైన విక్టరీ వెంకటేష్ నటించిన ‘శత్రువు’ సినిమా గుర్తుంది కదా? అందులో విలన్ పాత్రధారి ప్రభుత్వ సంక్షేమ భవనాన్ని నిర్మిస్తే, అది కూలి కొందరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని లాయర్ పాత్రధారి కోర్టులో ‘పిల్’ తరహా కేసు దాఖలు చేస్తాడు. బిల్డింగ్ నిర్మించకుండానే విలన్ పాత్రధారి బిల్లు క్లెయిమ్ చేసుకోవడమే ఇందుకు కారణం. ఈ కేసు నుంచి బయటపడడం ఎలాగో తెలియక విలన్ సతమతమవుతుండగా, పక్కనే గల మరో పాత్ర ఓ ఉచిత సలహా పడేస్తుంది.
అసలు భవనమే కట్టలేదని ఒప్పేసుకుంటే విద్యార్థులు చనిపోనట్లే కదా? అని అంటాడు ఉచిత సలహాదారు.
భవనం కట్టకుండా బిల్లు క్లెయిమ్ చేసుకున్నట్లు ఒప్పుకున్నట్టవుతుంది కదా? అంటాడు విలన్ పాత్రధారి..
అయితే బిల్డింగ్ కూలిపోయినట్లు అంగీకరిద్దాం.. అంటాడు ఉచిత సలహా పాత్రదారి..
పిల్లలు చనిపోయినట్లు ఒప్పుకున్నట్లే కదా..? థాంక్స్.. అంటూ వెటకరిస్తూ.. ఈ వీరబాహుడేడండి బాబూ.. అంటూ విలన్ పాత్రధారి కోటశ్రీనివాసరావు తనదైన మేనరిజమ్ తో అద్భుతంగా నటించాడు ఆ సినిమాలో..

ఇప్పుడీ సినిమా సీన్ ఎందుకు గుర్తుకొచ్చిందంటే.. తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిన్నగాక మొన్న ఖమ్మం జర్నలిస్టులతో చిట్ చాట్ చేసిన సందర్భంగా చర్చించిన ఓ కీలక అంశం ఇదే సీన్ ను ‘ప్రింట్’ పత్రికల యాజమాన్యాలకు కొందరికి గుర్తుకు తెస్తుందని చెప్పక తప్పదు. ఇంతకీ విషయమేమిటంటే..?

జర్నలిస్టుల అక్రిడిటేషన్లకు సంబంధించి తెలంగాణా ప్రభుత్వం 252 జీవోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవో విషయంలో జర్నలిస్టు సంఘాల మధ్యే భిన్నాభిప్రాయాలు, భిన్నవాదనలు ఉన్నాయనేది వేరే సంగతి. కొన్ని జర్నలిస్టు సంఘాలు ఈ జీవోపై ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరో సంఘం ఈ జీవోవల్ల జర్నలిస్టులకు ఎటువంటి నష్టం లేదని వాదిస్తోంది. ఈ వాద, ప్రతివాదనల నేపథ్యంలోనే ఖమ్మం జర్నలిస్టులు రెండు రోజుల క్రితం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిశారు. వీరిలో ఓ జర్నలిస్టు సంఘం ప్రతినిధులతోపాటు, ఖమ్మం జర్నలిస్టుల హౌజింగ్ సొసైటీ నాయకులు కూడా ఉన్నారు.

‘నమస్తే తెలంగాణ’ పత్రిక ప్రచురించిన వార్తా కథనం

ఇళ్ల స్థలాల గురించి చేసిన అభ్యర్థనపై డిప్యూటీ సీఎం సింపుల్ గా తేల్చేశారు. హౌజింగ్ సొసైటీలకు స్థలం అప్పగించే అంశం కోర్టు పరిధిలో ఉందని, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉందని, తాను కూడా రూ. 10 లక్షలు చెల్లించి ఎమ్మెల్యేల కోటాలో ఇంటి స్థలం కోసం ఎదురుచూస్తున్నట్లు గుర్తు చేశారు. అందువల్ల సొసైటీలకు స్థల కేటాయింపు అంశం ఇప్పట్లో తేలేది కాదని కూడా నర్మగర్భంగా చెప్పేశారు. ఇదే దశంలో బీపీఎల్ కోటా కింద ఇచ్చేందుకు నగర పరిధిలోని 5 కి.మీ. పరిధిలో వీలుపడదని మున్సిపల్ చట్టం చెబుతోందని స్పష్టం చేశారు. మొత్తంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు అనేది ‘అంత అర్రీ బర్రీగా తేలే ఎవ్వారం కాదు’ అని చెప్పకనే చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి. ఇదే అంశంపై బీఆర్ఎస్ కరదీపిక ‘నమస్తే తెలంగాణా పత్రిక’ తనదైన శైలిలో వార్తా కథనాన్ని ప్రచురించడం గమనార్హం.

ఇదే సందర్భంగా పాత్రికేయుల అక్రిడిటేషన్ కార్డుల అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ, 252 జీవో గురించి తనకు తెలియదని చెప్పడం గమనార్హం. సరే.. సమాచార మంత్రిత్వ శాఖ ఆయనకు సంబంధించింది కాదు కాబట్టి, డిప్యూటీ సీఎంకు ఆ జీవో గురించి తెలియకపోవచ్చనే కాసేపు భావించడంలోనూ అతిశయోక్తి లేకపోవచ్చు. కానీ పత్రికల సర్క్యులేషన్, వాటి ‘కత’ల గురించి ఇటీవల చర్చకు వచ్చినట్లు భట్టి విక్రమార్క జర్నలిస్టులతో ఈ సందర్భంగా లేవనెత్తిన అంశమే అత్యంత ఆసక్తికరం.

అందువల్ల 252 జీవో వల్ల పెద్ద పత్రికలుగా పేర్కొంటున్న సంస్థలకు అక్రిడిటేషన్ కార్డులు తక్కువగా వస్తాయని భావిస్తే మరిన్ని కార్డులు ఇచ్చేందుకు జీవోను సవరించే ప్రయత్నం చేస్తామే తప్ప, మొత్తంగా జీవోనే రద్దు చేయాలంటే కుదరని పనిగా డిప్యూటీ సీఎం కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. నిజమే కదా..? డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పిన ఆయా చర్చలోని ప్రశ్నలు ప్రామాణికంగా ప్రభుత్వం వ్యవహరిస్తే ‘ప్రింట్’ చేస్తున్నట్లు చెప్పుకుంటున్న కొన్ని పత్రికా సంస్థల బాగోతం బట్టబయలయ్యే అవకాశం ఉంది కదూ!

అంతే కాదు.. అసలు ఎడిషన్లే లేకుండా ఫలానా ప్రాంతం నుంచి ప్రచురిస్తున్నట్లు చెప్పుకుంటున్న మరికొన్ని పత్రికల బండారం కూడా బయటపడుతుంది. ఇక ఈ-పేపర్ ముసుగులో ప్రింట్ పత్రికలుగా చెలామణిలో గల మీడియా సంస్థల గుట్టు కూడా రట్టవుతుంది. మొత్తంగా తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ చర్చనీయాంశ ప్రశ్నల ద్వారా తాను ఆర్థిక మంత్రిత్వ శాఖను కూడా నిర్వహిస్తున్నట్లు జర్నలిస్టులకు చెప్పకనే చెప్పారు. అదీ సంగతి.

Popular Articles