Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కూ తప్పని సైబర్ నేరగాళ్ల బెడద

హైదరాబాద్: మహానగరం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన్నార్ కూ సైబర్ నేరగాళ్ల బెడద తప్పడం లేదు. ఆయన పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్ బుక్ ఖాతాలను క్రియేట్ చేస్తూ, డబ్బు దండుకునే దందాను ప్రారంభించారు. సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి సజ్జన్నార్ స్నేహితుడొకరు ఏకంగా రూ. 20,000 మొత్తాన్ని సమర్పించుకున్నారు. దీంతో సైబర్ నేరగాళ్ల చర్యలపై హైదరాబాద్ సీపీ సజ్జన్నార్ శనివారం స్పందించారు.

తన పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేక్ ఫేస్‌బుక్ ఖాతాలు సృష్టిస్తున్నారని సజ్జన్నార్ స్వయంగా వెల్లడించారు. నకిలీ ఖాతాల ద్వారా తన స్నేహితులకు ‘నేను ఆపదలో ఉన్నాను, డబ్బులు పంపండి’ అంటూ మోసపూరిత మెసేజ్‌లు పంపిస్తున్నారని చెప్పారు. తన స్నేహితుడొకరు ఇది నిజమేనని నమ్మి ₹20,000 మోసగాళ్లకు పంపించాడని చెప్పారు. తన పేరుతో గల నకిలీ ఖాతాలను మెటా సహకారంతో సైబర్ క్రైం టీం తొలగించే పనిలో ఉందని చెప్పారు.

తన పేరుతో, లేదా ఏ అధికారి/ప్రముఖ వ్యక్తి పేరుతో వచ్చే అనుమానాస్పద ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అంగీకరించవద్దని సీపీ సజ్జన్నార్ ఈ సందర్భంగా సూచించారు. డబ్బులు పంపాలని వచ్చే మెసేజ్‌లను అసలు నమ్మవద్దన్నారు. సందేహాస్పద మెసేజ్ వస్తే వెంటనే ఆ వ్యక్తిని ఫోన్‌లో స్వయంగా సంప్రదించి ధృవీకరించుకోవాలన్నారు. అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లు, వీడియో కాల్స్‌ను వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయాలన్నారు.

సైబర్ మోసాలను వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా www.cybercrime.gov.in లో రిపోర్ట్ చేయాలన్నారు. జాగ్రత్తగా ఉంటేనే సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా మన డబ్బును, మన సమాచారాన్ని కాపాడుకోవచ్చని సజ్జన్నార్ పేర్కొన్నారు.

Popular Articles