Sunday, January 25, 2026

Top 5 This Week

Related Posts

న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ ‘చావు’ తెలివి తేటలు!

హైదరాబాద్: తాము చాలా తెలివితేటలుగల వాళ్లమని సహజంగానే చాలా మంది జర్నలిస్టులు భావిస్తుంటారు. ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు. కానీ తెలివైనవాళ్లమని అంచనా వేసుకుని, అవే భ్రమల్లో అమాయకంగా జీవిస్తున్న జర్నలిస్టులనే మోసం చేస్తున్న ఓ తెలుగు న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ బాగోతమిది. అసలేం జరుగుతోందో అర్థం కాని పరిస్థితుల్లో హైదరాబాద్ లోని ఓ న్యూస్ ఛానల్ లో పనిచేసిన జర్నలిస్టులు అనేక మంది ‘సమీక్ష’ న్యూస్ ను ఆశ్రయిస్తుండడం విశేషం. ఇక అసలు విషయంలోకి వెడితే..

బాధిత జర్నలిస్టుల కథనం ప్రకారం.. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ప్రాంతంలో గల ఓ న్యూస్ ఛానల్ చాలా కాలంగా తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో అందులో పనిచేస్తున్న జర్నలిస్టులు కొద్ది నెలల క్రితం ఛానల్ ఆఫీసులోనే ఆందోళనకు దిగారు. దీంతో ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి ఫోన్ చేసి పోలీసులను రప్పించాడు. ‘మీరు వెంటనే రాకుంటే జెర్రుంటే సచ్చిపోతుంటిని, నన్ను చంపేయడాానికి నా ఉద్యోగులు ట్రై చేస్తున్నారు’ అంటూ ఎండీ పోలీసుల ముందు వాపోయాడట. అయితే ఆందోళకు దిగిన జర్నలిస్టుల నుంచి అసలు వివరాలు సేకరించిన పోలీసులు ఛానల్ ఎండీకి తలంటుతూ చీవాట్లు పెట్టారు.

ఉద్యోగులతో పనిచేయించుకుంటూ, వేతనాలు చెల్లించకుండా తమను పిలిపించి ఈ నాటకాలేంటి? అని తమదైన రీతిలోనే పోలీసులు ప్రశ్నించడంతో ఎండీ తెల్లముఖం వేశాడు. ‘మీకు రక్షణ కావాలంటే పోలీసు శాఖకు దరఖాస్తు చేసుకోండి, విచారణ తర్వాత మీకు రక్షణ అవసరమని మా డిపార్ట్మెంట్ భావిస్తే గన్ మెన్లను కేటాయిస్తాం. కానీ జర్నలిస్టులకు జీతాలు చెల్లించకుండా మరోసారి పోలీసుల సమయాన్ని వృధా చేస్తే చట్టపరమైన చర్యలకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని చీవాట్లు పెట్టి పోలీసులు వెళ్లిపోయారట.

ఈ ఘటన తదనంతర పరిణామాల్లోనే అనివార్యంగా సదరు ఛానల్ ఎండీ ఉద్యోగులకు జీతభత్యాలు కేవలం ఒక నెల చెల్లించేందుకు తన సంతకంతోనే పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చాడు. పోనీలే కనీసం నెల రోజుల జీతమైనా వస్తుందని తమాయించుకున్న ఉద్యోగులైన జర్నలిస్టులు ఛానల్ ఎండీ ఇచ్చిన చెక్కులను చూసి సంబురపడుతూ తమ తమ బ్యాంకు ఖాతాల్లో కొద్దిరోజుల క్రితమే జమ చేశారు. ఇంకేముంది నేడో, రేపో చెక్కులు క్లియర్ అవుతాయి, జీతం డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి, భార్యా పిల్లలను పోషించుకునేందుకు కాస్త వెసులుబాటు లభిస్తుందని ఆశించారు. కానీ పరిణామాలు అందుకు విరుద్ధంగా తిరగబడడమే అసలు విషాదం. ఇంతకీ ఏం జరిగిందంటారా? అయితే దిగువన గల బ్యాంక్ మెసేజ్ ను ఓసారి చదవండి.

అర్థమైంది కదా మెసేజ్ సారాంశం. సదరు ఛానల్ లో పనిచేసిన ఓ జర్నలిస్టుకు ఇచ్చిన చెక్కులో రాసిన రూ. 37,200 మొత్తాన్ని చెల్లించకుండా ‘స్టాప్ పేమెంట్’ రిక్వెస్ట్ పెట్టింది సంస్థ యాజమాన్యం. అదేవిధంగా మరో ఉద్యోగికి చెల్లించాల్సిన రూ. 32,867 మొత్తం అంశంలోనూ ఛానల్ యాజమాన్యం ఇలాగే వ్యవహరించింది. చెక్కు చెల్లుబాటు కాకపోవడానికి గల కారణాన్ని బ్యాంకు క్లియర్ గానే చెప్పింది. ‘PAYMENT STOPPED BY THE DRAWER’ అని బ్యాంకు కారణాన్ని వెల్లడించింది. అయితే ఈ చెక్కులు ఇప్పటికే రెండు, మూడుసార్లు బ్యాంకులో దాఖలు చేసినా జర్నలిస్టుల అకౌంట్లలోకి డబ్బు చేరలేదు.

పైగా చెక్కులు బ్యాంకులో దాఖలు చేసిన ప్రతీసారి ఛార్జీల కింద రూ. 200పైచిలుకు మొత్తానికి చిల్లు పడుతుండడంతో బాధిత జర్నలిస్టులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కుంటున్నారు. చెక్కులు పాస్ కాకుండా, బౌన్స్ అయినట్లు తేలకుండా ఏం జరుగుతోందో అర్థం కాని అయోమయ స్థితిని ఎదుర్కుంటున్నారు. ఈ రెండు ఘటనలు ఉదాహరణలు మాత్రమే. దాదాపు 30-35 మంది జర్నలిస్టుల పరిస్థితి ఇదే. అందరి చెక్కులదీ ఆగమ్యగోచర స్థితి. ఇంతకీ చెక్కులు ఇచ్చిన సంస్థ ఎండీ చెల్లింపులను నిలిపివేయాలని బ్యాంకు ఎందుకు కోరారో తెలుసా?

పోస్ట్ డేటెడ్ చెక్కులు బ్యాంకులకు చేరడానికి ముందే ఛానల్ ఎండీ ‘STOP PAYMENT’ ఆప్షన్ ను ఎందుకు ఎంచుకున్నాడో తెలుసా? (ఆన్ లైన్ ద్వారా అకౌంట్ హోల్డర్లకు ప్రస్తుతం ఈ ఆప్షన్ ఉన్నట్లు బ్యాంకు వర్గాలు స్పష్టం చేశాయి. లేదంటే లిఖిపూర్వకంగానూ బ్యాంకులను ఈ విధంగా అభ్యర్థించవచ్చుట) అతను ఈ ఆప్షన్ ను ఎంచుకోకుంటే, సంస్థ అకౌంట్ లో సరిపడా నగదు నిల్వలు లేకుంటే ఇచ్చిన చెక్కులు బౌన్స్ అవుతాయి. చెక్కు ఇచ్చిన వారిపై బౌన్స్ కేసులు నమోదు చేయవచ్చు. అందువల్ల చెక్ బౌన్స్ కేసు నుంచి బయటపడవచ్చనే ముందస్తు అంచనాతో ‘STOP PAYMENT’ అప్షన్ ను అతను ఎంచుకుని ఉంటాడని బ్యాంకు వర్గాల అంచనా.

కానీ న్యాయవాద వర్గాలు ఈ అంశంలో క్లారిటీ ఇవ్వడం గమనార్హం. చెక్కులు ఇచ్చినవారు ఇలా వ్యవహరించినప్పటికీ మోసం కిందకే వస్తుందని, ఎన్ఐఏ (నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్) సెక్షన్ 138 రెడ్ విత్ 142 కింద కేసు పెట్టవచ్చని న్యాయవాద వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఉద్యోగులకు వేతనాలు చెల్లించకుండా తనదైన శైలి పద్ధతుల్లో మోసం చేస్తున్న సదరు న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ పై న్యాయపోరాటానికి బాధిత జర్నలిస్టులు సంసిద్ధమవుతున్నారు. ఓవైపు కార్మిక శాఖకు ఫిర్యాదు చేస్తూనే, ఇంకోవైపు న్యాయస్థానాల్లో పోరాటానికి బాధిత జర్నలిస్టులు ఉద్యుక్తమవుతున్నారు.

సీనియర్ జర్నలిస్ట్ ఎడమ సమ్మిరెడ్డి దాఖలు చేసిన కేసులో ఖమ్మం జిల్లా లేబర్ కోర్టు డిప్యూటీ కమిషనర్ కె. విజయభాస్కర్ రెడ్డి తాజాగా ఇచ్చిన తీర్పు తమకు ఎంతో ధైర్యాన్నిచ్చిందని పేర్కొంటూ బాధిత జర్నలిస్టులు ‘సమీక్ష’ న్యూస్ ను ఆశ్రయిస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలోనే తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఛానల్ లో పనిచేస్తున్న, జీతాలు ఇవ్వకుండా అర్థంతరంగా తొలగించిన జర్నలిస్టులు సైతం పోరాటం వైపు పయనిస్తుండడం గమనార్హం. నిన్న ఖమ్మం డీసీఎల్ కోర్టు ఇచ్చిన తీర్పునకు సంబంధించి సమీక్ష ప్రచురించిన వార్తా కథనాన్ని చదవిన అనంతరం ఈ ఛానల్ కు చెందిన జర్నలిస్టులు పోరాటానికి సిద్ధపడడం గమనార్హం.

తాము పనిచేసిన ఛానల్ లోనూ తమకు జరిగిన అన్యాయంపై కూడా అవసరమైన సహాయం చేయాలని బాధిత జర్నలిస్టులు పలువురు ‘సమీక్ష’ను కోరారు. ఈ అంశంలో అవసరమైన, శక్తివంచన లేని అన్నిరకాల సహాయాన్ని బాధిత జర్నలిస్టులకు అందిస్తుందని ‘సమీక్ష న్యూస్’ హామీ ఇస్తున్నది. ‘పోరాడితే పోయేదేం లేదు, న్యాయమే దక్కుతుంది’ అని కూడా సమీక్ష ఈ సందర్బంగా సదరు ఛానల్ జర్నలిస్టులకు భరోసా కల్పిస్తోంది. అంతేకాదు ‘ఇదంతా కల్పితం, దమ్ముంటే నేను ఇచ్చిన చెక్కులను బహిర్గతం చేయాలి’ అని తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో సదరు ఛానల్ ఎండీ సవాల్ చేస్తే అందుకు సిద్దంగానే ఉన్నట్లు ‘సమీక్ష’ న్యూస్ గర్వంగా ప్రకటిస్తోంది కూడా. ఇప్పుడెందుకు ప్రచురించడం లేదంటే న్యాయపోరాటానికి దిగబోతున్న జర్నలిస్టులకు సాంకేతికంగా ఇబ్బంది కలగరాదనే ఉద్ధేశంతో మాత్రమే.

Popular Articles