హైదరాబాద్: ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తి అని, వాటి పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదన్నారు. ప్రభుత్వ భూముల రక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. సచివాలయంలో సహచర మంత్రి మహ్మద్ అజారుద్దీన్, జూబ్లీ హిల్ల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ లతో కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు తదితర అంశాలపై సోమవారం మంత్రి పొంగులేటి అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, పేదల సంక్షేమం, ప్రజా అవసరాలు, అభివృద్ది కార్యక్రమాల కోసం వినియోగించవలసిన ప్రభుత్వ భూములను కొద్దిమంది స్వార్ధప్రయోజనాల కోసం కబ్జాపెట్టే ప్రయత్నాలు చేస్తుంటారని, ఇటువంటి వాటిని ఎట్టిపరిస్దితుల్లోనూ సహించబోమన్నారు. ఆక్రమణలను గుర్తించిన వెంటనే నోటీసులు జారీ చేసి, అవసరమైతే ఖాళీ చేయించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇదే సందర్భంలో వివాదాల్లో ఉన్న భూముల పరిరక్షణకు న్యాయపరంగా ఎదుర్కొని కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్లకు సూచించారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోరబండ, ఎర్రగడ్డ, షేక్‌పేట్ ప్రాంతాల్లో దశాబ్దాలుగా మైనార్టీలు స్మశాన వాటికలు లేక ఇబ్బంది పడుతున్న విషయంపై కూడా సమీక్షించారు. ఈ సమస్యను వీలైనంత త్వరితగతిన రక్షణశాఖ, రెవెన్యూ, వక్ఫ్‌బోర్డ్ సమన్వయంతో అధిగమించాలని అధికారులకు సూచించారు. అవసరమైన చోట రెవెన్యూ భూమిని రక్షణశాఖకు బదలాయించి, వారి నుంచి ప్రత్యామ్నాయంగా భూమి తీసుకోవాలన్నారు. అలాగే రెవెన్యూ భూమిని వక్ఫ్ బోర్డుకు అప్పగించాలని మంత్రి సూచించారు. ఈ సమావేశంలో TMREIS వైస్ ఛైర్మన్ ఫహీం ఖురేషి, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి.షఫీల్లాహ్, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

