Top 5 This Week

Related Posts

చీమల ఫోబియాతో మహిళ ఆత్మహత్య

సంగారెడ్డి: చీమల భయంతో ఆత్మహత్య చేసుకున్న మహిళ ఉదంతమిది. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జరిగిన ఈ వింత ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ నరేష్ తెలిపిన ప్రకారం ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని నవ్య హోమ్స్ కాలనీలో నివసించే మనీషా (25) అనే మహిళకు చిందం శ్రీకాంత్ (35)తో 2022 సంవత్సరంలో వివాహం జరిగినది. ఈ దంపతులకు అన్నికా అనే మూడేళ్ల కూతురు ఉంది. అయితే మైర్మోకోఫోబియా అనే వ్యాధి వల్ల మనీషాకు చిన్నప్పటి నుండి చీమలు అంటే భయం. ఈ నేపథ్యంలోనే తన భర్త శ్రీకాంత్ డ్యూటీకి వెళ్ళిన సమయంలో మనీషా ఇంట్లో ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

విధులు ముగించుకుని సాయంత్రం ఐదు గంటల సమయంలో భర్త ఇంటికి వచ్చి చూసేసరికి మెయిన్ డోర్ లోపల నుండి గడియ పెట్టి ఉండడంతో చుట్టుపక్కల వారి సహాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా మనీషా ఇంట్లో ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. ‘ఐయాం సారీ.. అన్ని (కూతురు) జాగ్రత్త.. అన్నవరం, తిరుపతి హుండీలో 1,116 రూపాయలు వేయాలని, అలాగే ఎల్లమ్మకు ఒడి బియ్యం పోయడం మర్చిపోకండి’ అంటూ మనీషా ఓ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ నరేష్ వివరించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Popular Articles