(‘సమీక్ష’ ప్రత్యేక కథనం)
తెలంగాణా రాజకీయాల్లో ప్రకంపనలకు హేతువైన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తునకు మరో సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) ఏర్పాటు.. ఇదీ తాజా వార్త. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన్నార్ నేతృత్వంలో మరో తొమ్మిది మంది పోలీస్ అధికారులతో సిట్ ను ఏర్పాటు చేస్తూ డీజీపీ బి. శివధర్ రెడ్డి ఉత్తర్వు జారీ. రామగుండం, సిద్ధిపేట పోలీస్ కమిషనర్లు అంబర్ కిషోర్ ఝా, ఎస్ఎం విజయ్ కుమార్, మాదాపూర్, మహేశ్వరం డీసీపీలు రితిరాజ్, కె. నారాయణరెడ్డి వంటి ఐపీఎస్ అధికారులతోపాటు గ్రే హౌండ్స్ గ్రూప్ కమాండర్ ఎం. రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కేఎస్ రావు, జూబ్లీ హిల్స్ ఏసీపీ పి. వెంకటగిరి, ఇద్దరు డీసీపీలు సీహెచ్ శ్రీధర్, నాగేందర్ రావులకు ‘సిట్’లో స్థానం కల్పించారు.
ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి దర్యాప్తు కోసం ఇప్పటికే ఓ సిట్ తన పని తాను చేస్తుండడం గమనార్హం. వాస్తవానికి నిరుడు మార్చి 10వ తేదీన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. ప్రముఖ రాజకీయ నాయకుల, న్యాయమూర్తుల, జర్నలిస్టుల, బిజినెస్ టైకూన్ల, సినీ ప్రముఖుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనేది కేసులోని ప్రధాన అభియోగం. కేసులో ఇప్పటికే గల సిట్ అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నప్పటికీ, పెద్దగా పురోగతి లేనందువల్లే తాజాగా ఐపీఎస్ అధికారులతో మళ్లీ సిట్ ను ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

అప్పటి హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి కేసులో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే టాస్క్ ఫోర్స్ రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్ రావు, అదనపు డీసీపీలు భుజంగరావు, తిరుపత్న, ఏసీపీ ప్రణీత్ రావులను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఆయా అధికారులను విచారణ చేసిన నేపథ్యంలోనే అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావును ప్రధాన నిందితునిగా గుర్తించి నిర్దేశిత గడువలోగా, అంటే 90 రోజుల్లోనే ఛార్జిషీట్ ను దాఖలు చేశారు.
కానీ ప్రభాకర్ రావుతోపాటు మరో నిందితుడైన శ్రవణ్ రావు అమెరికాకు పారిపోయిన పరిస్థితుల్లో రెడ్ కార్నర్ నోటీసలు జారీ చేసి మరీ వారిని తిరిగి మన దేశానికి, హైదరాబాద్ కు రప్పించారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభాకర్ రావును గత వారం రోజులుగా విచారిస్తున్నప్పటికీ ప్రయోజనం లభించలేదనే వార్తలు కూడా వచ్చాయి. ఎస్ఐబీలో కీలక ఆధారాలను ధ్వంసం చేసిన పరిస్థితుల్లోనూ దర్యాప్తు పెద్దగా ముందుకు సాగినట్లు లేదు. ఈ పరిస్థితుల్లోనే ప్రభుత్వం తాజాగా సజ్జన్నార్ చీఫ్ గా మరో సిట్ ను ఏర్పాటు చేయడం ఆసక్తికర పరిణామంగా మారింది.

మహిళలపై యాసిడ్ దాడులు, ‘హ’త్యాచారాల వంటి ఘటనల్లో ‘ఎన్కౌంటర్’ స్పెషలిస్టుగా ప్రాచుర్యం పొందిన విశ్వనాథ్ చెన్నప్ప (వీసీ) సజ్జన్నార్ తోపాటు మరికొందరు ఐపీఎస్ అధికారులతో ఏర్పాటైన సిట్ తాజాగా దర్యాప్తును ఏ విధంగా ముందుకు తీసుకెళ్లనుంది? ఇదీ తాజాగా జరుగుతున్న ప్రశ్నార్థకపు చర్చ. సుప్రీంకోర్టు ఆదేశంతో ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ చేస్తున్న సిట్ అధికారులు ఆయన నుంచి ఎటువంటి సమాచారాన్ని రాబట్టలేకపోయారనే సారాంశంతో వార్తలు వెలువడుతున్నాయి. దాదాపు వారంపాటు ప్రభాకర్ రావును విచారించిన సిట్ అధికారులు ఆయా నివేదికను శుక్రవారం సుప్రీంకోర్టులో సమర్పించి, మరికొన్నిరోజులు అతన్ని కస్టోడియల్ విచారణకు అప్పగించాలని అభ్యర్థించే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలోనే సజ్జన్నార్ నేతృత్వంలో ఏర్పాటైన తాజా సిట్ టీం తమ దర్యాప్తులో ఏయే అంశాలను రాబట్టనుందనే ప్రశ్నపైనా భిన్న చర్చ జరుగుతోంది. ఎస్ఐబీ చీఫ్ గా పనిచేసిన ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక సమాచారాన్ని రాబట్టడానికి సజ్జన్నార్ తోపాటు మరికొందరు ఐపీఎస్ అధికారులను సిట్ టీంలో నియమించడం వెనుక ప్రభుత్వ లెక్కలు లోతుగా ఉన్నాయంటున్నారు. ఇప్పటికే 21 నెలల పుణ్యకాలం గడిచిన ఈ కేసులో ‘రంధ్రాన్వేషణ’ లక్ష్యంగా దర్యాప్తు సాగవచ్చంటున్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకుల, న్యాయమూర్తుల, సినీ సెలబ్రిటీల ఫోన్లను ట్యాప్ చేసి విన్న సంభాషణల సారాంశం కొంతమేర బహిర్గతమయ్యే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు.

ఏయే రాజకీయ ప్రముఖుని ఫోన్ ట్యాప్ చేసి ఏం విన్నారు? సినీ సెలబ్రిటీల ఫోన్లను చెవులు రిక్కరించి విన్న మాటలేమిటి? ఇంటి అల్లుడని కూడా చూడకుండా నా భర్త ఫోన్ ట్యాప్ చేస్తారా? అంటూ కల్వకుంట్ల కవిత చేసిన కీలక ఆరోపణపైనా ‘విషయం’ వెలుగులోకి రావచ్చంటున్నారు. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ ద్వారా గులాబీ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన ‘అరాచకం’లోని అన్ని అంశాలను కాకపోయినా, పరిమిత పద్ధతుల్లో కొన్ని కీలక విషయాలను తెలంగాణా సమాజం ముందుంచి, ఇందుకు కారణమైన అసలు ‘బాస్’ పేరును బహిర్గగతం చేసి కేసు దర్యాప్తును ఓ కొలిక్కి తీసుకురావచ్చనేది పరిశీలకుల అంచనా.

తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికలనాటికి గత ప్రభుత్వంలోని కొందరు పెద్దల ఫోన్ ట్యాపింగ్ దందాలోని కీలకాంశాలతో దోషులుగా నిలిపే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. చూడాలి సజ్జన్నార్ నాయకత్వంలో ఏర్పాటైన తాజా ‘సిట్’ ఈ కేసు దర్యాప్తును చివరికి ఎలా ముగిస్తుందో..!
Update:
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీని సుప్రీంకోర్టు శుక్రవారం పొడిగించింది. ప్రభాకర్ రావు కస్టడీని పొడిగించాల్సిందిగా సిట్ అధికారులు అభ్యర్థించారు. ఈమేరకు ప్రభాకర్ రావు కస్టడీని ఈనెల 25 వరకు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంటి నుంచి ఆహారం తెచ్చుకునేందుకు, అవసరమైన మందులు తీసుకునేందుకు కూడా ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు అనుతినిచ్చింది. కేసు విచారణను వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది.

