Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ‘లొంగుబాటు’

హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) తెలంగాణా మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పోలీసులకు లొంగిపోయాడు. తెలంగాణా రాజకీయాల్లో ప్రకంపనలు కలిగించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు నిందితునిగా ఉన్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ప్రభాకర్ రావు శుక్రవారం హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సరెండర్ అయ్యారు. ఇదే సందర్భంగా ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ఎదుట హాజరయ్యారు. ప్రభాకర్ రావును వారం రోజులపాటు కస్టోడియల్ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. చట్టప్రకారం కేసు దర్యాప్తు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు వచ్చిన ఫోన్ ట్యాపింగ్ కేసు రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగానూ తీవ్ర సంచలనం రేపింది. ప్రభాకర్ రావు సారధ్యంలో డీఎస్పీ ప్రణీత్ రావు, డీసీపీ రాధాకిషన్ రావు, ఏసీపీలు భుజంగరావు, తిరుపతయ్యల టీం ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిందనేది అభియోగం. ఎంపిక చేసుకున్న విపక్ష పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల, న్యాయమూర్తుల, జర్నలిస్టుల, సెలబ్రిటీల, ప్రముఖ కాంట్రాక్టర్ల, రియల్ ఎస్టేట్, నగల వ్యాపారుల ఫోన్లను ట్యాపింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈమేరకు నమోదైన కేసులో నిందితుల్లో శ్రవణ్ రావు, ప్రభాకర్ రావు మినహా మిగతా వారిని పోలీసులు అరెస్టు చేసి విచారణ జరిపారు. ఆయా రంగాలకు చెందినవారి, ప్రముఖులు వినియోగించే సుమారు నాలుగు వేల ఫోన్లకు పైగా వారు ట్యాపింగ్ చేసినట్లు విచారణలో సిట్ గుర్తించింది.

జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు వస్తున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (రెడ్ సర్కిల్ లో ఉన్న వ్యక్తి)

అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే కేసులో నిందితులు ట్యాపింగ్ డేటాను ధ్వంసం చేసినట్లు కూడా సిట్ తన పరిశోధనలో గుర్తించింది. కేవలం 300 నుంచి 400కు పైగా ఫోన్ల సమాచారమే అధికారులకు లభ్యమైంది. తద్వారా సేకరించిన ఆధారాల మేరకు పలువురు బాధితులను కూడా విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేశారు. రాధాకిషన్‌ తన నేరాంగీకార స్టేట్ మెంట్ లో మాజీ సీఎం కేసీఆర్‌ ప్రస్తావనను తీసుకువచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇదే కేసులో బీఆర్ఎస్ చీఫ్, అప్పటి సీఎం కేసీఆర్‌కు పదేళ్లపాటు ఓఎస్డీగా పని చేసిన రాజశేఖర్‌ రెడ్డిని సైతం ఇటీవలే సిట్ ప్రశ్నించి వివరాలు రాబట్టింది.

అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, తన సహ నిందితుడు శ్రవణ్ రావుతో కలిసి అమెరికా పారిపోవడం తీవ్ర చర్చకు దారి తీసింది. చివరకు తెలంగాణా పోలీసుల పట్టువిడవని ప్రక్రియ ఫలించి సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణతో ప్రభాకర్ రావు రాష్ట్రానికి తిరిగి రాకతప్పలేదు. కానీ దేశ అత్యున్నత ధర్మాసనానికి ఇచ్చిన హామీ మేరకు ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని, అందువల్ల ఆయనకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేసి కస్టడీకి అనుమతించాలని సిట్ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

దీంతో ఈ కేసులో వాద, ప్రతివాదనలు విన్న తర్వాత ప్రభాకర్ రావును లొంగిపోవాలని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఆదేశించింది. వారం రోజులపాటు ప్రభాకర్ రావును కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు శుక్రవారం పోలీసులకు లొంగిపోయి, సిట్ అదికారుల ఎదుట హాజరయ్యారు. ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ పరిణామాలు ఫోన్ ట్యాపింగ్ ఈ కేసును కీలక మలుపు తిప్పే అవకాశముందనే అభిప్రాయాలు ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి.

Popular Articles