Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

మణుగూరులో తీవ్ర ఉద్రిక్తత, ‘కాంగ్రెస్’ ఆఫీసు స్వాధీనం

మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని బీఆర్ఎస్ ఆఫీసును ముట్టడించి ఫర్నీచర్ ను తగులబెట్టారు. బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ జెండాను ఎగురవేసి తమ పార్టీ కార్యాలయాన్ని తాము తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి, బీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే. అప్పట్లో మణుగూరులోని కాంగ్రెస్ ఆఫీసును బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చారు.

బీఆర్ఎస్ జెండాను తొలగిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు

గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు విజయం సాధించగా, బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేగా కాంతారావు ఓటమి పాలయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మణుగూరులోని బీఆర్ఎస్ ఆఫీసుగా కొనసాగుతున్న భవనాన్ని ముట్టడించి, స్వాధీనం చేసుకున్న సందర్బంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్బంగా జరిగిన పరస్పర తోపులాట, ఘర్షణలో ఇరుపార్టీలకు చెందిన కార్యకర్తలు గాయపడ్డారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఇరు పార్టీల వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఫర్నీచర్ ను తగులబెట్టిన దృశ్యం

Popular Articles