Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

హిడ్మా ఎన్కౌంటర్ ఘటన: చింతూరులో హైదరాబాద్ విద్యార్థుల అడ్డగింత, ఉద్రిక్తత

చింతూరు: ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులను స్థానికులు అడ్డుకున్న సందర్భంగా శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మావోయిస్టులకు వ్యతిరేకంగా గ్రామస్తుల నినాదాలు, నిరసన, ప్లకార్డుల ప్రదర్శన, విద్యార్థుల వాహనం అడ్డగింత వంటి వరుస పరిణామాలతో పోలీసులు అలర్టయ్యారు. హైదరాబాద్ నుంచి వచ్చిన విద్యార్థులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూర్తి వివరాల్లోకి వెడితే..

మావోయిస్టులకు వ్యతిరేకంగా చింతూరులో గ్రామస్తుల నిరసన ప్రదర్శన దృశ్యం

గత నెల 18వ తేదీన మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ ఘటనలో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్కౌంటర్ సంఘటనపై నిజనిర్ధారణ కమిటీ పేరుతో ఉస్మానియా, కాకతీయ, సెంట్రల్ యూనివర్సిటీలకు చెందిన బట్టు వెంకటేశ్వర్లు, లెనిన్, విజయ్, శ్రావణ్, తనుష్, క్రాంతి, పవన్, రవిచందర్,క్రాంతికిరణ్, సాయుధ, రాకేష్, రాజశేఖర్ అనే విద్యార్థులు హైదరాబాద్ నుంచి మారేడుమిల్లికి బయలుదేరారు.

మావోయిస్టుల దిష్టిబొమ్మను దహనం చేసిన దృశ్యం

అయితే మార్గమధ్యంలోనే వీరిని చింతూరులో స్థానికులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ‘మాకొద్దు మాకొద్దు.. మావోయిస్టులు మాకొద్దు’ అంటూ నినాదాలు చేశారు. మావోయిస్టులకు వ్యతిరేక నినాదాలతో ప్లకార్డులు పట్టుకుని ఓయూ విద్యార్థులు ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డగించారు. గ్రామస్తుల నిరసన ప్రదర్శనతో విద్యార్థుల వాహనం వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే దశలో చింతూరు-మారేడుమిల్లి ప్రధాన రహదారిపై మావోయిస్టుల దిష్టిబొమ్మను నిరసనకారుుల దహనం చేశారు. దీంతో చింతూరు మండలం కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైదరాబాద్ నుంచి వచ్చిన విద్యార్థులను పోలీసులు స్టేషన్ కు తీసుకువెళ్లారు.

గ్రామస్తుల నిరసనతో విద్యార్థుల వాహనం వెనక్కి వెడుతున్న దృశ్యం

ఈ ఘటనపై చింతూరు పోలీసులు స్పందిస్తూ, హైదరాబాద్ నుంచి వచ్చిన విద్యార్థులపై దాడి జరిగే అవకాశం ఉండడంతో తాము వారిని స్టేషన్ కు తీసుకువెళ్లి రక్షణ కల్పించినట్లు చెప్పారు. అయితే ఎన్కౌంటర్ సంఘటనపై అధ్యయనం చేసి, వాస్తవాలను సమాజానికి అందించేందుకు తాము మారేడుమిల్లికి వెళ్లనున్నట్లు బహిరంగంగానే లేఖ విడుదల చేశామని విద్యార్థులు ఈ సందర్భంగా చెప్పారు. గ్రామస్తులు తమపై దాడి చేస్తారనే కారణంతో పోలీసులు తమను నిలువరించారని, తాము అక్కడి వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వం ఇందుకు సహకరించకుంటే హైదరాబాద్ లో వాళ్ల పార్టీ ఆఫీసు ఉందని, అక్కడే నిరసన తెలుపుతామని, తెలంగాణా ఉద్యమ తరహాలో స్పందిస్తామని విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు.

చింతూరు పోలీస్ స్టేషన్ ముందు హైదరాబాద్ విద్యార్థులు

Popular Articles