Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

సత్తుపల్లి జింకల పార్కులో ‘సల్మాన్ ఖాన్’ వారసులు

(‘సమీక్ష’ ప్రత్యేక కథనం)
సాధారణంగా వేటగాళ్లు తమ తుపాకులకు అడవుల్లో పని చెబుతుంటారు. లైసెన్సు ఉన్నవో, లేనివో.. లేదంటే ఏ నాటు తుపాకీనో పట్టుకుని, ఫ్లడ్ లైట్ల సాయంతో వన్యప్రాణులను రాత్రివేళల్లో వేటాడుతుంటారు. దట్టమైన అడవుల్లో మాత్రమే గతంలో ఇటువంటి ‘వేట’లు సాగేవి. డబ్బున్న మారాజులు డాబూ, దర్పం ప్రదర్శిస్తూ, మందీ మార్బలాన్నివెంటేసుకుని మరీ అభయారణ్యాల్లో వేటకు వెళ్లేవారు. వేటకోసం వెళ్లిన హంటర్స్ అవసరాన్ని బట్టి రెండు, మూడు రోజులు అడవుల్లోనే తిష్ట వేసేవారు. జీపుల్లో, ఇతరత్రా వాహనాల్లో అవసరమైన ఆహార సామాగ్రిని తీసుకువెళ్లి మరీ వేట సాగించేవారు.

తిరుగు ప్రయాణంలో వేటాడిన దుప్పులను, మనుబోతులను, అడవి పందులను తమ వాహనాల్లో తీసుకువచ్చి ప్రాణ స్నేహితులను, బంధువులను సమీకరించి విందు ఇచ్చేవారు. ఇటువంటి వేట సాగించేవారిలో బడాబాబులు, ‘పవర్’ఫుల్ నేతలు కూడా ఉండేవారనే అంశం వివిధ ఘటనల్లో బహిర్గమైంది కూడా. ఒకరిద్దరు పోలీసు అధికారులు సైతం ఇటువంటి వేట ఘటనల్లో తీవ్ర వివాదాస్పదమయ్యారు. ఉద్యోగాలు కూడా కోల్పోయిన ఉదంతాలు ఉన్నాయి.

వన్యప్రాణుల వేటలో రెండో పద్ధతి ఉంటుంది. అటవీ ప్రాంతాల్లో తమ పంట పొలాలను అడవి పందులనుంచి రక్షించుకోవడానికి పలువురు నాటు బాంబులను వినియోగిస్తారు. ‘బ్లాక్ గన్ పౌడర్, గాజుముక్కలు ఇతరత్రా పేలుడు పదార్థాలతో తయారు చేసే నాటు బాంబులకు ఆహారపూత పూసి పందులు సంచరిస్తున్నట్లు కనిపించే వాటి పాదముద్రల ఆనవాళ్లుగా నాటుబాంబులను పెడతారు. ఆహారపూత పూసిన కారణంగా అది తినే ఆహారమేనని భ్రమించిన పందులు వాటిని కొరుకుతాయి. దీంతో నాటుబాంబు పేలి చనిపోతాయి. రెండు రోజుల క్రితం కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో జరిగిన ఘటనలో ఓ కుక్క కొరికిన నాటు బాంబు తరహా అన్నమాట.

సత్తుపల్లి పార్కులో ఇటీవల మృత్యువాత పడిన జింక (ఫైల్)

వన్యప్రాణుల వేటలో మూడో పద్ధతి కూడా ఉంటుంది. కరెంటు తీగలు అమర్చి వేటాడడం. అడవుల నుంచి వెళ్లే హైటెన్షన్ కరెంటు తీగల ద్వారా విద్యుత్ కనెక్షన్ తీసుకుని ఈ తరహా వేటను కూడా సాగిస్తుంటారు. ఇటువంటి పద్ధతుల్లో మనుషులు కూడా ఆ తీగలను తాకి ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు అనేకం. సాధారణంగా ఈ మూడు పద్ధతుల వేట అడవుల్లో మాత్రమే జరుగుతుంటుంది. కానీ అరణ్యాల నుంచి దప్పికతోనో, మరే ఇతర కారణాలవల్లనో జనారణ్యంలోకి వచ్చే వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జింకల సంరక్షణ పార్కుల్లోనే వన్యప్రాణుల వేట సాగుతుండడం సరికొత్త, సంచలన పద్ధతి.

అడవుల్లోకి వెళ్లి వేట సాగించడం కష్టమనుకున్నారో, దూర ప్రయాణంవల్ల వ్యయ భారంగా భావించారో తెలియదుగాని, సత్తుపల్లి ప్రాంతంలోని కొందరు వన్యప్రాణుల వేటకు స్థానిక జింకల పార్కునే లక్యంగా ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు నాలుగేళ్ల క్రితం 2022 ఫిబ్రవరిలో సత్తుపల్లి-వేంసూరు రోడ్డులో ఏర్పాటు చేసిన 354 ఎకరాల జింకల పార్కులో స్థానిక వేటగాళ్లు స్వైర విహారం చేస్తున్నట్లు ఆయా వార్తా కథనాల సారాంశం. జింకల పార్కులో వన్యప్రాణుల సంరక్షణకు 2.5 కి.మీ. పొడవునా, ఐదు అడుగుల ఎత్తులో ప్రహారీ గోడ ఉన్నప్పటికీ వేటగాళ్లు యధేచ్చగా వేట సాగిస్తున్నారట. అటవీ శాఖకు చెందిన కొందరు సిబ్బంది సహకారంతోనే సైలెన్సర్లు బిగించిన తుపాకులతో జింకలను, దుప్పులను వేటాడి ‘విందు’ చేసుకుంటున్నట్లు వార్తలు వెలువడ్డాయి. చివరికి వేడుకల సందర్బంలోనూ పార్కులో నిరాటంకంగా వేట సాగించి భోజనాల్లో వడ్డిస్తున్నారట.

విషయం వెలుగులోకి వచ్చేసరికి స్పందించిన అటవీ అధికారులు సత్తుపల్లికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే వీరు అనుమానితులు మాత్రమేనని అటవీ అధికారులే స్వయంగా ప్రకటిస్తుండడం గమనార్హం. మొత్తం ఎపిసోడ్ లో అసలు విషయమేమిటంటే.. సత్తుపల్లి జింకలపార్కులో తుపాకీ పట్టి జింకలను వేటాడుతున్న వ్యక్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓ మాజీ ఎమ్మెల్యే సోదరుని కుమారుడిగా ప్రచారం జరుగుతోంది. ఆ మాజీ ఎమ్మెల్యే అండదండలతోనే అతని సోదరుని కుమారుడు బరితెగించి సత్తుపల్లి జింకలపార్కులో నిత్యవేట సాగిస్తున్నట్లు వ్యాప్తిలో గల ప్రచారపు కథనం. ప్రస్తుతం ఇతను పరారీలో ఉన్నాడట. అతని కోసం అటవీ అధికారులు గాలిస్తున్నప్పటికీ ఇప్పటివరకైతే దొరకకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

వాస్తవానికి వన్యప్రాణుల వేట అత్యంత శిక్షార్హం. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారమే కాదు, తెలంగాణా ఫారెస్ట్ యాక్ట్ 1967 ప్రకారం శిక్షలు కఠినంగా ఉంటాయి. ఏడు నుంచి పదేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించవచ్చని చట్టాలు చెబుతున్నాయి. బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ జింకల వేట కేసు దేశంలో ఎంత సంచలనం కలిగించిందో తెలుసిందే. రాజస్థాన్ లో కృష్ణ జింకలను వేటాడారనే అభియోగంపై 1998లో అతనిపై కేసు నమోదైంది. సల్మాన్ ఖాన్ ను జోధ్ పూర్ కోర్టు దోషిగా నిర్ధారించి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 10 వేల జరిమానాను కూడా విధించింది. ఈ కేసులో మిగతా నిందితులుగా పేర్కొన్న సైఫ్ ఆలీ కాన్, సోనాలిబింద్రే, టబు, నీలమ్ లను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. అయితే ఈ కేసులో సల్మాన్ ఖాన్ అప్పీలుకు వెళ్లిన నేపథ్యంలో న్యాయవిచారణ ప్రస్తుతం ఇంకా హైకోర్టు విచారణలోనే ఉన్నట్లు సమాచారం.

మొత్తంగా గమనించాల్సిన అంశమేమిటంటే.. అడవుల్లో స్వేచ్ఛగా జీవించే వన్యప్రాణులు వేటగాళ్ల తుపాకీ గుళ్ల నుంచి కనీసం తప్పించుకుని పారిపోయేందుకు అవకాశం ఉంటుంది. కానీ సత్తుపల్లి పార్కులో అటవీ శాఖ సంరక్షణలో బతకాల్సిన జింకలు మాత్రం స్థానిక ‘సల్మాన్ ఖాన్’ల నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నాయి. అదీ అసలు సంగతి.

Popular Articles