ఖమ్మం: ఖమ్మం నగరంలోని కొన్ని ప్రైవేట్ స్కూళ్ల నిర్వాహకులైన ప్రముఖుల కోసం బుధవారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారులు వచ్చారా? నగరంలోని మూడు, నాలుగు స్కూళ్ల నిర్వాహకుల ఇళ్ల తలుపులను NIA అధికారులు తట్టారని, మావోయిస్టులకు మద్ధతుగా ఉన్నారనే సమాచారంతో వారిని విచారించారనే ప్రచారం జోరుగా సాగింది. ఇదే అంశంపై నగర పోలీసు అధికారులను సంప్రదించినా స్పష్టత రాలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఇటువంటి అంశాల్లో స్థానిక పోలీసు అధికారులకు సైతం సమాచారం ఇవ్వకుండానే తమ పని తాము చేసుకుని వెడుతుంది. ప్రత్యేక ఘటనల్లో అవసరమని భావిస్తే తప్ప జిల్లా పోలీసు శాఖ ఉన్నతాధికారికి మాత్రమే సమాచారం NIA ఇస్తుంది.
ఈ నేపథ్యంలో NIA అధికారులు ఖమ్మం నగరంలోని మూడు, నాలుగు స్కూళ్లకు చెందిన ప్రముఖుల కోసం వచ్చారనే ప్రచారం సంచలన చర్చకు దారి తీసింది. ఇంతకీ ఏం జరిగిందనే అంశంపై ‘సమీక్ష’ ఆరా తీయగా అసలు విషయంపై స్పష్టత వచ్చింది. పాలస్తీనా-ఇజ్రాయెల్ ఘర్షణ అంశంలో గత ఆగస్టులో పాలస్తీనాకు మద్దతుగా ఖమ్మంలో వివిధ ప్రైవేట్ స్కూళ్లకు చెందిన విద్యార్థులతో స్థానిక రాజకీయ పక్షాలు సంఘీభావ ర్యాలీ నిర్వహించాయి. ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ, శాంతికోసం ఈ ర్యాలీలో పిలుపునిచ్చాయి. వివిధ ప్రైవేట్ స్కూళ్లకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొన్నాయి.

అయితే ఇదే అంశంపై స్థానిక బీజేపీ నాయకులు కేంద్రానికి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు ఫిర్యాదు చేశాయి. పాలస్తీనాకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలు జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొంటూ సంబంధిత ప్రైవేట్ స్కూళ్ల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో బీజేపీ నాయకులు కోరారు. ఈ నేపథ్యంలోనే సీబీఎస్ఈ బోర్డుకు చెందిన ఓ ఉన్నతాధికార బృందం బుధవారం ఖమ్మం చేరుకుని విచారణ జరిపింది. ఆగస్టు మొదటి వారంలో నిర్వహించిన పాలస్తీనా అనుకూల ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు చదివే సీబీఎస్ఈ స్కూళ్ల నిర్వాహకులను విచారించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే నగరంలోని ఆయా స్కూళ్ల ప్రముఖుల కోసం NIA అధికారులు వచ్చి విచారించారని ప్రచారం జరగడం గమనార్హం.
ఇదిలా ఉండగా పాలస్తీనా అనుకూల, జాతి వ్యతిరేక ర్యాలీలు నిర్వహించి, నాయకత్వం వహించిన స్కూళ్ల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ భారతీయ కిసాన్ సంఘ్ నాయకుడు మంధనపు రామారావు డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా ఖమ్మంలో ర్యాలీ నిర్వహించినవారిపై NIA చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఓ వీడియోను విడుదల చేశారు. కొన్ని స్కూళ్ల నిర్వాహకుల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, వారిపై NIA చర్యలు తీసుకోవాలని, సీబీఎస్ఈ బోర్డు ఆయా స్కూళ్లను సీజ్ చేయాలని రామారావు కోరారు.
కాగా తనకోసం NIA అధికారులు వచ్చారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని హార్వెస్ట్ స్కూల్ నిర్వాహకుడు రవి మారుత్ ‘సమీక్ష’తో చెప్పారు. తన ఇంటికి NIAకు చెందినవారెవరూ రాలేదన్నారు. వస్తారేమో తెలియదని కూడా రవి మారుత్ పేర్కొన్నారు.

