Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

‘లా అండ్ ఆర్డర్’పై తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి కీలక ప్రకటన

హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్య, అతన్ని చంపిన పాత నేరస్థుడు రియాజ్ ఎన్కౌంటర్ పరిణామాల నేపథ్యంలో తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి కీలక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ను పూర్తి స్థాయిలో కాపాడేందుకు తెలంగాణ పోలీసు శాఖ నిబద్దతతో ఉందని స్పష్టం చేశారు. ఎలాంటి తీవ్ర నేరస్తులను అయినా కఠినంగా అణచివేస్తామన్నారు. కరడుగట్టిన నేరస్తుడు షేక్ రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన పోలీస్ కానిస్టేబుల్, అమరుడు ఎంపల్లి ప్రమోద్ కుమార్ కు పోలీసు శాఖ తరుపున ఘన నివాళులు అర్పిస్తున్నట్లు డీజీపీ పేర్కొన్నారు.

అదేవిధంగా ప్రమోద్ ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం, పోలీసు శాఖ పూర్తి స్తాయిలో అండగా ఉంటుందన్నారు. GO Rt No. 411 ప్రకారం ఒక కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్ పదవీ విరమణవరకు లాస్ట్ పే డ్రాన్ సాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామన్నారు. అంతేగాక GO 155 ప్రకారం 300 గజాల ఇంటి స్థలం మంజూరు, అలాగే పోలీస్ భద్రత సంక్షేమం నుండి 16 లక్షల ఎక్స్ గ్రేషియా, పోలీస్ వెల్ఫేర్ నుండి 8 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రమోద్ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తరుపున నివాళి అర్పిస్తున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు.

Popular Articles